Vande Bharat Express: రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న వందే భారత్ (ట్రైన్ - 18) ఎక్స్ ప్రెస్ తెలంగాణకు రావడం దాదాపుగా ఖరారైంది. దక్షిణ మధ్య రైల్వేకు తొలి రైలును రైల్వే బోర్డు కేటాయించినట్లు ఇక్కడి అధికారులకు సమాచారం వచ్చింది. ఈ ఎక్స్ ప్రెస్ ను సికింద్రాబాద్ నుంచి ఏ మార్గంలో డిపించాలనే విషయంపై రైల్వే బోర్డు కసరత్తు చేస్తోంది. అత్యంత ఆధునిక, వేగవంతమైన రైలు అయినప్పటికీ ప్రస్తుతానికి ఇందులో బెర్తులు లేవు. శతాబ్ది ఎక్స్ ప్రెస్ మాదిరిగా కూర్చుని ప్రయాణించాల్సి ఉంటుంది. కాబట్టి ఎక్కువ దూరం, రాత్రంతా ప్రయాణం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గరిష్ఠంగా 10 గంటల్లోనే చేరే గమ్యస్థానాలను పరిగణలోకి తీసుకుంటున్నట్లు సమాచారం. ఉదయమే బయలు దేరి సాయంత్రానికి లేదా రాత్రి 9, 10 గంటల్లోపు గమ్య స్థానం చేరేలా కసరత్తు చేస్తున్నారు. సికింద్రాబాద్ నుంచి తిరుపతి, విశాఖపపట్నం, బెంగళూరు, ముంబయి వంటి మార్గాల్ని పరిశీలిస్తున్నారు.
విశాఖ, బెంగళూరు, తిరుపతికే ఎక్కువ డిమాండ్..
సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం, తిరుపతి, బెంగళూరు నగరాలకు రైలు రిజర్వేషన్ కు ఎక్కవ డిమాండ్ ఉంటుంది. విశాఖ వైపు నిత్యం దాదాపు డజను రైళ్లున్నా అంత సులభంగా రిజర్వేషన్ దొరకదు. తిరుపతి వెళ్లే వారయితే నెల రోజుల ముందే రిజర్వేషన్ చేయించుకుంటారు. బెంగళూరుకు రైలు కంటే బస్సుల్లోనే రెండు గంటల ముందే చేరుకుంటుండటంతో బస్సు ప్రయాణానికి ఎక్కువ మంది ప్రాధాన్యం ఇస్తున్నారు. చెన్నైలోని ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీలో తయారయ్యే వందే భారత్ ఎక్స్ ప్రెస్ లకు గరిష్ఠంగా 180 కిలో మీటర్ల వేగంతో ప్రయాణించే సామర్థ్యం ఉంది. ఇవి ఇప్పటి వరకు నాలుగు పట్టాలు ఎక్కాయి. అయిదోది మైసూర్ - బెంగళూరు - చెన్నై రైలు ఈ నెల 10వ పట్టాలు ఎక్కనుంది. దక్షిణ భారతానికి ఇదే తొలి రైలు.
వందేభారత్ ఎక్స్ ప్రెస్ సికింద్రాబాద్ స్టేషన్ నుంచి అందుబాటులోకి రాబోతుందని సికింద్రాబాద్ డీఆర్ఎం అభయ్ కుమార్ గుప్తా తెలిపారు. ఈ ఎక్స్ ప్రెస్ నిర్వహణకు అయిదారు గంటల సమయం పడుతుందని, ఎప్పటినుంచి ప్రారంభం అవుతుందో ఇంకా స్పష్టత రాలేదన్నారు. వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలు నిర్వహణకు సిద్ధంగా ఉండాలని, అందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని తమకు సమాచారం వచ్చిందన్నారు. త్వరలోనే రూట్ వివరాలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చెప్పారు.
సికింద్రాబాద్ నుంచే వందే భారత్ ఎక్స్ ప్రెస్ మొదలవుతుందని ఓ అధికారి తెలిపారు. రైల్వే బోర్డు అధికారులు సికింద్రాబాద్ - బెంగళూరు మధ్య వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను ప్రవేశ పెట్టేందుకు మొగ్గు చూపుతున్నారు. రాష్ట్రం నుంచి బయలు దేరేలా వందే భఆరత్ ఎక్స్ ప్రెస్ రైళ్లు కావాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇటీవల రైల్వే మంత్రి అశ్వినీ కుమార్ వైష్ణవ్ ను కలిసి కోరారు. సికింద్రాబాద్ నుంచి విజయవాడ మీదుగా తిరుపతికి లేదంటే విశాఖపట్నానికి నడపాలని ఆయన స్పష్టం చేసినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే ఆయా రూట్లలో డిమాండ్, సాంకేతికత వంటి అంశాల గురించి ఆరా తీస్తోంది. మరోవైపు మహిళా ప్రయాణికుల కోసం సుదూరం ప్రయాణించే ఎక్స్ ప్రెస్ రైళ్లలో ఆరు వరకు బెర్తులు రిజర్వ్ చేయాలని రైల్వే శాఖ ఇటీవల నిర్ణయం తీసుకుంది.