ఎన్నో గంటల ప్రసవవేదన అనంతరం బిడ్డను ఎత్తుకున్న తల్లికి ఆ ఆనందం కాసేపు కూడా ఉండదు. కారణం బిడ్డకు కామెర్లు ఉన్నాయి, లైట్స్ కింద పెట్టాలి అంటూ నర్సులు తీసుకెళ్లిపోతారు. మూడు రోజుల పాటూ లైట్స్ కిందే ఉంచాలని, పాలు పెట్టినప్పుడు మాత్రమే బయటికి తీయాలని చెబుతారు. ఎందుకిలా పుట్టిన పిల్లలకు కామెర్లు వస్తాయి? వీటిని ఎప్పుడు సీరియస్‌గా తీసుకోవాలి?


ఇది సాధారణమే...
పుట్టిన వెంటనే దాదాపు 70 శాతానికి పైగా పిల్లల్లో కామెర్లు కనిపిస్తాయి. పుట్టిన రెండో రోజు నుంచే కామెర్లు బయటపడతాయి. అయితే వీటిని చూసి భయపడక్కర్లేదు. వీటికి కాలేయానికి ఎలాంటి సంబంధం లేదు. పుట్టిన తరువాత బయట వాతావరణానికి అలవాటు పడేందుకు బిడ్డల శరీరంలో చాలా మార్పులు జరుగుతాయి. అలాంటి సమయంలో కామెర్లు కనిపిస్తాయి. ఫోటో థెరపీ లైట్స్ కింద రెండు రోజులు పెడితే తగ్గిపోతాయి. అలాగే ఎండలో కూడా రోజులో కాసేపు పెట్టినా మంచి ఫలితం ఉంటుంది. 


ఎప్పుడు భయపడాలి?
కొంతమంది పిల్లల్లో శరీరం పచ్చగా మారిపోతుంది. ముఖం, కాళ్లు,చేతులు కూడా రంగు మారుతాయి. మూత్రం కూడా ముదురుగా వస్తుంది. ఇలాంటప్పుడు వైద్యులు సీరియస్ గా తీసుకుంటారు. అయినా కూడా వీరికి ప్రత్యేకంగా చికిత్స ఉండదు. ఫోటో థెరపీ లైట్స్ కింద ఎక్కువ రోజులు పెట్టి గమనిస్తారు. రెండు వారాలకు మించి ఇదే పరిస్థితి కొనసాగితే మాత్రం చాలా ప్రమాదం. అప్పుడు ప్రత్యేక చికిత్సలు అవసరం పడతాయి. 


పిల్లలకు కామెర్లు ప్రాణాంతకంగా మారే అవకాశం ఎప్పుడు ఉంటుందంటే తల్లి బ్లడ్ గ్రూపు నెగిటివ్ ఉండి, బిడ్డది పాజిటివ్ ఉన్నప్పుడు... ఆ బిడ్డకు కామెర్లు తీవ్రస్థాయిలో వచ్చే అవకాశం ఉంది. అలాగే తల్లిది O పాజటివ్ బ్లడ్ గ్రూపు అయి ఉండి, బిడ్డకు A లేదా B పాజిటివ్ బ్లడ్ గ్రూపులు వచ్చినా కూడా కామెర్లు విపరీతంగా వచ్చి ఇబ్బంది పెడాయి. ఇలాంటి సమయంలో వైద్యుల పర్యవేక్షణ చాలా అవసరం. బిడ్డ ఆరోగ్యంగా ఉంటేనే ఇంటికి పంపిస్తారు వైద్యులు. 


Also read: గుండె ఆరోగ్యం కోసం మీరు రోజూ తినాల్సిన అయిదు ఆహారాలు ఇవే















గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.