Bashar al-Assad Leaves Syria : సిరియాలో అధ్యక్షుడు బషర్ అల్-అస్సాద్ పాలన ముగిసిందని తిరుగుబాటుదారుల గ్రూపు పేర్కొంది. తిరుగుబాటుదారులు డమాస్కస్‌లోకి ప్రవేశించిన తర్వాత సిరియా అధ్యక్షుడు అసద్ దేశం విడిచి వేరే ప్రాంతానికి పారిపోయారని వార్తా సంస్థ రాయిటర్స్ పేర్కొన్నట్లు వార్తలు వస్తున్నాయి. అసద్ రష్యా లేదా టెహ్రాన్ వెళ్లే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే దీనికి సంబంధించి ఇంకా ఎలాంటి అధికారిక సమాచారం వెల్లడి కాలేదు. మీడియా నివేదికల ప్రకారం.. బషర్ అల్-అస్సాద్ సిరియా నుండి రష్యా కార్గో విమానంలో బయలుదేరాడు. అస్సాద్ విమానం రాడార్ నుండి మిస్సయింది. ప్రస్తుతానికి అతని గురించి ఎటువంటి సమాచారం అందుబాటులో లేదు. సిరియా ప్రధాని మహ్మద్ ఘాజీ జలాలీ తన ఇంటి నుండి ఒక వీడియో ప్రకటనను విడుదల చేసి, తాను దేశంలోనే ఉంటానని, అధికారాన్ని సజావుగా బదిలీ చేయడానికి కృషి చేస్తానని ప్రకటించారు.
ప్రజల సంబరాలు
సిరియాలోని తిరుగుబాటుదారులు డమాస్కస్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారని, దీంతో అధ్యక్షుడు బషర్ అల్-అస్సాద్ పాలన ముగిసిందని ప్రకటించారు. డమాస్కస్ వీధుల్లో చాలా మంది ప్రజలు సంబరాలు చేసుకోవడం కనిపించింది. అసద్ పారిపోయాడని, డమాస్కస్ ఇప్పుడు విముక్తి పొందిందని తిరుగుబాటుదారులు తెలిపారు. జైళ్లలో ఉన్న ఖైదీలందరినీ విడుదల చేయాలని తిరుగుబాటుదారులు టీవీలో విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. డమాస్కస్ వీధులు అల్లా-హు-అక్బర్ నినాదాలతో, కాల్పుల మోతతో ప్రతిధ్వనించాయి. తిరుగుబాటుదారులు గాల్లోకి కాల్పులు జరుపుతూ సంబరాలు చేసుకున్నారు.
అసద్ తండ్రి విగ్రహం ధ్వంసం
కొందరు తిరుగుబాటుదారులు అసద్ తండ్రి విగ్రహాన్ని ఎక్కి ధ్వంసం చేశారు. ఈ రోజు కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నామని చెప్పారు. నేడు సిరియాలో కొత్త శకం ప్రారంభం కానుంది. తిరుగుబాటు గ్రూపు ఇస్లామిస్ట్ హయత్ తహ్రీర్ అల్ షామ్ (HTS)కి టర్కియే మద్దతు ఉంది. ఇది రెండు రోజుల క్రితం అలెప్పోను మొదటిసారిగా స్వాధీనం చేసుకుంది. దీని తరువాత, వారు ఒక్కొక్కటిగా నగరాలను జయించి, డమాస్కస్ చేరుకున్నారు. 50 ఏళ్ల నిరంకుశ పాలన తర్వాత బాత్ పాలన ముగిసింది. తిరుగుబాటు బృందం టెలిగ్రామ్‌లో పేర్కొంది. ఈ సంవత్సరాల్లో చాలా మంది ప్రజలు తమ ఇళ్లను వదిలి వెళ్లవలిసి వచ్చింది. చీకటి రోజులు ముగిశాయని, సిరియాలో కొత్త శకం ప్రారంభమవుతోందని ప్రకటించారు.
Also Read : South Korea President: దక్షిణ కొరియా అధ్యక్షుడికి తప్పిన పదవీ గండం, అభిశంసన నుంచి ఎలా గట్టెక్కారో తెలుసా
నేను సిద్ధంగా ఉన్నాను
సిరియా ప్రజలు తాము ఏ ప్రభుత్వాన్ని ఎంచుకున్నా సహకరించేందుకు సిద్ధంగా ఉన్నారని ప్రధాని మహ్మద్ అల్ జలాలీ అన్నారు. వారు డమాస్కస్ అంతర్జాతీయ విమానాశ్రయం మీదుగా సిరియా నుండి బయలుదేరినట్లు మానవ హక్కుల కోసం సిరియన్ అబ్జర్వేటరీ రామి అబ్దేల్ రెహమాన్ తెలిపారు. అయితే, ఏఎఫ్ పీ ఈ నివేదికను ధృవీకరించలేదు. తమ యోధులు జైళ్ల నుండి ఖైదీలను విడుదల చేస్తున్నారని తిరుగుబాటుగ్రూప్ తెలిపింది. అంతకుముందు తిరుగుబాటుదారులు హోమ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. హోమ్స్ నుండి డమాస్కస్‌కు దూరం 140 కిలోమీటర్లు మాత్రమే. అసద్ దేశం నుండి గుర్తు తెలియని ప్రదేశానికి పారిపోయాడని సిరియా ప్రతిపక్ష వార్ మానిటర్ అధిపతి పేర్కొన్నారు. కాగా, శాంతియుతంగా ప్రతిపక్షాలకు పాలనా పగ్గాలు అప్పగించేందుకు సిద్ధమని సిరియా ప్రధాని మహ్మద్ ఘాజీ జలాలీ ఓ వీడియో ప్రకటన విడుదల చేశారు.
2108తర్వాత తొలిసారి
2018 తర్వాత డమాస్కస్‌లోకి తిరుగుబాటుదారులు చేరుకోవడం ఇదే తొలిసారి. సంవత్సరాల ముట్టడి తర్వాత 2018లో సిరియా దళాలు రాజధాని శివార్లను తిరిగి స్వాధీనం చేసుకున్నాయి. డమాస్కస్ విమానాశ్రయం ఖాళీ అయిందని , అన్ని విమానాలను నిలిపివేసినట్లు ప్రభుత్వ అనుకూల షామ్ ఎఫ్ ఎం రేడియో నివేదించింది. తిరుగుబాటుదారులు రాజధానికి ఉత్తరాన ఉన్న సైద్నాయ సైనిక జైలులోకి ప్రవేశించారని.. అక్కడ ఖైదీలను "విముక్తి" చేశారని కూడా ప్రకటించారు. ముందు రోజు రాత్రి, ప్రభుత్వ బలగాలు సిరియా మూడవ అతిపెద్ద నగరమైన హోమ్స్ నుండి తిరిగి బయలు దేరాయి. సిరియా తిరుగుబాటు గ్రూపు 'జిహాదిస్ట్ హయత్ తహ్రీర్ అల్-షామ్' గ్రూప్ (హెచ్‌టిఎస్) అధినేత అబూ మహ్మద్ అల్-గోలానీ గురువారం సిరియా నుండి 'సిఎన్‌ఎన్'కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో అసద్ ప్రభుత్వాన్ని గద్దె దించడమే ఈ దాడి లక్ష్యం అని అన్నారు.