Who is Salman Rushdie: 


బుకర్ ప్రైజ్‌ పొందిన రచయిత


భారత సంతతికి చెందిన ప్రముఖ రచయిత సల్మాన్ రష్దీపై దాడి జరగటం భారత్‌నే కాదు. అమెరికానూ షాక్‌కు గురి చేసింది. మెడకు తీవ్ర గాయాలయ్యాయని, ఆయన మాట్లాడలేకపోతున్నారని ఇప్పటికే వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతానికి ఆయనను వెంటిలేటర్‌పై ఉంచారు. దాదాపు 5 దశాబ్దాలుగా సాహిత్య రంగంలో ప్రయాణం చేస్తున్న సల్మాన్ రష్దీకి ఎన్నో సార్లు చంపేస్తామంటూ బెదిరింపులు వచ్చాయి. ఆయన రచనా శైలే అందుకు కారణం. ఆయన తీసుకునే సబ్జెక్ట్‌లూ అంత వివాదాస్పదంగా ఉంటాయి. భారత సంతతికి చెందిన ఈ బ్రిటీష్ రచయిత రాసిన రెండో నవల సంచలనం సృష్టించింది. "Midnight's Children"నవలకు 1981లో బుకర్ ప్రైజ్‌ కూడా లభించింది. అయితే..ఆయన రచించిన నాలుగో నవల...పూర్తిగా వివాదాల్లోకి లాగింది. అప్పటి నుంచి ఆయనకు శత్రువులు తయారయ్యారు. అంతర్జాతీయంగా విమర్శలు ఎదుర్కొన్నారు. ఆ నవల పేరు "The Satanic Verses".ఈ బుక్‌ను పబ్లిష్ చేసినప్పటి నుంచి ముస్లింల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదుర్కొన్నారు సల్మాన్ రష్దీ. ఈ పుస్తకం ముస్లింల మనోభావాలు దెబ్బ తీసేలా ఉందని తీవ్రంగా మాటల దాడికి దిగారు కొందరు. ఈ నవలలో మహమ్మద్ ప్రవక్తను అవమానించారంటూ పెద్ద దుమారమే రేగింది. చాలా చోట్ల రక్తపాతం జరిగింది. చంపేస్తామంటూ కొందరు ఆయనను బెదిరించారు. చాన్నాళ్ల పాటు ఎవరి కంట కనబడకుండా కాలం గడిపిన సల్మాన్ రష్దీకి బ్రిటీష్ ప్రభుత్వం రక్షణ కల్పించింది. ముస్లిం దేశమైన ఇరాన్... యూకేతో సంబంధాలు తెంచుకుంది. 1989లో అప్పటి ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతొల్లా రుహొల్లా కోమినేని..సల్మాన్‌పై ఫత్వా జారీ చేశారు. అయితే పశ్చిమ దేశాల్లోని రచయితలు..సల్మాన్‌కు అండగా నిలిచాయి. ఆయనకు భావప్రకటనా స్వేచ్ఛ లేదా..? అని ప్రశ్నించాయి. 


ఇస్లాం చరిత్రను వక్రీకరించారనే..?


భారత్‌కు స్వాతంత్య్రం వచ్చే రెండు రోజుల ముందు ముంబయిలో జన్మించారు సల్మాన్ రష్దీ. 14 ఏళ్ల వయసులోనే ఇంగ్లాండ్‌కు వెళ్లారు. బ్రిటీష్ పౌరసత్వం పొందారు. క్రమక్రమంగా ఇస్లాం మతంపై నమ్మకం కోల్పోయారు. రచయితగానే కాకుండా నటనలోనూ ప్రతిభ కనబరిచారు. తరవాత పూర్తి స్థాయిలో రచయితగానే స్థిరపడ్డారు. ఆయన రాసిన సానాటిక్ వెర్సెస్ నవల వివాదాస్పదం అవటం వల్ల వెంటనే భారత్‌ ఆ పుస్తకాన్ని నిషేధించింది. ఈ బుక్‌ను బ్యాన్‌ చేసిన మొట్టమొదటి దేశం భారత్. ఆ తరవాత పాకిస్థాన్ సహా మరి కొన్ని ముస్లిం దేశాలు ఇదే నిర్ణయం తీసుకున్నాయి. నిజానికి ఈ నవలకు "విట్‌బ్రెడ్" పురస్కారం లభించింది. అయితే ముస్లింలు ఈ పుస్తకంలోని కొన్ని అంశాలపై ముస్లింలు తీవ్రంగా స్పందించారు. ఇస్లాం చరిత్రలో "వ్యభిచారం" చేసే ఇద్దరు మహిళలను...మహమ్మద్ ప్రవక్త భార్యలుగా ఈ నవలలో ప్రస్తావించటం పట్ల ఆ వర్గం భగ్గుమంది. అంతే కాదు. టైటిల్‌లో "వెర్సెస్" అనే పదంపైనా దుమారం రేగింది. ఖురాన్‌ నుంచి మహమ్మద్ ప్రవక్త ఈ పదాన్ని తొలగించారని, అది చెడుకు సంకేతమని ముస్లింలు వాదించారు. అయితే సల్మాన్ రష్దీ మాత్రం ఇది "దైవదూషణ" కాదు అని తేల్చి చెప్పారు. అయినా...అగ్ని చల్లారలేదు. సల్మాన్ సొంత ఊరైన ముంబయిలో పెద్ద ఎత్తున అల్లర్లు జరిగాయి. 12 మంది మృతి చెందారు. సల్మాన్ రష్దీ తలపై 3 మిలియన్ డాలర్ల నజరానా ప్రకటించారు. అమెరికా, ఫ్రాన్స్ సహా పలు పశ్చిమ దేశాలు దీన్ని తీవ్రంగా ఖండించాయి. యూకేలో కొందరు ముస్లిం లీడర్లను సపోర్ట్ చేయగా..మరికొందరు సల్మాన్‌కి మద్దతుగా నిలబడ్డారు. 


డెత్ వారెంట్ వాపస్..


సల్మాన్‌ రష్దీకి మాత్రమే కాదు. ఈ నవలను అనువదించిన ఇతర భాషల్లోని రచయితలూ ఇలాంచి దాడులే ఎదుర్కొన్నారు. జపనీస్ ట్రాన్స్‌లేటర్‌ను 1991లో టోక్యోలో అతి దారుణంగా హత్య చేశారు. ఇటలీలో ట్రాన్స్‌లేట్ చేసిన రచయితపైనా కత్తులతో దాడి చేయగా..బతికి బయటపడ్డారు. ఇప్పుడు సల్మాన్‌ రష్దీ టార్గెట్ అయ్యారు. నాలుగు పెళ్లిళ్లు చేసుకున్న సల్మాన్‌కు..ఇద్దరు పిల్లలున్నారు. ప్రస్తుతానికి ఆయన అమెరికాలో ఉంటున్నారు. 1998లో ఇరాన్ ప్రభుత్వం డెత్ వారెంట్‌ను వెనక్కి తీసుకుంది. ఈ మధ్య కాలంలో కాస్త బయటకు వస్తూ యాక్టివ్‌గా కనిపిస్తున్న ఆయనపై ఉన్నట్టుండి ఈ దాడి జరగటం...సంచలనమైంది. 


Also Read: Karthikeya 2 Movie Review - కార్తికేయ 2 రివ్యూ : ద్వారకా నగరం - శ్రీకృష్ణుడు దాచిన రహస్యం - నిఖిల్ సినిమా ఎలా ఉందంటే?


Also Read: Independence Day 2022: ఆగస్టు 15, జనవరి 26న జెండా ఆవిష్కరణలో ఇంత తేడా ఉందా!