Russian Politician Dies: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను విమర్శించిన ఒక రష్యన్ రాజకీయ నేత అనుమానాస్పదంగా మృతి చెందారు. ఒడిశాలోని రాయగడలోని ఒక హోటల్‌లోని మూడవ అంతస్తు కిటికీ నుండి పడి ఆయన మరణించినట్లు టెలిగ్రాఫ్ తెలిపింది. పుతిన్‌కు చెందిన యునైటెడ్ రష్యా పార్టీ నేత, మిలియనీర్ అయిన పావెల్ ఆంటోవ్ మృతి చెందడం కలకలం రేపింది.
తన 66వ పుట్టినరోజును జరుపుకోవడానికి ఆయన భారత్ వచ్చారు. కానీ రాయగడలోని హోటల్ సాయి ఇంటర్నేషనల్ వెలుపల రక్తపు మడుగులో ఆయన పడి ఉన్నారు.
ఆత్మహత్య
పావెల్ మరణాన్ని రాయగడ పోలీసులు ధ్రువీకరించారు. ఇది ఆత్మహత్యగా అనుమానిస్తున్నట్లు వెల్లడించారు. "తన స్నేహితుడి మరణం కారణంగా పావెల్ డిప్రెషన్‌లో ఉన్నారు" అని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.
టెలిగ్రాఫ్ నివేదిక ప్రకారం, జులైలో పావెల్ తన వాట్సాప్‌లో కీవ్‌పై రష్యా క్షిపణి దాడులను "ఉగ్రవాదం"తో పోల్చారు. కానీ ఇది పోస్ట్ చేసిన కాసేపటికే ఆయన క్షమాపణలు చెప్పారు.
రెండు రోజులకు
కోల్‌కతాలోని రష్యా కాన్సుల్ జనరల్ అలెక్సీ ఇడంకిన్ దీనిపై మాట్లాడారు. పావెల్ మరణంలో ఎలాంటి అనుమానాస్పద విషయం లేదన్నారు. డిసెంబరు 22న అదే హోటల్‌లో అతని స్నేహితుడు వ్లాదిమిర్ బిడెనోవ్ చనిపోయారు. ఇది జరిగిన రెండు రోజుల తర్వాత పావెల్ మృతి చెందారు.
వ్లాదిమిర్, పావెల్ సహా మరో ఇద్దరు భారత పర్యటనకు వచ్చారు. వారు తమ గైడ్ జితేంద్ర సింగ్‌తో కలిసి బుధవారం రాయగడ పట్టణంలోని హోటల్‌కు వచ్చారు. పావెల్ మరణంపై అన్ని కోణల్లో దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు. అతను ప్రమాదవశాత్తు టెర్రస్ నుంచి పడిపోయారనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తామని వెల్లడించారు.
Also Read: China Covid outbreak: భయంకర దృశ్యాలు- శ్మశానాల వద్ద క్యూలైన్లు, ఆసుపత్రులు హౌస్‌ఫుల్!