Russia Ukraine War: ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభమైన రష్యా, ఉక్రెయిన్ యుద్ధం తొమ్మిదిన్నర నెలలుగా కొనసాగుతూనే ఉంది. తాజాగా రష్యా.. ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరంపై డ్రోన్‌లతో దాడికి దిగింది. ఈ మేరకు ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి కీవ్‌పై జరిగిన దాడుల్లో ఇదే అత్యంత ఘోరమైన దాడిగా ఉక్రెయిన్ వ్యాఖ్యానించిన తర్వాత రష్యా యుద్ధ తీవ్రతను పెంచింది.
20కి పైగా
దాదాపు 20కి పైగా ఇరాన్ తయారు చేసిన డ్రోన్లను.. ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరం గగనతలంలో గుర్తించారు. వాటిలో పదిహేను డ్రోన్లను కూల్చివేసినట్టు ఉక్రెయిన్ తెలిపింది. అయితే ఈ దాడిలో కీలకమైన మౌలిక సదుపాయాలు ధ్వంసం అయినట్టు కీవ్ నగర పాలక సంస్థ పేర్కొంది. వీటితో పాటు కొన్ని ఇళ్లు ధ్వంసం కాగా, ఇద్దరికి గాయాలయ్యాయని అని కీవ్ నగర గవర్నర్ ఓలెక్సీ కులెబా తెలిపారు.
సముద్రం
అజోవ్ సముద్రం తూర్పు వైపు నుంచి రష్యా పంపించిన 35 డ్రోన్లలో 30కి పైగా నాశనం చేసినట్టు ఉక్రెయిన్ వైమానిక దళం పేర్కొంది. గత శుక్రవారం రష్యా ఉక్రెయిన్ పై క్షిపణుల వర్షం కురిపించింది. ఈ దాడుల వల్ల విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. ఈ దాడుల్లో భాగంగానే ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరంపై దాడి జరిగింది.
ఉక్రెయిన్‌పై రష్యా బలగాలు శుక్రవారం 70కిపైగా క్షిపణులు ప్రయోగించాయి. వరుస పరాజయాల తర్వాత అక్టోబర్ నుంచి వారానికోసారి ఉక్రెయిన్ విద్యుత్ వ్యవస్థలపై రష్యా క్షిపణుల వర్షం కురిపిస్తుండగా యుద్ధం ప్రారంభమైన తర్వాత జరిగిన అతిపెద్ద దాడుల్లో ఇది ఒకటని ఉక్రెయిన్ అధికారులు తెలిపారు.
కీవ్‌లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కల్పించి ఉక్రెయిన్‌ను ఎక్కడికక్కడ దిగ్బంధించాలననే కుట్రతో వైమానిక దాడులకు తెగబడినట్లు పేర్కొన్నారు. గతంలో రష్యా దాడులు చేసిన వెంటనే పునరుద్ధరణ పనులు చేపట్టినా... ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేదని ఉక్రెయిన్ అధికారులు నిస్సాహాయత వ్యక్తం చేస్తున్నారు. ఉక్రెయిన్‌కు చెందిన చిన్న, మధ్యతరహా వ్యాపారులు 5లక్షల జనరేటర్లను దిగుమతి చేసుకున్నట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లొదిమిర్ జెలెన్‌స్కీ తెలిపారు.
ఫిబ్రవరి 24 న రష్యా.. ఉక్రెయిన్‌పై సైనిక చర్యను ప్రారంభించింది. గత తొమ్మిదిన్నర నెలలుగా యుద్దం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే ఉక్రెయిన్ లోని అనేక ప్రాంతాలను రష్యా ఆక్రమించుకుంది. ఇరు దేశాలకు తీవ్ర నష్టం జరగడంతోపాటు ప్రపంచ ఆర్ధిక వ్యవస్థపై కూడా ప్రభావం ఉంది.
Also Read: Besharam Rang Row: 'పఠాన్ సినిమాను నీ కూతురితో కలిసి చూడు'- షారూక్‌కు స్పీకర్ సవాల్