Russia Ukraine War:
ఓడిపోయినట్టే: మ్యాగజైన్..
ఉక్రెయిన్‌లోని ఖేర్సన్ నుంచి రష్యా బలగాలు వెనక్కి వెళ్లిపోవడాన్ని ఏ దేశమూ ఊహించలేదు. అప్పటికే...రష్యాపై అంతర్జాతీయంగా తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. ఆ దేశ సైనికులూ భారీ సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. ఫలితంగా...పుతిన్ ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు. అయితే...పుతిన్ నిర్ణయాన్ని ఓటమిగా భావించవచ్చని అంటోంది ఓ నివేదిక. రష్యన్ ఇండిపెండెంట్ న్యూస్ మ్యాగజైన్ "Meduza"లో
రష్యా సైనికుల ఉపసంహరణపై వచ్చిన వార్తలు అదే సూచిస్తున్నాయి. "చాలా బాధాకర" స్థితిలో రష్యా ఈ నిర్ణయం తీసుకుందని అందులో పేర్కొంది. "ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే ఒకటి స్పష్టంగా అర్థమవుతోంది. యుద్ధంలో మేం ఓడిపోతున్నామనటానికి ఇది సంకేతం కావచ్చు. రష్యా సైనికులు ఉక్రెయిన్‌లో ఎలా మనుగడ సాగించాలో ఆలోచిస్తున్నారు. ఏ ప్రాంతాన్ని అధీనంలోకి తీసుకోవాలి..? ఎంత వ్యూహాత్మకంగా ముందుకెళ్లాలి..? అని ఆలోచిస్తున్నారు. మరో వైపు...పరిస్థితులు సాధారణ స్థితికి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి" అని ఆ మ్యాగజైన్ వెల్లడించింది. అయితే..పుతిన్ ఇంకా నమ్మకం కోల్పోలేదని...ఉక్రెయిన్‌లో తనకు అనకూల అధ్యక్షుడు అధికారంలోకి వస్తే ఉక్రెయిన్‌ను సులువుగా హస్తగతం చేసుకోవచ్చని భావిస్తున్నారని తెలిపింది. పుతిన్ ఆశాభావం ఉన్న వ్యక్తి అని చెప్పింది. "ఉక్రెయిన్ రాజకీయాల్లో భారీ మార్పులు వస్తే పుతిన్‌కు అదో గొప్ప అవకాశమవుతుంది. అధ్యక్షుడు జెలెన్‌స్కీ రాజీనామా చేస్తే...రష్యాకు అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. కానీ..ఇలాంటివి ఆశించటం అప్రస్తుతమే అవుతుంది" అని పేర్కొంది. "రష్యా సైన్యం ఇప్పటికే విచ్ఛిన్నమవుతుంది" అని కొందరు నిపుణులు చెబుతున్నారు. "యుద్ధ రంగంలో ఉన్న రష్యా సైనికులను నడిపించే సమర్థ నాయకత్వం అవసరం. భారీ ఆయుధాలు సమకూర్చుకోవటమూ చాలా కీలకం" అని అంటున్నారు. నిజానికి..8 నెలలుగా సాగుతున్న ఈ యుద్ధంలో రష్యా వైపు భారీ నష్టం జరిగింది. క్రమంగా యుద్ధ సామర్థ్యం తగ్గిపోతోంది. అటు ఉక్రెయిన్‌కు అంతర్జాతీయ మద్దతు పెరుగుతోంది. అమెరికా, ఫ్రాన్స్ సహా పలు దేశాలు అండగా నిలుస్తున్నాయి.
లక్ష మంది రష్యా సైనికులు మృతి..
మొత్తం ఈ యుద్ధం కారణంగా..40 వేల మంది ఉక్రెయిన్ పౌరులు, లక్ష మంది రష్యా సైనికులు చనిపోయారని తెలుస్తోంది. అటు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఇప్పటికే ఓ కీలక ప్రకటన చేశారు. రష్యాతో శాంతియుత చర్చలకు సిద్ధమేనని వెల్లడించారు. అయితే...ఇప్పటి వరకూ రష్యా ఆక్రమించుకున్న భూభాగాలను తిరిగి వెనక్కు ఇచ్చేయాలన్న కండీషన్‌పైనే తాను చర్చలకు ముందుకొస్తానని వెల్లడించారు. ఖేర్సన్ నుంచి సైనిక బలగాలను ఉపసంహరించుకున్న సమయంలోనే రష్యా ఓ ప్రకటన చేసింది. శాంతియుత చర్చలకు తామూ సిద్ధంగా ఉన్నట్టు తెలిపింది. అయితే... ఖేర్సన్‌లో 20-30 వేల మంది రష్యా సైనికులున్నారని, ఉపసంహరణకు కొన్ని వారాల సమయం పట్టే అవకాశముందని అమెరికా చెబుతోంది. కేవలం తమ సైన్యాన్ని కాపాడుకోవాలన్న ఆలోచనతోనే రష్యా ఈ నిర్ణయం తీసుకుందని అగ్రరాజ్యానికి చెందిన ఆర్మీ ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు.
Also Read: Russia Ukraine War: ఉక్రెయిన్‌కు పెరుగుతున్న సపోర్ట్, పుతిన్ ఇకనైనా తగ్గుతారా..?