Amit Shah CAA Remark:
పని మొదలు పెడతాం : అమిత్ షా
గుజరాత్ ఎన్నికల వేళ బీజేపీ నేతలు ఎలాంటి కామెంట్స్ చేసినా...వెంటనే హాట్ టాపిక్ అయిపోతున్నాయి. ముఖ్యంగా...ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా చేసే వ్యాఖ్యలూ హైలైట్ అవుతున్నాయి. ఇప్పుడు అమిత్‌షా పౌరసత్వ సవరణ చట్టం (Citizenship Amendment Bill)పై చేసిన కామెంట్స్ దేశ రాజకీయాలను మరింత వేడెక్కించాయి. ఈ సీఏఏ చట్టాన్ని అమలు చేసేందుకు గతంలోనే ప్రయత్నించగా...పలు రాష్ట్రాల్లో తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. అప్పటికప్పుడు ఆ అంశాన్ని పక్కన పెట్టేసింది కేంద్ర ప్రభుత్వం. మోడీ సర్కార్ దీన్ని "కోల్డ్ స్టోరేజ్" లో పెట్టేసింది అని అంతా అనుకున్నారు. కానీ...అమిత్ షా షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. "సీఏఏను కోల్డ్ స్టోరేజ్‌లో పెట్టామని అనుకుంటే అది ముమ్మాటికీ తప్పే. ఈ విషయంలో ప్రజల్ని కన్‌ఫ్యూజ్ చేయాలనుకోవడం లేదు" అని తేల్చి చెప్పారు. ఓ ఇంటర్వ్యూలో ఈ విషయం వెల్లడించారు. "సీఏఏ అనేది ఈ దేశంలో అమలు చేసి తీరాల్సిన చట్టం. అది ఎప్పటికైనా కార్యరూపం దాల్చుతుంది. ఇది ఎప్పటికీ అమలు కాదని కొందరు కలలు కంటున్నారు" అని స్పష్టం చేశారు. ఈ చట్టం అమలుకు ఎందుకు ఆలస్యమైందని ప్రశ్నించగా.."ఇందుకు సంబంధించి కొన్ని రూల్స్‌ని తయారు చేయాల్సి ఉంది. కరోనా కారణంగా అమలు చేయడం కుదరలేదు. ఇప్పుడు కరోనా నుంచి మనమంతా బయటపడ్డాం. ఇప్పుడు మళ్లీ పని మొదలు పెడతాం" అని తెలిపారు. ఇప్పుడే కాదు. అమిత్‌షా గతంలోనూ చాలా సందర్భాల్లో CAA గురించి ప్రస్తావించారు.
యూసీసీపైనా..
కేంద్ర హోం మంత్రి అమిత్‌షా యూసీసీ (Uniform Civil Code)పైన కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కోడ్‌ను అమలు చేసేందుకు కట్టుబడి ఉన్నామని తేల్చి చెప్పారు. అయితే...అంత కన్నా చర్చలు, వాదనలు తప్పకుండా వింటామని అన్నారు. జనసంఘ్‌గా ఉన్న నాటి నుంచే బీజేపీ ఈ హామీ ఇస్తూ వస్తోందని గుర్తు చేశారు. "బీజేపీ మాత్రమే కాదు. ఎప్పుడో మన రాజ్యాంగ పరిషత్ కూడా యూసీసీని సరైన సమయంలో
అమలు చేయొచ్చని సూచించింది. సెక్యులర్ దేశంలో మతాల ఆధారంగా చట్టాలు చేయడం సరికాదని చెప్పింది. రాష్ట్రాలన్నీ సెక్యులర్‌గా మారిపోతే అప్పుడు మతాల ఆధారంగా చట్టాల అవసరం ఎందుకు.." అని అన్నారు అమిత్‌షా. అప్పట్లో రాజ్యాంగ పరిషత్ చేసిన సూచనలు కాలక్రమంగా మరుగున పడిపోయాయని చెప్పారు. బీజేపీ తప్ప మరే పార్టీ కూడా యూసీసీకి మద్దతునివ్వడం లేదని తెలిపారు.ప్రజాస్వామ్యంలో ఏది అమలు చేయాలన్నా కచ్చితంగా దానిపై వాదోపవాదాలు జరగాలని అభిప్రాయపడ్డారు. "ఆరోగ్యకరమైన చర్చలు, వాదనలు ఎంతో అవసరం" అని వ్యాఖ్యానించారు. భాజపా పాలిత రాష్ట్రాలైన హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, గుజరాత్‌లో యూసీసీ అమలు కోసం ప్రత్యేక ప్యానెల్‌ను ఏర్పాటు చేశామని వెల్లడించారు. సుప్రీం కోర్టు, హైకోర్టుల మాజీ చీఫ్ జస్టిస్‌లు ఈ ప్యానెల్‌కు నేతృత్వం వహిస్తున్నారు.
Also Read: Malaysia New PM: మలేసియాలో మహోదయం- నూతన ప్రధానిగా సంస్కరణవాది అన్వర్