Sakhi One Stop Centre Scheme For Women: వన్‌ స్టాఫ్‌ సెంటర్‌.. కేంద్ర ప్రభుత్వ నిధులతో అమలు చేస్తున్న స్కీమ్‌ ఇది. ఈ స్కీమ్‌లో భాగంగా మహిళలపై జరిగే వేధింపులు, వివక్ష నుంచి రక్షణ కల్పించేందుకు ఈ స్కీమ్‌ ఉపయోగపడుతుంది. మహిళా సాధికారితే ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం దీన్ని రూపొందించింది. నిర్భయ ఫండ్‌ నుంచి ఈ స్కీమ్‌ అమలుకు అవసరమైన నిధులను కేంద్రం సమకూరుస్తోంది. ఈ స్కీమ్‌లో భాగంగా జిల్లా కేంద్రాల్లో వన్‌ స్టాప్‌ సెంటర్లను ఏర్పాటు చేస్తారు. ఆయా సెంటర్లలో కౌన్సిలర్‌, లీగల్‌ అడ్వైజర్‌, సోషల్‌ వర్కర్స్‌, సెంటర్‌ మేనేజర్‌తో సహా పలువురు సిబ్బంది పని చేస్తారు. వీరు ప్రధానగా గృహ హింస, పని చేసే ప్రాంతాల్లో మహిళలకు వేధింపులకు సంబంధించిన ఫిర్యాదులను ఇక్కడ స్వీకరిస్తారు. కేంద్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రామ్‌ను అమలు చేస్తున్నారు. జిల్లా స్థాయిలో ఐసీడీఎస్‌ పీడీ, సీడీపీవో, ఇతర అధికారులు ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రామ్‌ను అమలు చేస్తారు. 


లింగ ఆధారిత హింస నుంచి రక్షణకు


దేశంలో లింగ ఆధారిత హింస, వేధింపులు నుంచి రక్షణకు ఈ స్కీమ్‌ను ఏర్పాటు చేశారు. గృహ, లైంగిక వేధింపులు, పరువు హత్యలు, వరకట్నం, యాసిడ్‌ దాడులు, మహిళలు అక్రమ రవాణా, బలవంతపు సెక్స్‌, అబార్షన్లు చేయడం వంటి వేధింపులు నుంచి మహిళలు, బాలికలను రక్షించేందుకు అవసరమైన న్యాయ, మెడికల్‌ సహాయాన్ని అందిస్తారు. మహిళ తన సమస్యతో వచ్చిన వెంటనే ఈ సెంటర్‌ సిబ్బంది సమస్యను తెలుసుకుంటారు. అత్యవసరంగా అందించాల్సిన వైద్య సేవలు అందిస్తారు. నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ సహాయంతో 108 సేవలు, పీసీఆర్‌ వ్యాన్‌లతో సేవలు అందించే ఏర్పాట్లు చేస్తారు. తరువాత బాధిత మహిళ సమపీంలోని ఆస్పత్రికిగానీ, షెల్డర్‌ హోమ్‌కుగానీ తరలిస్తారు. ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళ పరిస్థితిని బట్టి ఈ సెంటర్‌లో ఉండే కౌన్సిలర్‌ ఆధ్వర్యంలో కౌన్సిలింగ్‌ ఇస్తారు. అవసరమైన న్యాయ సహాయాన్ని అందించేందుకు ఈ సెంటర్‌లో ఉండే న్యాయవాది సహకారాన్ని అందిస్తారు. 


ఎవరికి సహాయం చేస్తారు..?


వన్‌ స్టాప్‌ సెంటర్‌లో 18 ఏళ్లలోపు వయసున్న బాలికలు, 18 ఏళ్ల కంటే ఎక్కువ వయసున్న మహిళలకు వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను బట్టి అవసరమైన సహకారాన్ని అందిస్తారు. బాధిత మహిళలు అత్యవసర పరిస్థితుల్లో ఐదు రోజులపాటు ఇక్కడ తాత్కాలిక వసతి పొందే అవకాశం ఉంది. ఎనిమిది ఏళ్ల కంటే ఎక్కు వయసు ఉన్న అబ్బాయిలు మాత్రం ఈ సెంటర్‌లో తల్లితో ఉండేందుకు అవకాశం లేదు. బాధిత మహిళలు ఈ తాత్కాళిక వసతి పొందినన్ని రోజులు అవసరమైన ఆహారాన్ని, మందులు, ఇతర సౌకర్యాలను ఉచితంగా కల్పిస్తారు. 


సహాయం ఎలా పొందవచ్చు.. 


బాధిత మహిళలు నేరుగా సెంటర్‌కు వెళ్లి ఫిర్యదు చేయడం ద్వారాగానీ, స్థానికంగా ఉండే అంగన్వాడీ సిబ్బంది సహకారంతోగానీ ఫిర్యాదు చేసేందుకు అవకాశం ఉంది. తనకు సహకారాన్ని అందించే వ్యక్తులను నేరుగా ఈ కేంద్రాలకు పంపించడం ద్వారాగానీ సహకారాన్ని పొందేందుకు అవకాశం ఉంది.