Russia Ukraine War: రష్యా- ఉక్రెయిన్ మధ్య యుద్ధం మొదలై దాదాపు 11 నెలల పూర్తవుతోంది. అయినప్పటికీ రష్యా వెనక్కి తగ్గడం లేదు.. ఉక్రెయిన్ కూడా పట్టు వదలడం లేదు. అయితే తాజాగా ఇరు దేశాల మధ్య చర్చల అంశం తెరపైకి వచ్చింది. కానీ రష్యా మాత్రం తమ షరతులకు ఒప్పుకుంటే యుద్ధాన్ని ముగిస్తామని తేల్చి చెబుతోంది.
యుద్ధాన్ని ముగించాలంటే మా షరతులు ఏమిటో ఉక్రెయిన్‌కు బాగా తెలుసని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ అన్నారు. వాటిని పూర్తిచేస్తే ఆ దేశానికే మంచిదని లేకపోతే తమ సైన్యం నిర్ణయిస్తుందని లావ్రోవ్ నేరుగా హెచ్చరించారు.
ఉక్రెయిన్ యుద్ధాన్ని త్వరలోనే ముగిస్తామంటూ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇటీవల ప్రకటించారు. అయితే చర్చలకు తాము సిద్దమని కానీ ఉక్రెయిన్ వెనుకాడుతోందన్నారు.
భారత్ సాయం
రష్యా మిత్రదేశమైన భారత్.. మధ్యవర్తిత్వం వహించాలని ఉక్రెయిన్ ఆశిస్తోంది. ఇందుకోసం జెలెన్‌స్కీ.. ప్రధాని మోదీతో టెలిఫోన్‌లో మాట్లాడారు. యుద్ధనేరాలకు బాధ్యులైనవారిని శిక్షించడం, ఉక్రెయిన్ నుంచి రష్యా బలగాలన్నింటినీ ఉపసంహరించడం, తమ ప్రాదేశిక సమగ్రతను పునరుద్ధరించడం వంటి 10 అంశాల శాంతి ప్రణాళికను మోదీకి వివరించినట్లు జెలెన్‌స్కీ చెప్పారు.
పుతిన్
రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇటీవల కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యాలో భాగమని మాస్కో ప్రకటించిన ఉక్రెయిన్‌లోని నాలుగు ప్రాంతాల పరిస్థితి చాలా దయనీయంగా ఉందని పుతిన్ అన్నారు. రష్యా డ్రోన్‌లతో దాడి చేసిన తర్వాత కీవ్ మరిన్ని ఆయుధాలను సమీకరిస్తుందని పుతిన్ తెలిపారు.
రష్యాలో ఘనంగా జరుపుకునే సెక్యూరిటీ సర్వీసెస్ డే సందర్భంగా పుతిన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా తమ సరిహద్దుల్లో భద్రతను పెంచాలని పుతిన్ ఆదేశించారు.
ఉక్రెయిన్‌లోని నాలుగు ప్రాంతాలను తమ భూభాగంలో కలుపుకుంటున్నట్లు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇటీవల సంతకం చేశారు. దొనెట్స్క్, లుహాన్స్క్, జపోరిజియా, ఖేర్సన్ ప్రాంతాలను రష్యాలో అధికారికంగా విలీనం చేస్తున్నట్లు పుతిన్ సంతకం చేశారు. అయితే...ఇవి ఉక్రెయిన్ భూభాగంలో ఉన్నప్పటికీ...అక్కడ మెజార్టీ ప్రజలు తాము రష్యాలో ఉండేందుకే ఆసక్తి చూపుతున్నారని పుతిన్ అన్నారు.
రష్యా నిర్వహించిన ఓటింగ్‌లో ఇది తేలిందని తెలిపారు. నిజానికి..వీటిని స్వతంత్ర ప్రాంతాలుగా గుర్తిస్తామని...ఉక్రెయిన్‌పై సైనిక చర్య మొదలు పెట్టిన సమయంలోనే పుతిన్ ప్రకటించారు. రష్యా అధికారికంగా ఆ ప్రాంతాలను తన భూభాగంలో విలీనం చేసుకోనుంది. తద్వారా ఉక్రెయిన్‌లో 15% భూభాగం రష్యాలో కలిసినట్టవుతుంది.
Also Read: Russian Politician Dies: రష్యాలో పుతిన్‌ను విమర్శిస్తే ఒడిశాలో శవమై తేలాడు!