European Parliament:


ఎన్నో రోజులుగా డిమాండ్..


ఐరోపా పార్లమెంట్..రష్యాకు షాక్ ఇచ్చింది. ఎంత చెప్పినా వినకుండా ఉక్రెయిన్‌పై యుద్ధం కొనసాగిస్తుండటాన్నీ తీవ్రంగా పరిణగించిన యురోపియన్ పార్లమెంట్ (European Parliament) సంచలన నిర్ణయం తీసుకుంది. రష్యాను "ఉగ్రవాదులకు సహకరించే"దేశంగా ప్రకటించింది. ఉక్రెయిన్‌పై యుద్ధం మొదలు పెట్టినప్పటి నుంచే ఈ నిర్ణయం తీసుకోవాలన్న డిమాండ్ వినిపించాయి ఐరోపా దేశాలు. దాదాపు 9 నెలల తరవాత ఇప్పటికి ఇది కార్యరూపం దాల్చింది. ఇక ఇప్పటి నుంచి రష్యా వైఖరి ఎలా ఉండనుందనేదే ఆసక్తి రేపుతున్న విషయం. ఐరోపా పార్లమెంట్ చెబుతున్నదొక్కటే. "ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న దాడులు, అక్కడి మౌలిక వసతులను నాశనం చేస్తున్న తీరు అంతర్జాతీయ, మానవ హక్కుల ఉల్లంఘన కిందకే వస్తుంది" అని తేల్చి చెబుతోంది. ఈ నిర్ణయంపై ఉక్రెయిన్ హర్షం వ్యక్తం చేసింది. రష్యా ఉగ్రవాద దేశం అంటూ మండి పడింది. ఉక్రెయిన్ అధ్యక్షుడు చాలా నెలలుగా ఈ డిమాండ్‌ను ప్రస్తావిస్తూ వచ్చారు. ఉక్రెయిన్‌లో కీలకమైన పవర్ నెట్‌వర్క్‌నీ రష్యా దారుణంగా దెబ్బ తీసింది. ఇది అంతర్జాతీయ నిబంధనల ఉల్లంఘనే అని ఉక్రెయిన్ ఎప్పటి నుంచో అసహనం వ్యక్తం చేస్తూనే ఉంది. అంతే కాదు. ఉక్రెయిన్‌లోని స్కూల్స్, హాస్పిటల్స్, షాప్స్..ఇలా అన్నింటినీ నాశనం చేస్తోంది రష్యా. ఇవన్నీ "ఉగ్రవాద ప్రేరేపిత చర్యలే" అని స్పష్టం చేస్తోంది ఉక్రెయిన్. పార్లమెంట్‌లోని 27 సభ్య దేశాలూ...రష్యాపై తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండాలని యూరోపియన్ పార్లమెంట్‌ కోరింది. ఇదంతా జరుగుతుండగానే అటు రష్యా తన పని తాను చేసుకుపోతోంది. బెలారస్ నుంచి 100 మిజైల్స్‌ను తెప్పించిన ఆ దేశం...వాటిని ఉక్రెయిన్‌పై ప్రయోగించేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.  


రష్యాపై ఐరాస గుర్రు..


ఉక్రెయిన్‌ విషయంలో రష్యా వ్యవహరిస్తున్న తీరుపై ఐక్యరాజ్య సమితి మండి పడుతోంది. అణుదాడులు జరగకుండా నియంత్రించే ఐరాస అనుబంధ సంస్థ చీఫ్ రఫేల్ గ్రాస్సి రష్యాపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఉక్రెయిన్‌లో రష్యా అధీనంలో ఉన్న జపోరిరియా ప్రాంతంలో న్యూక్లియర్ ప్లాంట్‌ను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడంపై విమర్శలు చేశారు. "ఇలాంటి పిచ్చి పనులు మానుకోండి" అంటూ గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. "ఆ న్యూక్లియర్ ప్లాంట్‌పై దాడి జరిగిందని తెలిసినప్పటి నుంచి చాలా ఆందోళన కలుగుతోంది. ఇలాంటి భారీ ప్లాంట్‌లపై బాంబు దాడులు చేయడం ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదు. దీని వెనక ఎవరున్నా సరే..వెంటనే ఈ పని మానుకోవాలి" అని హెచ్చరించారు 
రఫేల్ గ్రాసీ. అంతే కాదు. నిప్పుతో చెలగాటం ఆడుతున్నారంటూ విమర్శించారు. అంతర్జాతీయ మీడియా అందిస్తున్న సమాచారం ప్రకారం... ఆ న్యూక్లియర్ ప్లాంట్‌పై ఒక్క రోజులోనే 12 కంటే ఎక్కువ సార్లు దాడులు జరిగినట్టు తెలుస్తోంది. నిపుణుల బృందాన్ని ఘటనా స్థలానికి పంపిన ఐరాస...ఇవి అనుకోకుండా జరిగిన ప్రమాదాలు కాదని తేల్చి చెప్పింది.


Also Read: Russia Ukraine War: ఆ నిర్ణయం తీసుకున్నారంటే పుతిన్ ఓడిపోతున్నట్టే లెక్క - రష్యా మ్యాగజైన్ సంచలనం