BJP No To Pawan Kalyan : పొత్తులపై పవన్ కల్యాణ్ చేస్తున్న కామెంట్స్ రాజకీయ వర్గాలను సైతం అయోమయానికి గురి చేస్తున్నాయి. బీజేపీతోనే ఉన్నామని ఉంటామని ఓ సారి చెబుతారు. ఆ పార్టీ కలసి వస్తే అని మరోసారి అంటారు. అయితే పవన్ కల్యాణ్ కొండగట్టులో తెలంగాణ గురించే మాట్లాడి ఉండవచ్చు.. కానీ బీజేపీతో పొత్తు రెండు రాష్ట్రాల్లో ఉంది. అదే సమయంలో భీమవరంలో జరుగుతున్న బీజేపీ ఏపీ కార్యవర్గ సమావేశాల్లో జనసేనతో పొత్తు లేదన్నట్లుగా ఆ పార్టీ వ్యవహరించింది. రాజకీయ తీర్మానంలో జనసేన ప్రస్తావన కూడా తీసుకు రాలేదు. దీంతో బీజేపీ పవన్ కల్యాణ్ ను దూరం పెట్టిందన్న అభిప్రాయం రాజకీయవర్గాల్లో ఏర్పడుతోంది.
తెలంగాణలో జనసేనను కలుపుకోవడానికి బీజేపీ నిరాసక్తత !
గౌరవం లేని చోట పొత్తుల ప్రస్తావనే ఉండదని గతంలో తెలంగాణలో బీజేపీ నేతలను ఉద్దేశించి పవన్ కల్యాణ్ అన్నారు. ఆ తర్వాత బీజేపీ నేతలు కూడా.. జనసేనతో తెలంగాణలో పొత్తు లేదని ఆ పార్టీతో పొత్తు.. ఏపీ వరకే పరిమితమని ప్రకటించారు. అప్పట్నుంచి తెలంగాణలో రెండు పార్టీల మధ్య పొత్తు ఉందని ఎవరూ అనుకోవడం లేదు. పవన్ కల్యాణ్ గత గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేయడానికి అభ్యర్థులను కూడా ప్రకటించారు. అయితే బీజేపీ నేతలు వచ్చి అడగడంతో చివరి క్షణంలో విరమించుకున్నారు. అయితే ఆ తర్వాత బీజేపీ నేతలతో సంబంధాలు చెడిపోయాయి. ఈ కారణంగా పవన్ బీజేపీతో పొత్తు ఉండదని ప్రకటించారు. కానీ ఈ సారి మాత్రం కొండగట్టులో బీజేపీ కలిసి వస్తే పని చేయడానికి సిద్ధమయ్యారు. తమ బలం పరిమితమన్నారు. కొత్త పొత్తులకు చాన్స్ ఉందన్నారు. అయితే బీజేపీ మాత్రం ఎన్నికల్లో పొత్తుల్లేకుండా పోటీ చేయాలని నిర్ణయించుకుంది. జనసేన పార్టీతో పొత్తుల కోసం ఏ మాత్రం ఆసక్తి చూపించడం లేదు.
ఏపీలోనూ జనసేనతో పొత్తు లేనట్లుగానే బీజేపీ వ్యవహారశైలి !
ఏపీలో కూడా బీజేపీ అసలు తాము జనసేనతో పొత్తులో ఉన్నామన్న విషయాన్ని కూడా మర్చిపోయినట్లుగా వ్యవహరిస్తోంది. భీమవరంలో జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాల్లో రాజకీయ తీర్మానాన్ని బీజేపీ ఆమోదించింది. అందులో ఎక్కడా .. తాము మిత్రపక్షాలతో కలిసి ఉన్నామనీ కానీ ఆ పార్టీతో కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తామన్న వ్యాఖ్యలు చేయలేదు. వైసీపీ, టీడీపీలకు ప్రత్యామ్నాయంగా తాము ఎదుగుతామని తీర్మానం చేశారు. డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలని.. తీర్మానించారు. టీడీపీ, వైసీపీలతో పొత్తులు పెట్టుకునే అవకాశాల్లేవని స్పష్టమయింది. మరి జనసేన విషయాన్ని ఎందుకు పట్టించుకోలేదన్నది కీలకం. జనసేన ఇటీవల ఓట్లను చీల్చబోమని.. చెబుతూ వస్తోంది. చంద్రబాబుతో రెండు సార్లు పవన్ సమావేశం అయ్యారు. బీజేపీ మాత్రం పవన్ టీడీపీకి దగ్గరయ్యారని ఫిక్సయిపోయి.. ఆ పార్టీని వీలైనంత దూరం పెట్టాలని నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది.
పవన్ కు వేరే ఆప్షన్ లేకుండా పోతోందా ?
పవన్ కల్యాణ్ తెలంగాణలో ఒంటరిగా పోటీ చేయాల్సిందే. ఏపీలో టీడీపీతో పొత్తులు పెట్టుకున్నా.. తెలంగాణలో ఆ రెండు పార్టీలు పొత్తులు పెట్టుకోవడం వల్ల కలసి వచ్చే ప్రయోజనం ఏమీ ఉండదు. రెండు పార్టీల ఫోకస్ ఏపీపైనే ఉంటుంది. అయితే ఏపీలో పొత్తులు కుదురుతాయా అన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదు. అంతర్గతంగా ఏమైనా చర్చలు జరుగుతున్నాయా లేదా అన్నది ఆయా పార్టీల వారికే తెలుసు. కానీ బీజేపీ మాత్రం.. పవన్ కల్యాణ్ కు రెండు రాష్ట్రాల్లోనూ దూరమయినట్లే. ఇప్పుడు ఏపీలో పొత్తులు పెట్టుకోవాలంటే.. టీడీపీనే ఆప్షన్. లేదంటే ఒంటరి పోటీ చేయాల్సి ఉంటుంది.