Sanjay Raut Gets Bail:


బెయిల్ మంజూరు చేసిన PMLA కోర్టు..


శివసేన సీనియర్ నేత సంజయ్‌ రౌత్‌కు బెయిల్‌ లభించింది. పత్రా చాల్ స్కామ్‌ కేసులో భాగంగా ఆయనను ఈడీ అధికారులు మూడు నెలల క్రితం అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి విచారణ కొనసాగుతోంది. ఆయనను ముంబయిలోని జైల్లో ఉంచారు. PMLA కోర్ట్ ఆయన జ్యుడీషియల్ కస్టడీని 14 రోజుల పాటు పొడిగిస్తూ నవంబర్ 2న నిర్ణయం తీసుకుంది. రౌత్ బెయిల్ పిటిషన్‌ను రిజర్వ్‌లో ఉంచింది. అయితే..ఇవాళ బెయిల్‌ ఇస్తూ తీర్పునిచ్చింది. అరెస్ట్ అయ్యాక దాదాపు 101 రోజుల తరవాత బెయిల్ లభించినట్టైంది. మనీలాండరింగ్ యాక్ట్‌కు సంబంధించిన కేసులను విచారించే స్పెషల్ జడ్జ్ ఎమ్‌జీ దేశ్‌పాండే గత వారం వరకూ ఈ తీర్పుని రిజర్వ్‌లో ఉంచారు. పత్రా చాల్ కుంభకోణంలో సంజయ్ రౌత్ హస్తం ఉందని ఈడీ అధికారులు ఈ ఏడాది జులైలో అరెస్ట్ చేశారు. అయితే...ఈ స్కామ్‌కు తనకు ఎలాంటి సంబంధం లేదని రౌత్ వేసిన 
పిటిషన్‌ను ఈడీ ఖండించింది. ఈ స్కామ్‌కి సంజయ్ రౌత్‌కి సంబంధం ఉందని తమ విచారణలో తేలిందని స్పష్టం చేస్తోంది. అంతే కాదు. సంజయ్ రౌత్ సతీమణికి కూడా ఇందులో హస్తం ఉందని తేల్చి చెప్పింది.





 
 
ఏంటీ కేసు..? 


2007లో అప్పటి మహారాష్ట్ర ప్రభుత్వం పత్రచాల్‌ ప్రాంతంలో 3వేల ఫ్లాట్లు నిర్మించడానికి గురుఆశీష్ కన్‌స్ట్రక్షన్స్‌కు 1034 కోట్ల విలువైన ప్రాజెక్ట్ కేటాయించింది. ఇందుకోసం 47 ఎకరాల భూమిని ఈ కంపెనీకి అప్పగించింది. గురుఆశీష్ కన్‌స్ట్రక్షన్స్‌ డైరెక్టర్లలో ఒకరైన ప్రవీణ్‌ రౌత్‌.. శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్‌కు అత్యంత సన్నిహితుడు. ప్రవీణ్ రౌత్ భార్య మాధురి సంజయ్‌ రౌత్ సతీమణి వర్షకు 55 లక్షలు వడ్డీలేని రుణం ఇచ్చినట్టు ఈడీ విచారణలో తేలింది. అంతేకాక, మాధురి, వర్షా  కలిసి ఆలీబాగ్‌లో ఓ భూమి కూడా కొనుగోలుచేశారు. ఈ ల్యాండ్ డీల్‌పైనా ఈడీ కూపీ లాగుతోంది. ఈ కేసులోనే రౌత్ ఆస్తులు అటాచ్ చేసింది. 


ఈడీ తీరుపై అసహనం..


సంజయ్ రౌత్ కోర్టులో గతంలో తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇన్నాళ్లు కస్టడీలో ఉన్న ఆయన, ఈడీ తనతో వ్యవహరించిన తీరుపై ఆగ్రహించారు. కిటికీలు, వెంటిలేషన్‌ లేని రూమ్‌లో తనను ఉంచారని అన్నారు. ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్ PMLAకి సంబంధించిన హియరింగ్స్‌ కోసం నియమించిన స్పెషల్ కోర్ట్ జడ్జ్‌కి ఇది వివరించారు సంజయ్ రౌత్. ఈడీపై ఏమైనా ఫిర్యాదులున్నాయా అని జడ్జ్ అడిగిన సందర్భంలో ఈ ప్రస్తావన తీసుకొచ్చారు. అయితే దీనిపై వివరణ ఇవ్వాలని కోర్టు ఈడీని ఆదేశించింది. ఈడీ తరపున న్యాయవాదికి ఇందుకు వివరణ ఇచ్చారు. సంజయ్ రౌత్‌ను AC గదిలో ఉంచామని, అందుకే కిటికీ లేదని చెప్పారు. దీనిపై సంజయ్‌ రౌత్‌ను ప్రశ్నించగా.."తన గదిలో ఏసీ ఉందని, కానీ తన ఆరోగ్య పరిస్థితుల కారణంగా ఆన్ చేసుకోలేదని" అని అన్నారు. వెంటనే స్పందించిన ఈడీ, వెంటిలేషన్ ఉన్న గదిలోనే సంజయ్‌ రౌత్‌ను ఉంచుతామని స్పష్టం చేసింది. మొత్తానికి ఎన్నో రోజుల నిరీక్షణ తరవాత సంజయ్‌కు బెయిల్ దొరికింది. 


Also Read: Aruna Miller: అమెరికాలో అరుదైన రికార్డు సృష్టించిన హైదరాబాదీ, లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌గా అరుణ మిల్లర్