KCR Vs Modi :  సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ మైదానం రాజకీయ యుద్ధాలకు వేదిక కాబోతోంది. మోదీ వర్సెస్ కేసీఆర్ అన్నట్లుగా సాగబోతున్న యుద్ధం ఆ గ్రౌండ్‌లోనే నాలుగు రోజుల వ్యవధిలో ఉండనుంది. అటు బీజేపీ ఇటు బీఆర్ఎస్ రెండు పార్టీలు తమ అగ్రనేతల సభలను అదే గ్రౌండ్‌లో నిర్వహిస్తున్నాయి. రెండు పార్టీలు పెద్ద ఎత్తున జన సమీకరణ చేసి.. ధూం ధాంగా నిర్వహించి తమదే పైచేయి అని నిరూపించడానికి పూర్తి స్థాయిలో ప్రయత్నిస్తాయనడంలో ఏ మాత్రం సందేహం లేదు. అందుకే ఇప్పుడు అందరి దృష్టి ఫిబ్రవరిలో జరగనున్న రెండు సభలపై పడనుంది 


పరేడ్ గ్రౌండ్‌లో ఫిబ్రవరి 13న మోదీ సభ 


ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఫిబ్రవరి 13వ తేదీన హైదరాబాద్ పర్యటనకు రానున్నారు.   రూ.699 కోట్లతో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ అభివృద్ధికి భూమిపూజ చేస్తారు. రూ. 1,850 కోట్ల వ్యయంతో 150 కి. మీ. ల పొడవున నిర్మించనున్న 3 జాతీయ రహదారి ప్రాజెక్టుల విస్తరణ పనులకు భూమిపూజ చేస్తారు. రూ. 521 కోట్ల వ్యయంతో కాజీపేట్ నందు నిర్మించనున్న ‘రైల్ పీరియాడిక్ ఓవర్ హాలింగ్ వర్క్ షాపునకు’ భూమిపూజ చేస్తారు. రూ. 1,410 కోట్ల వ్యయంతో సికింద్రాబాద్–మహబూబ్‌నగర్ మధ్య 85 కి.మీ. ల పొడవున నిర్మించిన డబుల్ లైన్ జాతికి అంకితం చేస్తారు.ఐఐటీ హైదరాబాద్‌లో రూ. 2,597 కోట్ల వ్యయంతో చేపట్టిన పలు నిర్మాణాలను ప్రధాని జాతికి అంకితం చేస్తారు.  అనంతరం పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగే భారీ బహిరంగ సభలో మోదీ పాల్గొని ప్రసంగించనున్నారు.   ఈ సభను భారీ స్థాయిలో నిర్వహించాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. 


పరేడ్ గ్రౌండ్స్ లోనే ఫిబ్రవరి 17న బీఆర్ఎస్ బహిరంగసభ ! 
 
మోదీ సభ ముగిసిన నాలుగు రోజులకు అంటే.. ఫిబ్రవరి 17వ తేదీన అదే పరేడ్ గ్రౌండ్‌లో భారీ బహిరంగసభకు  బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రణాళిక సిద్ధం చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు తర్వాత ఏ సభ పెట్టిన జాతీయ స్థాయిలో ఉండాలని అనుకుటున్నారు. అందుకే  పరేడ్ గ్రౌండ్స్ సభకు జాతీయ నేతల్ని ఆహ్వానిస్తున్నారు.. ఫిబ్రవరి 17న కేసీఆర్ పుట్టిన రోజు. ఆయన అదే రోజు సచివాలయాన్ని ప్రారంభిస్తున్నారు. కొత్తగా నిర్మించిన  ఆ సచివాలయాన్ని ఘనంగా ప్రారంభించేందుకు  ఏర్పాట్లు చేస్తున్నారు.  తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, బిహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్, బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తరఫున ఆయన ప్రతినిధిగా జేడీయూ జాతీయ అధ్యక్షుడు లలన్ సింగ్, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ మనవడు ప్రకాశ్ అంబేద్కర్ ఇలా అందర్నీ పిలుస్తున్నారు.  వీరందరితో బహిరంగసభలో పాల్గొంటారు. 


ఎవరి సభ ఎక్కువ సక్సెస్ అవుతుంది ? 


సహజంగానే మోదీ సభ నిర్వహించి వెళ్లిన మూడు, నాలుగు రోజులకే పోలికలు వస్తాయి. జాతీయ నేతలు.. పలువురు సీఎంలు హాజరవుతున్నందున..   జాతీయ స్థాయిలో ప్రచారం ఉటుంది.   బీజేపీ కన్నా తామే గొప్ప బహిరంగసభ నిర్వహించామని చాటే అవకాశం కూడా వస్తుంది. ఇలాంటి అవకాశాన్ని బీఆర్ఎస్ వదులు కోదు. అయితే... ప్రధాని సభ... అదీ కూడా తెలంగాణలో అధికారాన్ని దక్కించుకోవాలని పోటీ పడుతున్నందున..  ఏ మాత్రం రాజీ పడకూడదని. బీజేపీ కూడా అనుకుంటుంది. ఈ సభ అటు మోదీ.. ఇటు కేసీఆర్ లకు ప్రతిష్టాత్మకంగా మారనుంది.  ఎవరిది పైచేయి అవుతుదోననే ఉత్కంఠ సహజంగానే ప్రారంభమవుతుంది.