Bihar Crime News: ఎవరికైనా తీవ్రంగా కోపం వచ్చినప్పుడు నరిక కాకులకు గద్దలకు వేస్తానని చెప్తారు, కోసి ఉప్పూకారం పెడ్తానంటూ బెదిరిస్తారు. కానీ ఓ బిహార్ కు చెందిన ఓ వ్యక్తి మాట వరసకు అనే ఈ మాటలను నిజం చేశాడు. తన చెల్లి ప్రియుడిపై కోపం పెంచుకున్న అతడు.. నిజంగానే అతడిని నరికి చంపేశాడు. ఆపై మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికి వీధి కుక్కలకు ఆహారంగా వేశాడు. 


16వ తేదీ నుంచి కనిపించకుండా పోయిన బిట్టు..


బిహార్ కు చెందిన బిట్టు కుమార్ అనే యువకుడు ఈనెల 16వ తేదీన బయటకు వెళ్లాడు. కానీ రాత్రి అయిపోతున్నా అతడు తిరిగి ఇంటికి రాలేదు. దీంతో అతడి కుటుంబ సభ్యులు.. బిట్టు స్నేహితులు, బంధువులకు ఫోన్ చేసి అడిగారు. ఎవరూ తమ వద్దకు రాలేదని చెప్పడంతో అతడు తరచుగా వెళ్లే ప్రాంతాల్లో గాలించారు. అక్కడ కూడా అతని ఆచూకీ లభించకపోవండతో.. డిసెంబర్ 18వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలోనే నిందితుడు రాహుల్ పై అనుమనం వచ్చి అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి దగ్గర ఉన్న బాధితుడి మొబైల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం తమదైన శైలిలో విచారించగా... రాహుల్ నేరాన్ని అంగీకరించాడు. 


ముక్కలుగా నరికి వీధి కుక్కలకు వేసిన రాహుల్


అయితే తన సోదరితో బిట్టు సన్నిహితంగా ఉండడం చూసి తాను తట్టుకోలేకపోయానని, అందుకే అతడిపై కోపం పెంచుకున్నట్లు వివరించారు. డిసెంబర్ 16వ తేదీన పథకం ప్రకారమే బిట్టును నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లినట్లు చెప్పాడు. అక్కడే అతడిని నరికి చంపేసి, మృతదేహాన్ని ముక్కలు చేసినట్లు వివరించాడు. ఆ తర్వాత ఆ శరీర భాగాలను వీధి కుక్కలకు ఆహారంగా పెట్టినట్లు తెలిపాడు. మిగతా వాటిని నదిలో పడేశానని చెప్పాడు. 


ఇటీవలే దిల్లీలోనూ ఇలాంటి ఘటనే..!


దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్ హత్య ఘటన మరువకముందే మరో ఘోరం బయటకు వచ్చింది. దిల్లీలో తన భర్తను కుమారుడి సాయంతో చంపి.. ముక్కలుగా నరికేసి నగరంలోని వివిధ ప్రాంతాల్లో పడేసింది భార్య. ఈ కేసులో పాండవ్ నగర్‌లో మహిళతో పాటు ఆమె కొడుకును క్రైం బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. పాండవ నగర్‌లో ఓ మహిళ తన కుమారుడితో కలిసి భర్తను దారుణంగా హత్య చేసింది. అనంతరం శవాన్ని ముక్కలు ముక్కలుగా నరికి ఫ్రిజ్‌లో దాచింది. ఆ తర్వాత రోజుకు కొన్ని శరీర భాగాల చొప్పున తీసుకెళ్లి గ్రౌండ్‌లో పడేసింది. పాండవ్ నగర్‌లో ఈ దారుణం జరిగింది. ఆ తల్లి, కుమారుడిని దిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు.  ఈ ఇద్దరు కలిసే హత్య చేసి, శవాన్ని ముక్కలుగా చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఫ్రిజ్‌లో దాచిన శరీర భాగాలను పాండవ్ నగర్‌లోని గ్రౌండ్‌తో పాటు, తూర్పు దిల్లీలో ఓ చోట పడేసినట్లు గుర్తించారు. మొదట తూర్పు దిల్లీలో ఓ శవం శరీర భాగాన్ని గుర్తించామని.. సీసీటీవీలు పరిశీలించగా అసలు విషయం వెలుగులోకి వచ్చిందని పోలీసులు పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని పోలీసులు బయటపెట్టారు.