తమిళనాడు సీఎం స్టాలిన్‌ పనితీరును జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కొనియాడారు. ఏ పార్టీ అయినా అధికారంలోకి రావడానికి రాజకీయాలు చేయాలి కానీ.. వచ్చాక కాదని పవన్ కళ్యాణ్ అన్నారు. ఇదే విషయాన్ని కేవలం మాటల్లోనే కాకుండా చేతల్లో చేసి చూపిస్తున్నారని స్టాలిన్‌ని ప్రశంసించారు. స్టాలిన్ పరిపాలన, ప్రభుత్వ పని తీరు తమిళనాడుకే కాకుండా.. దేశంలోని అన్ని రాష్ట్రాలకు మార్గదర్శకంగా నిలిస్తుందని అన్నారు. స్టాలిన్‌కు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.



జనసైనికులకు పవన్ కల్యాణ్ సందేశం..
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆంధ్రప్రదేశ్ రోడ్ల దుస్థితిపై ప్రభుత్వానికి కనువిప్పు కలిగించాలని నిర్ణయించారు. దీనిలో భాగంగా.. రాష్ట్రంలోని రోడ్ల అధ్వాన్న పరిస్థితిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి తద్వారా ప్రభుత్వం నుంచి స్పందన తీసుకురావాలనే ఉద్దేశంతో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దీనిలో భాగంగా సెప్టెంబర్ 2, 3, 4 తేదీల్లో రోడ్ల దుస్థితిపై ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేయాలని జనసేన పార్టీ కార్యకర్తలకు సూచించారు. పోస్టులకు #JSPFORAP_ROADS హ్యాష్‌ ట్యాగ్‌ ఉండాలని తెలిపారు. వీటిని చూసైనా ప్రభుత్వం స్పందించకపోతే అక్టోబర్ 2న మన రోడ్లను మనమే శ్రమదానం చేసి బాగు చేసుకుందామని పవన్ పిలుపునిచ్చారు. రోడ్లను బాగు చేసే శ్రమదానం కార్యక్రమంలో తాను కూడా భాగస్వామిని అవుతానని ప్రకటించారు. 


ఈ కార్యక్రమానికి సంబంధించిన సూచనలతో ప్రత్యేకంగా వీడియో సందేశాన్ని పవన్ కల్యాణ్ విడుదల చేశారు. ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలంటే అక్కడ రహదారుల వ్యవస్థ చాలా పటిష్టంగా ఉండాలని.. ఏపీలో మాత్రం అడుగుకో గుంత గజానికో గొయ్యిలా ఉందని ఎద్దేవా చేశారు. నివర్ తుపాన్ సమయంలో కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో పర్యటించినప్పుడు దెబ్బ తిన్న రోడ్లను తాను ప్రత్యక్షంగా చూశానని పవన్ తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి నియోజక వర్గంలో దాదాపు ఇదే పరిస్థితి ఉందని తెలిపారు.  


Read More: JSP For Roads : రేపట్నుంచి రోడ్లపై ఉద్యమం.. జన సైనికులకు పవన్ కల్యాణ్ ఇచ్చిన సందేశం ఇదే..!


Also Read: Bheemla Nayak Title Song: పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘భిమ్లా నాయక్’ టైటిల్ సాంగ్ వచ్చేస్తోంది, ఎప్పుడంటే..