FMCG Edible Oils: దీపావళి నాటికి కొన్ని నిత్యావసరాల ధరలు తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వంటనూనెల (Edible Oils) విషయంలో సామాన్యులకు ఊరట లభించే అవకాశం ఉంది. ఆయిల్‌ రేట్లు తగ్గుతుండడంతో, వాటిని ముడి పదార్థాలుగా ఉపయోగించే ఇతర నిత్యావసర వస్తువుల రేట్లు కూడా దిగి వస్తున్నాయి.


ఆగస్టులో మన దేశంలోకి పామాయిల్‌ దిగుమతి 87 శాతం పెరిగింది. సెప్టెంబర్‌లోనూ ఇదే ట్రెండ్‌ కొనసాగింది. దీంతో, పామాయిల్‌ నిల్వలు భారీగా పెరిగి రేటు తగ్గుతోంది. పామాయిల్‌ ఎగుమతుల్లో సింహభాగం ఉన్న ఇండోనేషియా, మలేషియాలో పామాయిల్ ఉత్పత్తి ఇంకా పెరుగుతోంది. అంటే, సరఫరా మరింత పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ధరలు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. పామాయిల్‌ ధర లీటర్‌కు రూ.150 నుంచి రూ.90 వరకు తగ్గిందని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. 


పామాయిల్‌ ధర, మిగిలిన నూనెల పైనా ప్రభావం చూపుతోంది. గతంలో పొద్దు తిరుగుడు గింజల (సన్‌ఫ్లవర్‌) నూనె లీటర్‌కు రూ.210గా ఉండగా, ఇప్పుడు రూ.150 వరకు తగ్గింది. వేరుశనగ నూనె రేటు లీటర్‌కు రూ.220 నుంచి రూ.165 వరకు దిగి వచ్చింది.


మొత్తంగా చూస్తే, నూనెల ధరలు 60 రూపాయల వరకు తగ్గాయి. అయితే, కొన్ని ప్రాంతాల్లో ఇంత తగ్గలేదు. దీపావళి పండుగ నాటికి ఈ తగ్గింపు పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులోకి రావచ్చని వ్యాపార వర్గాలు వెల్లడించాయి.


హిందుస్థాన్‌ యూనిలీవర్‌ 
పామాయిల్‌తోపాటు, ఇతర ముడి పదార్థాల రేట్లు తగ్గడంతో ప్రముఖ FMCG కంపెనీలు తమ సబ్బులు, డిటర్జెంట్ల రేట్లు తగ్గించాయి. హిందుస్థాన్‌ యూనిలీవర్‌ (Hindustan Unilever Limited - HUL) తయారు చేసే కొన్ని రకాల సబ్బులు, డిటర్జెంట్‌ బ్రాండ్ల రేట్లను తగ్గించింది. సర్ఫ్‌ ఎక్సెల్‌ లిక్విడ్‌, రిన్‌ డిటర్జెంట్‌ పౌడర్‌, లైఫ్‌బాయ్‌, డోవ్‌ సబ్బుల రేట్లలో 2 నుంచి 19 శాతం మేర కోత పెట్టింది. తగ్గిన ధరలతో కూడిన ఉత్పత్తులు దీపావళి నాటికి మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.


గోద్రెజ్‌ కన్జ్యూమర్‌ ప్రొడక్ట్స్‌
అసలు, రేట్ల తగ్గింపును మొదలు పెట్టింది గోద్రెజ్‌ కన్జ్యూమర్‌ ప్రొడక్ట్స్‌ (Godrej Consumer Products Limited -GCPL). గత నెలలో ఆ కంపెనీ కొన్నింటి రేట్లు తగ్గించింది. మరికొన్నింటి రేట్లు తగ్గించకుండా ఉత్పత్తుల సైజ్‌ పెంచింది. రూ.10కు లభించే నం.1 సబ్బు బరువును 41 గ్రాముల నుంచి 50 గ్రాములకు పెంచింది. ఇలాంటివే మరికొన్ని ఉన్నాయి.


ఈ రెండు FMCG కంపెనీలు స్టాక్‌ మార్కెట్‌లో లిస్ట్‌ అయిన రిటైల్‌ మేజర్లు. ముడి పదార్థాల భారం తగ్గడంతోపాటు; రేట్లు తగ్గించడం వల్ల పండుగ సీజన్‌లో కొనుగోళ్లు పెరిగి వీటి ఆదాయాల్లో ఆ ప్రయోజనం ప్రతిఫలించే అవకాశం ఉంది. మూడో (అక్టోబర్‌-డిసెంబర్‌) త్రైమాసికానికి ఈ కంపెనీలు ప్రకటించే లెక్కల్లో ఈ వృద్ధి తాలూకు లబ్ధి కనిపిస్తుంది. 


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని 'ఏబీపీ దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.