Indians In Foreign Leagues: విదేశీ టీ20 క్రికెట్‌ లీగులను చూసి బీసీసీఐ నిజంగానే ఆందోళన చెందుతున్నట్టు అనిపిస్తోంది! అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికినప్పటికీ భారతీయులను అనుమతించబోమని చెబుతోంది. ఎంఎస్‌ ధోనీ తరహా ఆటగాళ్లు విదేశీ ఫ్రాంచైజీలకు మెంటార్‌గా ఉండాలన్నా ఐపీఎల్‌తో అనుబంధం తెంచుకోవాలని స్పష్టం చేస్తోంది.


ప్రపంచ వ్యాప్తంగా టీ20 లీగ్‌ క్రికెట్‌ వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఇప్పటికే బిగ్‌బాష్‌, కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌, పాకిస్థాన్‌ సూపర్‌ లీగ్‌ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. తాజాగా దుబాయ్‌, దక్షిణాఫ్రికా టీ20 లీగులు ఆరంభమవుతున్నాయి. క్రికెట్‌ దక్షిణాఫ్రికా నిర్వహించే లీగులో అన్ని ఫ్రాంచైజీలను ఐపీఎల్‌ యాజమాన్యాలే దక్కించుకున్నాయి. వీరు భారత క్రికెటర్లను అనుమతించాలని ఎక్కడ ఒత్తిడి చేస్తారోనని బీసీసీఐ ఆందోళన చెందుతోంది. ఒకవేళ ఆడాలన్నా, సహాయ సిబ్బందిగా చేరాలన్నా బోర్డుతో అనుబంధం పూర్తిగా తెంచుకోవాలని స్పష్టం చేస్తోంది.


'అన్ని రకాల క్రికెట్‌కు వీడ్కోలు పలికేంత వరకు ఏ భారత ఆటగాడినీ విదేశీ లీగుల్లోకి అనుమతించం. దేశవాళీ క్రికెటర్లకూ ఇదే వర్తిస్తుంది. ఎవరైనా ఆ లీగుల్లో మెంటార్‌, కోచ్‌, ఇతర పాత్రలు పోషించాలనుకుంటే బోర్డుతో అన్ని బంధాలు తెంచుకోవాలి' అని బీసీసీఐ అధికారి ఒకరు ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌కు తెలిపారు.


టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనీ ఆ లీగుల్లో మెంటార్‌ లేదా కోచ్‌గా ఉండొచ్చా అని ప్రశ్నించగా 'అలాంటప్పుడు అతడు సీఎస్‌కే తరఫున ఐపీఎల్‌ ఆడొద్దు. ముందు దానికి వీడ్కోలు పలకాలి' అని స్పష్టం చేశారు. 


సీఎస్‌ఏ టీ20 లీగులో కేప్‌టౌన్‌ ఫ్రాంచైజీని ముంబయి ఇండియన్స్‌ దక్కించుకుంది. వేలానికి ముందే ఐదుగురు ఆటగాళ్లతో ఒప్పందం కుదుర్చుకున్నామని వెల్లడించింది. మిస్టరీ స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌, లియామ్‌ లివింగ్‌స్టన్‌, సామ్‌ కరణ్‌, కాగిసో రబాడా, డీవాల్డ్‌ బ్రూవిస్‌ను తీసుకుంది. లీగ్‌ నిబంధనల ప్రకారం ఆరు ఫ్రాంచైజీలు ముందుగానే ఐదుగురు ఆటగాళ్లను తీసుకోవచ్చు. అందులో ముగ్గురు విదేశీయులు, ఒక దక్షిణాఫ్రికా ఆటగాడు, ఇంకా అరంగేట్రం చేయని సఫారీ క్రికెటర్‌ను తీసుకోవాలి. అందరి కన్నా ముందుగా ఎంఐ కేప్‌టౌన్‌ ఆటగాళ్లతో ఒప్పందం కుదుర్చుకుంది.


'ఎంఐ కేప్‌టౌన్‌ జట్టు నిర్మాణం మొదలు పెట్టడం ఉత్సాహంగా ఉంది' అని రిలయన్స్‌ జియో ఛైర్మన్‌, ఎంఐ కేప్‌టౌన్‌ యజమాని ఆకాశ్‌ అంబానీ అన్నారు. 'మొదట కీలక ఆటగాళ్లను తీసుకోవడం ముంబయి ఇండియన్స్‌ తత్వం! వారిని ఆధారంగా చేసుకొని మిగిలిన జట్టును నిర్మిస్తాం. రషీద్‌, కాగిసో, లియామ్‌, సామ్‌ను ఎంఐలోకి ఆహ్వానిస్తున్నాం. ఇప్పటికే మాతో ఉన్న డీవాల్డ్‌ బ్రూవిస్‌ మాలాగే సరికొత్త ప్రయాణం మొదలు పెడతాడు' అని ఆయన పేర్కొన్నారు.