Republic Day 2023: 74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా బుధవారం రోజు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ విషయాన్ని నేరుగా రాష్ట్రపతి భవన్ ఓ ప్రకటన ద్వారా తెలిపింది. అయితే భారత తొలి మహిళా రాష్ట్రపతి ఇలా ప్రసంగించడం ఇదే మొదటి సారి. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈనెల 25వ తేదీన రాష్ట్రపతి ముర్ము తన సందేశాన్ని యావత్ దేశానికి వినిపించనున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రపతి ఏం మాట్లాడతారు, ఎలాంటి అంశాలు ప్రస్తావిస్తారనే ఆసక్తి అందరిలో మొదలైంది. గతేడాది జరిగిన స్వాతంత్ర దినోత్సవాలకు కూడా రాష్ట్రపతి హోదాలో ముర్ము తన సందేశాన్ని వినిపించారు.
ఆల్ ఇండియా రేడియోతో పాటు అన్ని జాతీయ నెట్ వర్క్ లలో, దూరదర్శన్ ఛానెల్ లో ఈ ప్రసంగం ప్రసారం కాబోతుంది. సాయంత్రం 7 గంటల నుంచి హిందీ ఆ తర్వాత ఇంగ్లీష్ లో ప్రసారం చేస్తారు. ఆ తర్వాత రాష్ట్రపతి ప్రసంగాన్ని దూరదర్శన్ ప్రాంతీయ ఛానెళ్లు.. ప్రాంతీయ భాషలలో ప్రసారం చేస్తాయి. రాష్ట్రపతి ప్రసంగాన్ని ఆల్ ఇండియా రేడియో రాత్రి 9.30 గంటల నుంచి ప్రాంతీయ నెట్‌వర్కులలో.. ప్రాంతీయ భాషల్లో ప్రసారం చేస్తుంది. అలాగే స్మార్ట్ ఫోన్లు ఉన్న వాళ్లు యూట్యూబ్ ద్వారా కూడా వీక్షించవచ్చు.
రేపే 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు..
దేశం తన 74వ గణతంత్ర దినోత్సవాన్ని రేపు అనగా గురువారం జరుపుకోనుంది. ఈ సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలోని విధి మార్గంలో భారీ కవాతు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఢిల్లీతో పాటు, అన్ని రాష్ట్ర రాజధానులు మరియు జిల్లా ప్రధాన కార్యాలయాలు, ప్రభుత్వ, ప్రైవేట్ భవనాలు, విద్యా సంస్థలలో కూడా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అంతకుముందు జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. 11 మంది చిన్నారులకు "ప్రధాన మంత్రి జాతీయ బాలల పురస్కారాన్ని" అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పిల్లలు మన దేశానికి అమూల్యమైన ఆస్తి అని అన్నారు. సురక్షితమైన, సంతోషకరమైన బాల్యాన్ని, ఉజ్వల భవిష్యత్తును కలిగి ఉండటానికి మనం ప్రయత్నం చేయాలన్నారు.
ఈ సారి ఈజిప్ట్ ప్రెసిడెంట్ ముఖ్య అతిథిగా..
గణతంత్ర దినోత్సవ వేడుకల కార్యక్రమానికి సంబంధించి ఢిల్లీ పోలీసులు ట్రాఫిక్ అడ్వైజరీ జారీ చేశారు. పలు మార్గాల్లో ట్రాఫిక్ బంద్ ఉంటుందని చెప్పారు. ఉదయం 10.30 గంటలకు విజయ్ చౌక్ నుంచి ప్రారంభమయ్యే కవాతు ఎర్రకోట వైపు సాగుతుంది. ఈసారి గణతంత్ర దినోత్సవానికి ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫత్తా అల్-సిసి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం ఆయన ఢిల్లీ చేరుకున్నారు.
ప్రదర్శన కోసం మొత్తం 17 శకటాలు ఎంపిక..
మొత్తం 17 శకటాలు గణతంత్ర ఉత్సవ కార్నివాల్ కు ఎంపికైతే అందులో ప్రభల తీర్థం ఉండటం విశేషం. సంక్రాంతి ఉత్సవాల ఇతి వృత్తంగా, సహస్ర వృత్తుల సంఘటిత జీవనానికి ఈ శకటం ఆనవాలు.. దగ్గర చూస్తే ప్రభ పారవశ్యానికి లోను చేస్తోంది. గణతంత్ర ఉత్సవాల్లో ప్రభల తీర్థం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఒక్క కోనసీమలోనే కాక మొత్తం ఉమ్మడి తూర్పు గోదావరిలో ప్రభల తీర్థాలను తీసుకుని వెళ్లడం ఆనవాయితీ.