Gujarat Election 2022:
తన ఫోటో పట్టుకున్న బాలికను చూసి..
గుజరాత్ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. శనివారం రాత్రి వాపి ప్రాంతంలో రోడ్‌షో నిర్వహిస్తుండగా ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. కార్‌లోనే నిలబడి అందరికీ అభివాదం చేస్తూ ముందుకు వెళ్తున్న ప్రధాని మోడీ..ఉన్నట్టుండి తన సెక్యూరిటీ సిబ్బందికి ఏదో చెప్పారు. ఆయన చెప్పిన వెంటనే భద్రతా సిబ్బంది పక్కకు పరుగులు తీస్తూ వచ్చి ఓ బాలిక చేతుల్లోని ఫోటోని తీసుకుని మోడీకి అందించారు. ఇది చూసి అందరూ ఆశ్చర్యపోయారు. మోడీ రోడ్‌షో నిర్వహిస్తుండగా.. ఓ 13 ఏళ్ల బాలిక మోడీ ఫోటోను పట్టుకుని చూపిస్తూ ఉంది. ఓసారైనా మోడీ చూడకపోతారా అని ఆశగా ఎదురు చూస్తోంది. ఇది గమనించిన ప్రధాని వెంటనే సెక్యూరిటీ సిబ్బందిని అలర్ట్ చేశారు. ఆ ఫోటో తీసుకోవాలని ఆదేశించారు. ఆయన ఆదేశాల మేరకు ఆ ఫోటోను తీసుకున్నారు భద్రతా సిబ్బంది. "రోడ్‌షోలో నన్ను ప్రధాని మోడీ చూశారు. నా చేతుల్లో ఉన్న ఫోటోని తీసుకోవాలని సూచించారు"అని సంతోషం వ్యక్తం చేసింది 13 ఏళ్ల అమి భటు.
రోబో ప్రచారం..
గుజరాత్ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఆప్, భాజపా, కాంగ్రెస్ క్షేత్రస్థాయిలో చాలా యాక్టివ్‌గా కనిపిస్తున్నాయి. బీజేపీ కంచుకోటను బద్దలు కొట్టేందుకు ఆప్ గట్టిగా ప్రయత్నిస్తోంది. బీజేపీ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ సీట్ల సంఖ్య పెంచుకోవాలని భీష్మ ప్రతిజ్ఞ చేసింది. గతంలో కన్నా రికార్డు స్థాయి మెజార్టీతో గెలవాలని సంకల్పించుకుంది. ప్రచారంలోనూ కొత్తదనంతో ముందుకెళ్తోంది. ఓటర్లను ఆకట్టుకునేందుకు రోబోతో ప్రచారం నిర్వహిస్తోంది. ఇంటింటికీ వెళ్లి పాంప్లెట్స్ పంచడం నుంచి ప్రచారానికి అవసరమైన కీలకమైన పనులన్నింటినీ రోబోతోనే చేయిస్తోంది బీజేపీ. మరో విశేషం ఏంటంటే...ప్రచార నినాదాలను ముందుగా రికార్డ్ చేసి ఇందులో అమర్చారు. ప్రచార సమయంలో ఆ నినాదాలను వినిపిస్తూ చకచకా దూసుకుపోతోంది రోబో. ఈ రోబోను తయారు చేసిన హర్షిత్ పటేల్ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. "ఈ రోబో ప్రజలందరికీ పాంప్లెట్స్ పంచి పెడుతుంది. డోర్ టు డో క్యాంపెయిన్‌లోనూ దీన్ని వినియోగిస్తున్నాం. ప్రచార నినాదాలనూ రికార్డ్ చేసి అమర్చాం" అని చెప్పారు.