రాజస్థాన్‌లో రిసార్ట్ రాజకీయాలు షురూ


రిసార్టు రాజకీయాలు భారత్‌లో కొత్తేం కాదు. ఎన్నికలు దగ్గరపడే కొద్దీ ఈ హడావుడి మొదలవుతుంది. మరీ ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్ర రాజకీయాల్లో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. ఇప్పుడు రాజస్థాన్‌లో ఈ ట్రెండ్ మొదలైంది. రాజ్యసభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో భాజపా, కాంగ్రెస్ తమ ఎమ్మెల్యేలను చాలా జాగ్రత్తగా కాపాడుకుంటున్నాయి. ఫిరాయింపులు లేకుండా నిఘా ఉంచుతున్నాయి. జూన్ 10వ తేదీన రాజస్థాన్‌లో రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రంలో నాలుగు రాజ్యసభ సీట్లున్నాయి. ఈ క్రమంలోనే భాజపా ఎమ్మెల్యేలను జైపూర్‌లోని ఓ రిసార్టుకు తరలించింది. ఎన్నికల నేపథ్యంలో ట్రైనింగ్ క్యాంప్ నిర్వహించనుంది. ఇప్పటికే కాంగ్రెస్ అధిష్ఠానం రాజస్థాన్, హరియాణా ఎమ్మెల్యేలను ఓ హోటల్‌కు తరలించింది. ఫిరాయింపులు జరుగుతాయన్న అనుమానాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది హస్తం పార్టీ. ఇప్పుడు భాజపా కూడా అదే దారిలో నడిచింది. 


కాంగ్రెస్ బాటలోనే భాజపా కూడా..


జైపూర్-ఆగ్రా హైవేకు ఆనుకుని ఉన్న జమ్‌డోలిలో భాజపా ఎమ్మెల్యేలు ఉన్నట్టు తెలుస్తోంది. వీరిని తరలించేందుకు పార్టీ కార్యాలయం నుంచి ప్రత్యేకంగా రెండు బస్సులు కూడా వేసినట్టు సమాచారం. ఇప్పటికే దాదాపు 60 మంది ఎమ్మెల్యేలు రిసార్ట్‌కు చేరుకున్నట్టు అంచనా. రాజ్యసభ ఎన్నికలకు సంబంధించిన శిక్షణ ఇచ్చేందుకే తమ ఎమ్మెల్యేలను రిసార్ట్‌కు తరలించామని భాజపా చెబుతోంది.  సీనియర్ నాయకులు వారందరికీ దిశానిర్దేశం చేయనున్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి. అయితే ఫిరాయింపులను అడ్డుకునేందుకే భాజపా, కాంగ్రెస్ రిసార్ట్ రాజకీయాలు చేస్తున్నాయని స్థానిక రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 


భాజపా తాయిలాలకు లొంగకండి: ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ అధిష్ఠానం
రాష్ట్రీయ లోక్‌తంత్రిక్ పార్టీ-RLP ఇప్పటికే భాజపాకు మద్దతునిస్తామని ప్రకటించింది. భాజపా మద్దతుతో ఎన్నికల్లో పోటీ చేస్తున్న స్వతంత్ర అభ్యర్థి సుభాష్ చంద్రకు తామూ సపోర్ట్‌ ఇస్తామని ఆర్‌ఎల్‌పీ ప్రకటించింది. ఈ మేరకు ఆర్ఎల్‌పీ జాతీయ కన్వీనర్, నాగ్‌పూర్ ఎంపీ హనుమాన్ బెనివల్ అధికారిక ప్రకటన చేశారు. గతంలో ఎన్‌డీఏకు మిత్రపక్షంగా ఉంది ఆర్‌ఎల్‌పీ. ప్రస్తుతానికి రాష్ట్రంలో ముగ్గురు ఆర్‌ఎల్‌పీ సిట్టింగ్ ఎమ్మెల్యేలున్నారు. అటు కాంగ్రెస్ కూడా రాజ్యసభ ఎన్నికల్లో గెలిచేందుకు గట్టిగానే కసరత్తులు చేస్తోంది. నాలుగు సీట్లల మూడు స్థానాలు దక్కించుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్ ఎమ్మెల్యేలతో సమావేశమై అందరూ ఒకటిగా ఉండాలని 
సూచించినట్టు సమాచారం. స్వతంత్ర అభ్యర్థులు, పార్టీ ఎమ్మెల్యేలు ఒకేతాటిపైకి వస్తేనే గెలుపు సాధ్యమవుతుందని చెప్పినట్టు తెలుస్తోంది. ప్రస్తుతానికి ఉదయ్‌పూర్‌లోని ఓ హోటల్‌లో 100 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. భాజపా ఎలాంటి తాయిలాలిస్తామని మభ్యపెట్టినా, అటు వైపు మొగ్గు చూపకూడదని ఎమ్మెల్యేలందరికీ హితబోధ చేస్తోంది కాంగ్రెస్ అధిష్ఠానం.