Nitin Gadkari Praises Manmohan Singh:
ఆర్థిక సంస్కరణలు..
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ...మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌పై ప్రశంసల జల్లు కురిపించారు. TIOL Fiscal Heritage Award 2022 కార్యక్రమానికి హాజరైన ఆయన..కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. స్వేచ్ఛాయుత ఆర్థిక విధానాన్ని వ్యూహాత్మకంగా తీర్చిదిద్దటంలో మన్మోహన్ సఫలం అయ్యారని అన్నారు. సమాజంలో వెనకబడిన వర్గాలకూ ప్రాధాన్యత దక్కేలా మార్పులు చేర్పులు చేశారని కొనియాడారు. "దేశ ఆర్థిక
వ్యవస్థకు మన్మోహన్ సింగ్ కొత్త దారిని చూపారు. ఆయనకు దేశమంతా రుణపడి ఉంటుంది" అని కితాబునిచ్చారు. 1991లో ఆర్థిక మంత్రిగా ఉన్న మన్మోహన్ సింగ్..దేశ ఆర్థిక సంస్కరణల్లో కీలక పాత్ర పోషించారని అన్నారు. ఆ సమయంలో ప్రధాని పీవీ నర్సింహరావుతో కలిసి ఆర్థిక సంస్కరణలు అమలు చేశారు మన్మోహన్. విదేశీ మారక ద్రవ్య నిల్వలు పెంచటం, ఆర్థిక సుస్థిరత, అభివృద్ధి, పబ్లిక్, ప్రైవేట్ రంగాల మధ్య దూరం తగ్గించటం లాంటి కీలక లక్ష్యాలతో అప్పట్లో ఈ సంస్కరణలు అమలు చేశారు. అవే...దేశ ఆర్థిక వ్యవస్థను సమూలంగా మార్చేశాయి. 1990ల్లో తాను మహారాష్ట్రలో మంత్రిగా ఉన్నప్పుడు రోడ్ల నిర్మాణానికి పెద్ద ఎత్తు నిధులు సమీకరించారని, ఆయన చేపట్టినసంస్కరణలను ఎప్పటికీ మర్చిపోలేమని అన్నారు. ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్...లైసెన్స్ రాజ్ చట్టాన్ని రద్దు చేశారు. ఈ చట్టం వల్లే దేశ ఆర్థిక వ్యవస్థ దశాబ్దాల పాటు మందగమనంగా సాగిందని నిపుణులు చెబుతుంటారు. మన్మోహన్ నిర్ణయంతో ఆ సమస్యకు పరిష్కారం దొరికిందని వివరిస్తూ ఉంటారు. ఇప్పుడిదే విషయాన్ని గడ్కరీ మరోసారి గుర్తు చేశారు. కష్టకాలంలో మన్మోహన్ సింగ్...ఆర్థిక మంత్రిగా, ప్రధానిగా దేశాన్ని ముందుకు తీసుకెళ్లారని ప్రశంసించారు.
ఇలా చేశారు..
1991 జూన్ 21వ తేదీన పీవీ నరసింహారావు ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. నిర్ణీత గడువులోగా భారతదేశం విదేశీ అప్పును చెల్లించలేకపోతుందని, డీఫాల్టర్‌గా ప్రకటించుకుంటుందని అప్పట్లో అంతా భావించారు. కానీ, మన్మోహన్ సింగ్‌ను ఆర్థిక మంత్రిగా పెట్టుకున్న పీవీ నరసింహారావు పలు సంస్కరణలు తీసుకొచ్చారు. నిర్మాణాత్మక మార్పులతో భారతదేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టారు. మన్మోహన్ సింగ్ అనే ఆర్థిక వేత్తకు..... ఆర్థికమంత్రి పదవి ఇచ్చి ఈ దేశాన్ని పీవీ నెక్ట్ ఫేజ్ వైపు నడిపించారు. చాలా మంది 1991 జులై 24ను భారతదేశ ఆర్థిక స్వాతంత్ర్య దినోత్సవం అని కూడా అంటారు. ఆ రోజు సమర్పించిన బడ్జెట్ భారతదేశంలో ఆర్థిక సంస్కరణలకు బాటలు పరిచింది. ఓపెన్ ఎకానమీగా... ప్రభుత్వ పెట్టుబడులను తగ్గించి, ప్రైవేటు సంస్థలను ప్రోత్సహించే ఆర్థిక సంస్కరణలను ప్రకటిస్తూ అప్పటి ఆర్థికమంత్రి మన్మోహన్ సింగ్ జులై 24, 1991న బడ్జెట్ ప్రవేశపెట్టారు. దేశీయ మార్కెట్లో కంపెనీల మధ్య పోటీ పెంచారు. లైసెన్సింగ్ రాజ్ కు చరమగీతం పాడారు. కంపెనీలు పర్మిట్ల నుంచి విముక్తి పొందాయి. ఎగుమతులను ప్రోత్సహించడం, దిగుమతి లైసెన్సింగ్‌లో సడలింపులే లక్ష్యంగా బడ్జెట్‌లో చాలా మార్పులు ప్రకటించారు.