శ్రీలంక సమీపాన నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం నైరుతి దిశగా కదులుతున్నందున సోమవారం దక్షిణ కోస్తా తమిళనాడు, దక్షిణ కేరళలో భారీ వర్షాలు కురిశాయి. నేడు కూడా ఆ ప్రాంతాల్లో చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు చెప్పారు.
మరోవైపు, దేశంలోని ఉత్తరాది రాష్ట్రాల్లో చలిగాలులు పెరిగాయి. రాజధాని ఢిల్లీతో పాటు హరియాణా, చండీఘడ్, అమృతసర్ ప్రాంతాల్లో సోమవారం ఉదయం దట్టమైన పొగమంచు కమ్ముకుంది. ఉత్తరాది రాష్ట్రాల్లో ఐదు రోజుల పాటు దట్టమైన పొగమంచు కమ్ముకుంటుందని భారత వాతావరణ విభాగం హెచ్చరిక చేసింది. ఢిల్లీలో సోమవారం ఉదయం కనిష్ఠ ఉష్ణోగ్రత 4 డిగ్రీల సెల్షియస్ అని నమోదైంది.
పంజాబ్, హరియాణా - చండీగఢ్ - ఢిల్లీ, ఉత్తర రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లోని కొన్ని ప్రాంతాల్లో చలి గాలులు తీవ్రంగా ఉన్నాయి. రాబోయే రెండు రోజుల్లో రాజస్థాన్ లోని సౌరాష్ట్ర, కచ్ మీదుగా చలిగాలుల పరిస్థితులు కూడా చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు.
‘‘నేడు అక్కడక్కడ మాత్రమే, కొద్ది పాటి వర్షాలను చూడగలము. నిన్న శ్రీలంక మీదుగా ఉన్న అల్పపీడనం నేడు హిందూ మహాసముద్రం వైపుగా వెళ్లింది. దీని వలన మనం నేడు కొద్దిసేపు వర్షాలు, ఎండ మారుతూ ఉండడాన్ని గమనించవచ్చు. దక్షిణ ఆంధ్ర జిల్లాలైన నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు అలాగే సత్యసాయి జిల్లాల్లో ఇలాంటి వాతావరణం చూడగలం. కడప జిల్లాలోని పలు భాగాల్లో కూడా వర్షాలు ఉంటాయి. రేపటికి ఈ వర్షాలు మరింత తగ్గుముఖం పట్టనుంది.’’ అని ఏపీ వెదర్ మ్యాన్ తెలిపారు.
తెలంగాణ వాతావరణం
తెలంగాణ వ్యాప్తంగా నేటి నుంచి వచ్చే 3 రోజుల పాటు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ‘‘హైదరాబాద్ లో ఆకాశం మేఘాలు పట్టి ఉంటుంది. నగరంలో పొగ మంచు ఉదయం సమయంలో ఏర్పడే అవకాశం ఉంది. గరిష్ణ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 29 డిగ్రీలు, 20 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి గాలులు 6 నుంచి 10 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది’’ అని హైదరాబాద్ లోని వాతావరణ విభాగం అధికారులు ట్వీట్ చేశారు.