Russia Ukraine War: ఉక్రెయిన్‌పై రష్యా తాజాగా చేసిన మిసైల్ దాడులను అమెరికా తీవ్రంగా ఖండించింది. ఉక్రెయిన్‌కు సహాయం చేస్తామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. ఉక్రెయిన్‌కు అత్యాధునిక ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను సరఫరా చేయాలని అమెరికా నిర్ణయించింది. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీకి హామీ ఇచ్చారు.
బాంబుల మోత
ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై రష్యా సోమవారం మిసైళ్ల వర్షం కురిపించింది. ఈ దాడిపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్పందించారు. ఇది కేవలం ఆరంభం మాత్రమేనని.. రష్యాకు సంబంధించిన ఆస్తులపై దాడులకు దిగితే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని ఉక్రెయిన్‌కు ఆయన వార్నింగ్ ఇచ్చారు.
" లాంగ్ రేంజ్ మిసైల్స్.. ఈ రోజు ఉక్రెయిన్‌కు సంబంధించిన ఎనర్జీ, ఆర్మీ & కమ్యూనికేషన్ ఫెసిలిటీస్‌పై దాడి చేశాయి. మా భూభాగంలో తీవ్రవాద చర్యలను ఉక్రెయిన్ కొనసాగిస్తే, రష్యా ప్రతిస్పందన కఠినంగా ఉంటుంది. మాకు ఏ స్థాయిలో బెదిరింపులు వస్తే మా రియాక్షన్ అదే రేంజ్‌లో ఉంటుంది. క్రిమియా బ్రిడ్జి పేలుడు ఓ ఉగ్రవాద చర్య. వంతెన దాడి వెనుక ఉక్రెయిన్ ప్రత్యేక దళాలు ఉన్నాయి. ఉక్రెయిన్.. టర్కిష్ స్ట్రీమ్ పైప్‌లైన్‌ను పేల్చివేయడానికి కూడా ప్రయత్నించింది. రష్యాపై దాడులు కొనసాగితే.. మా రియాక్షన్ తీవ్రంగా ఉంటుంది. "
ఉక్రెయిన్ రాజధాని కీవ్ సోమవారం బాంబుల మోతతో దద్దరిల్లింది. రష్యా మిసైల్స్ ప్రయోగించిన ఘటనలో కనీసం 8 మంది మృతి చెందినట్లు సమాచారం. ఈ పేలుడులో 24 మంది గాయపడ్డారని ఉక్రెయిన్ అధికారి BNO న్యూస్‌కు తెలిపారు.
కీవ్‌లో సోమవారం తెల్లవారుజామున భారీ పేలుళ్లు జరిగాయి. భారీ శబ్దంతో కీవ్‌లో పేలుళ్లు సంభవించినట్లు AP న్యూస్ తెలిపింది. ఎంతమంది మృతి చెందారనే విషయంపై ఇంకా స్పష్టత లేదని పేర్కొంది.
ఉక్రెయిన్‌లోని పశ్చిమ ప్రాంతంలోని ఎల్వివ్, టెర్నోపిల్, జైటోమిర్, సెంట్రల్ ఉక్రెయిన్‌లోని డ్నిప్రోలో కూడా పేలుళ్లు సంభవించాయని రాయిటర్స్ నివేదించింది. ఈ ఘటనలో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలిస్తున్నారు సహాయక సిబ్బంది.
నగరమంతటా క్షిపణి దాడులు జరుగుతున్నాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లొదిమిర్ జెలెన్‌స్కీ అన్నారు. రష్యా ఎంతలా దాడి చేసిన వాటిని తిప్పికొడుతూనే ఉంటామని జెలెన్‌స్కీ అన్నారు. రష్యాకు తలవొంచే ప్రసక్తే లేదన్నారు.