Gujarat Election 2022:


రికార్డు స్థాయిలో గెలవాలి: మోడీ


గుజరాత్‌ పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారంలో జోరు పెంచారు. ఇప్పటికే వాపిలో రోడ్ షో నిర్వహించిన ఆయన...నేడు వేరవాల్‌లో భారీ బహిరంగ సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత రికార్డులన్నీ బద్దలు కొట్టి భారీ మెజార్టీతో బీజేపీని గెలిపించాలని ప్రజలను కోరారు. ప్రతి ఎన్నికల్లోనూ బీజేపీ గెలవాలని ఆకాంక్షించారు. "గుజరాత్ గురించి ఎన్నో విమర్శలు వినిపించాయి. ఇక్కడ అభివృద్ధి జరగనే జరగని ఎద్దేవా చేశారు. ఇలాంటి వ్యాఖ్యలకు, విమర్శలకు బీజేపీ ప్రభుత్వం చెక్ పెట్టింది. గుజరాత్‌ను అన్ని విధాలుగా అభివృద్ధి చేసింది. ప్రతి పథకం..ప్రజలకు సంక్షేమాన్నిచ్చింది" అని ప్రధాని మోడీ అన్నారు. గుజరాత్ తీరప్రాంత వాణిజ్యం జోరందుకుందని, ఇక్కడి నౌకాశ్రయాలు...భారత్‌కు గేట్‌వేగా మారాయని చెప్పారు. "సౌరాష్ట్రలో ఇదే నా తొలి ర్యాలీ. ఎడారి లాంటి కచ్ ప్రాంతాన్ని గుజరాత్‌కు "తోరణంగా" మార్చాం" అని అన్నారు. ఇదే సమయంలో గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌పైప్రశంసల వర్షం కురిపించారు ప్రధాని మోడీ. "రాష్ట్ర అభివృద్ధికి భూపేంద్ర పటేల్ ఎంతో కృషి చేశారు. ఈ పురోగతి ఇంకా ముందుకెళ్లాలని ఆకాంక్షిస్తున్నాను. మరోసారి బీజేపీకి అవకాశం ఇవ్వండి ఇది కచ్చితంగా సాధ్యపడుతుంది" అని అన్నారు. 


సౌరాష్ట్ర కీలకం..


గుజరాత్‌లో సౌరాష్ట్ర ప్రాంతానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. మొత్తం 182 నియోజకవర్గాలున్న రాష్ట్రంలో...ఒక్క సౌరాష్ట్రలోని 48 నియోజక వర్గాలున్నాయి. ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే...ఈ 48 సీట్లలో గెలవటం చాలా కీలకం. మరో ముఖ్యమైన అంశం ఏంటంటే...ఈ నియోజకవర్గాల్లో ఎక్కువగా పాటిదార్‌లు, ఓబీసీ వర్గానికి చెందిన వాళ్లుంటారు. గత ఎన్నికల్లో బీజేపీ పాటీదార్ల ఓటు బ్యాంకుని దక్కించు కోవడంలో విఫలమైంది. అప్పుడు కాంగ్రెస్‌కు ఆ ఓట్లన్నీ వెళ్లిపోయాయి. ఇప్పుడదే రిపీట్‌ కాకుండా చూసేందుకు బీజేపీ జాగ్రత్త పడుతోంది. అందుకే...ఈ ప్రాంతం నుంచే ప్రచారం మొదలు పెట్టనుంది. అందులోనూ ఈ సారి పాటిదార్ ఉద్యమ నేత హార్దిక్ పటేల్ బీజేపీ తరపున బరిలోకి దిగుతున్నారు. ఆ మేరకు కొంత వరకూ బీజేపీ వైపు సానుకూలత ఉండే అవకాశముంది. గత ఎన్నికల్లో అంటే కాంగ్రెస్ ఏదో నెట్టుకొచ్చింది కానీ...ఈ సారి మాత్రం ఈ ప్రాంతంపై పట్టు సాధిస్తాం అని బీజేపీ సీనియర్ నేతలు చాలా ధీమాగా చెబుతున్నారు. గత ఎన్నికల్లో 
పాటిదార్ ఉద్యమం కారణంగా...బీజేపీపై వ్యతిరేకత పెరిగి అందరూ కాంగ్రెస్‌కు ఓటు వేశారు. ఫలితంగా...చెప్పుకోదగ్గ సీట్లు సాధించింది ఆ పార్టీ. ఇప్పుడు గట్టి పోటీ ఇచ్చే అవకాశాలు తక్కువేనంటున్నారు. ఇక బీజేపీని ఢీకొట్టేందుకు రెడీ అవుతున్న ఆప్ కూడా పాటిదార్ వర్గానికి చెందిన నేతనే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించి..బీజేపీ వ్యూహాలకు చెక్ పెట్టింది. ఈ రకంగా చూస్తే...బీజేపీపై ఇంకా వ్యతిరేకత ఉన్న పాటిదార్ వర్గ ఓటర్లు...ఆప్‌ వైపు మళ్లే అవకాశాలు లేకపోలేదు.


Also Read: Gujarat Election 2022: మోడీ రోడ్‌షోలో ఆసక్తికర ఘటన,చిన్నారికి సర్‌ప్రైజ్ ఇచ్చిన ప్రధాని