Reasi Attack Telugu News: జమ్మూ కాశ్మీర్‌లోని రియాసి జిల్లాలో ఆదివారం భక్తులు ప్రయాణిస్తున్న బస్సుపై ఉగ్రవాదులు దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఉగ్రవాదుల జాడ కోసం పోలీసులు భారీ సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. ఈ సెర్చ్ ఆపరేషన్ లో 11 భద్రతా దళాల బృందాలు పనిచేస్తున్నాయి. పోనీ తెరయాత్ ప్రాంతాన్ని అన్ని వైపుల నుంచి దిగ్బంధించారు. జమ్మూ, రాజౌరి జిల్లాల్లో భద్రతా బలగాలు హై అలర్ట్ ప్రకటించి దర్యాప్తును ముమ్మరం చేశాయి. దాదాపు 20 మందికి పైగా వ్యక్తులను విచారణ కోసం అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. పరారీలో ఉన్న ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు పోలీసులు, ఆర్మీ, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) బృందాలను మోహరించినట్లు ఉదంపూర్-రియాసి రేంజ్ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డిఐజి) రయీస్ మహ్మద్ భట్ తెలిపారు.
దాడిలో పది మంది మృతి
దాడి జరిగిన ప్రాంతానికి చుట్టుపక్కల సోదాలు కొనసాగుతున్నాయని మరో సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. దాడిలో గాయపడిన వ్యక్తుల వాంగ్మూలాల ఆధారంగా ఉగ్రవాదులపై నిఘా ఉంచినట్లు ఆయన చెప్పారు. ఈ దాడిలో నలుగురు ఉగ్రవాదులు పాల్గొన్నట్లు అధికారులు ప్రకటించారు. ఆదివారం జమ్మూ కాశ్మీర్‌లోని రియాసి జిల్లాలోని తీర్థయాత్ర నుండి యాత్రికులను తీసుకెళ్తున్న బస్సుపై ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో పది మంది మరణించారు. మరో 33 మంది గాయపడ్డారు. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ఆధారంగా ఉగ్రవాది స్కెచ్‌ను పోలీసులు విడుదల చేశారు.
ప్రత్యక్ష సాక్షులు ఏం చెప్పారు?
యాత్రికులతో నిండిన బస్సు శివఖోడి నుండి కత్రాకు వెళ్తుండగా ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. బస్సు పై నుంచి కిందకు వస్తుండగా మార్గమధ్యలో ఓ ఉగ్రవాది కాల్పులు జరిపాడు. డ్రైవర్ కు బుల్లెట్ గాయం కావడంతో బస్సు అదుపుతప్పి కాలువలో పడిపోయింది. దాదాపు 20 నిమిషాల పాటు అతడితో పాటు మరికొందరు ఉగ్రవాదులు ఆగకుండా కాల్పులు జరిపారు. సమాచారం అందుకున్న పోలీసులు.. స్థానికుల సాయంతో కాల్వలో పడిపోయిన ప్రయాణికులను రక్షించినట్టు చెప్పారు.
పట్టిస్తే రూ.20 లక్షలు
రియాసి జిల్లాలో ప్రయాణీకుల బస్సుపై దాడికి పాల్పడిన ఉగ్రవాది స్కెచ్‌ను జమ్మూ కాశ్మీర్ పోలీసులు మంగళవారం విడుదల చేశారు. అతని గురించి సమాచారం అందించిన వారికి రూ.20లక్షల రివార్డును ప్రకటించారు. రియాసి ఎస్పీ- 9205571332, రియాసి ఏఎస్పీ- 9419113159, ఎస్‌హెచ్‌ఓ పౌని- 7051003214 ఫోన్ నంబర్లకు అతడి గురించి సమాచారం తెలిస్తే అందించాలని పోలీసులు సూచించారు. రాస్నో-పౌని-త్రెయాత్ ప్రాంతాల్లో 11 భద్రతా బలగాల బృందాలతో ఉగ్రవాదుల కోసం వేట కొనసాగుతోంది. ఈ దాడి వెనకాల లష్కరే తోయిబా ఉగ్ర వాద సంస్థ ఉన్నట్లు జమ్మూ కశ్మీర్ పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సోమవారం నుంచి ఎన్‌ఐఏ ఫొరెన్సిక్ టీం ఆధారాలను సేకరిస్తోంది.