Sadhguru Jaggi Vasudev Discharged: సద్గురు జగ్గీవాసుదేవ్‌కి (Sadhguru Jaggi Vasudev Brain Surgery) ఇటీవలే బ్రెయిన్ సర్జరీ జరిగింది. ఢిల్లీలోని ఇంద్రప్రస్థ అపోలో హాస్పిటల్స్‌లో చికిత్స తీసుకున్న ఆయన కోలుకున్నారు. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. మార్చి 17వ తేదీన ఆయన తీవ్రమైన తలనొప్పితో ఆసుపత్రిలో చేరారు. మార్చి 15వ తేదీన MRI స్కాన్ చేసిన డాక్టర్లు బ్రెయిన్‌లో బ్లీడింగ్ అయినట్టు గుర్తించారు. వెంటనే సర్జరీ చేయాలని సూచించారు. మార్చి 17 నాటికి తలనొప్పి మరింత తీవ్రమైంది. వాంతులు కూడా అయినట్టు ఈశా ఫౌండేషన్ వెల్లడించింది. అప్పటికప్పుడు ఆయన షెడ్యూల్‌ని రద్దు చేసుకుని హాస్పిటల్‌లో చేర్చినట్టు తెలిపింది. ఆ రోజే వైద్యులు సర్జరీ చేశారు. అప్పటి నుంచి హాస్పిటల్‌లోనే ఉన్న సద్గురు మధ్యలో ఓ వీడియో కూడా విడుదల చేశారు. తనకు సర్జరీ జరిగిందని, ప్రస్తుతం కోలుకుంటున్నానని చెప్పారు. ఇప్పుడు పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అపోలో హాస్పిటల్స్ గ్రూప్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సంగీతా రెడ్డి ఆసుపత్రిలో సద్గురుని కలిశారు. ఆయన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని వైద్యులు చెప్పినట్టు వివరించారు. 


"సద్గురు త్వరగానే కోలుకున్నారు. ఆయన ఆరోగ్యం పట్ల వైద్యులూ సంతోషం వ్యక్తం చేశారు. కోలుకునే క్రమంలోనూ సద్గురు ఎక్కడా తన ఉత్సాహాన్ని కోల్పోలేదు. ప్రపంచ మేలు కోసం ఆయన ఆలోచించే తీరు చాలా గొప్పది. ఆయన హాస్య చతురత కూడా సాటిలేనిది. సద్గురు ఆరోగ్యం గురించి ఆరా తీస్తున్న లక్షలాది మంది అభిమానులకు ఇది శుభవార్త"


- డాక్టర్ సంగీతా రెడ్డి, అపోలో హాస్పిటల్స్ గ్రూప్ జాయింట్ డైరెక్టర్ 






సద్గురుకి సర్జరీ చేసిన వైద్యులందరికీ ఈశా ఫౌండేషన్ ధన్యవాదాలు తెలిపింది. ఆయనని కంటికి రెప్పలా కాపాడుకున్న వాళ్లందరికీ కృతజ్ఞతలు చెప్పింది. హాస్పిటల్‌లో ఉన్నప్పుడు సద్గురుపై ప్రేమాభిమానాలు చూపినందుకు థాంక్స్ చెప్పింది.