IT Issues Notice to Congress: లోక్‌సభ ఎన్నికల ముందు కాంగ్రెస్‌కి నిధుల కొరత వచ్చి పడింది. చేతిలో చిల్లిగవ్వ లేకుండా పోయింది. కాంగ్రెస్‌కి సంబంధించిన బ్యాంక్ అకౌంట్‌లన్నీ ఫ్రీజ్ అయిపోయాయి. ఐటీ శాఖ ఇప్పటికే నోటీసులు కూడా జారీ చేసింది. రూ.1,700 కోట్లు కట్టాలని తేల్చి చెప్పింది. ఇదంతా బీజేపీ కుట్ర అని ఈ ట్యాక్స్ వ్యవహారాన్నంతా మరోసారి పరిశీలించాలని కాంగ్రెస్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేసింది. కానీ కోర్టు ఆ పిటిషన్‌ని తిరస్కరించింది. ఆ తరవాత కొద్ది గంటల్లోనే ఐటీ శాఖ నుంచి కాంగ్రెస్ పార్టీకి నోటీసులు అందాయి. 2017-18, 2020-21 సంవత్సరాలకి సంబంధించిన పన్ను కట్టాలని, దీంతో పాటు పెనాల్డీ, వడ్డీ రేటు కలుపుకుని చెల్లించాలని స్పష్టం చేసింది. ఈ నోటీసులపై పార్టీ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తోంది. ఇది ట్యాక్స్ టెర్రరిజం అంటూ విమర్శిస్తోంది. ఇప్పటికే రూ.200 కోట్లు పెనాల్టీ విధించిన ఐటీ శాఖ కాంగ్రెస్ బ్యాంక్ ఖాతాల్ని నిలిపివేసింది. అటు హైకోర్టులో అయినా తమకు అనుకూలంగా ఏమైనా తీర్పు వస్తుందేమోనని భావించినా ఆ ప్లాన్ కూడా సక్సెస్ కాలేదు. ఇప్పుడు సుప్రీంకోర్టుని ఆశ్రయించాలని భావిస్తోంది కాంగ్రెస్. అయితే...ఇదంతా బీజేపీ చేస్తున్న పనే అని ఆరోపిస్తోంది ఆ పార్టీ. 


"మమ్మల్ని ఆర్థికంగా పూర్తిగా దెబ్బ తీయాలన్న కుట్రతోనే ఇలా నోటీసులు ఇచ్చి బెదిరిస్తున్నారు. ఈ ట్యాక్స్ టెర్రరిజం, కాంగ్రెస్‌పై ఇలా దాడి చేయడం వెంటనే ఆపేయాలి"


- జైరాం రమేశ్, కాంగ్రెస్ సీనియర్ నేత






ఇదే సమయంలో జైరాం రమేశ్ ఎలక్టోరల్ బాండ్స్‌ కేసు గురించీ ప్రస్తావించారు. డొల్ల కంపెనీలను సృష్టించి వాటి ద్వారా పెద్ద ఎత్తున విరాళాలు రాబట్టుకున్నారని ఆరోపించారు. ఓ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌ని వినియోగించి డేటాని మానిప్యులేట్ చేశారని మండి పడ్డారు. ECI వెబ్‌సైట్‌లో పెట్టిన డేటాని బీజేపీయే పోస్ట్ చేసిందని అన్నారు.