తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన జూబ్లీహిల్స్ లో మైనర్ బాలిక అత్యాచార కేసులో వీడియోలు, ఫొటోలు వీడియో బయటపెట్టటంతో బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు చిక్కుల్లో పడ్డారు. అబిడ్స్ పోలీస్ స్టేషన్ లో రఘునందన్ రావుపై పోలీసులు కేసు నమోదు చేశారు. మైనర్ బాలిక ఫోటో లు వీడియోలు రిలీజ్ చేయడంపై తమకు అందిన ఫిర్యాదు మేరకు రఘునందన్ రావు పై కేసు నమోదు చేశామని అబిడ్స్ పోలీస్ లు తెలిపారు. ఐపీసీ 228(a) సెక్షన్ కింద కేసు నమోదు చేసుకుని అబిడ్స్ పోలీసులు విచారణ చేపట్టారు. ఇదివరకే ఈ కేసుకు సంబంధించి మూడు యూట్యూబ్ నిర్వాహకులపై కూడా కేసు నమోదు కావడం తెలిసిందే. కారం కొమ్మిరెడ్డి నిన్న రఘునందన్ పై సెంట్రల్ జోన్ డీసీపీకి ఫిర్యాదు చేశారు. ఇప్పటికే విడియో లు వైరల్ చేసిన ఒక జర్నలిస్ట్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.
అమ్నీషియా పబ్ మైనర్ బాలిక కేసుపై ప్రభుత్వం సీరియస్
ఆమ్నీషియా పబ్ మైనర్ బాలిక సామూహిక అత్యాచారం కేసును తెలంగాణ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. మైనర్ బాలిక కేసు అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య విమర్శలు, ప్రతివిమర్శలు కొనసాగుతున్నాయి. నిందితులను పోలీసులు అరెస్ట్ చేయడం లేదని, తెలంగాణ ప్రభుత్వం వారికి ఎందుకు అండగా ఉందో చెప్పాలని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు మూడు రోజుల కిందట మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బాలిక గ్యాంగ్ రేప్ ఘటనకు సంబంధించి ఫోటోలు, వీడియోని విడుదల చేయడంపై టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు బీజేపీ ఎమ్మెల్యేపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో రఘునందన్ రావుపై కేసు నమోదు కావడంతో కేసులో మరో ట్విస్ట్ చోటచేసుకుంది.
సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం నేరమా !
సుప్రీం కోర్టు మార్గదర్శకాల అత్యాచారానికి గురైన బాధితురాలి పేరు, ఫొటోలు, వీడియోలు లాంటి వివరాలు బయటపెడితే ఐపీసీ 228 (ఏ) ప్రకారం నేరంగా పరిగణిస్తారు. దీని ఆధారంగా రఘునందన్‌పై కేసు నమోదైంది. మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ కేసులో తాను మీడియాకు బయటపెట్టిన సమయంలో బాధితురాలి ముఖం చూపించలేదని, చట్టాన్ని ఫాలో అయ్యానని రఘునందన్ రావు చెబుతున్నారు. బెంజ్ కారులో జరిగిన దృశ్యాలను రఘునందన్ రావు మీడియాకు చూపించిన తరువాత అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ నేతలు ఈ బీజేపీ నేతను టార్గెట్‌గా చేసుకుని విమర్శలు చేశారు. బాధితురాలి కుటుంబం పరువు తీశారని, వారిని రోడ్డుపైకి రాకుండా చేశారని ఆరోపించారు.
Also Read: Jubilee Hills Minor Girl Case : జూబ్లీహిల్స్ బాలికపై అత్యాచారం కేసు, ఇన్నోవా కారులో అసలేం జరిగింది?