Wrestlers Protest: 


రెండు కేసులు నమోదు 


రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (WFI) చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై ఢిల్లీ పోలీసులు రెండు FIRలు నమోదు చేశారు. మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించారంటూ ఆరోపణల ఆధారంగా కేసు నమోదు చేశారు. దీనిపై బ్రిజ్ భూషణ్ స్పందించారు. తాను ఏ తప్పూ చేయలేదని స్పష్టం చేశారు. ఎలాంటి విచారణకైనా సిద్ధంగానే ఉన్నానని తేల్చి చెప్పారు. సుప్రీంకోర్టుపైన తనకు గౌరవం ఉందన్న ఆయన...న్యాయస్థానం ఎలాంటి తీర్పునిచ్చినా స్వీకరిస్తానని అన్నారు. రెజ్లర్‌లు రోజుకో డిమాండ్ చేస్తున్నారని మండి పడ్డారు. 


"నాకు ఆ ఆరోపణలకు ఎలాంటి సంబంధం లేదు. నేను ఇన్నోసెంట్‌ని. ఎలాంటి విచారణకైనా సిద్ధమే. దర్యాప్తు సంస్థలకు పూర్తి సహకారం అందిస్తాను. సుప్రీంకోర్టు తీర్పుని గౌరవిస్తాను. రెజ్లర్‌లు రోజుకో డిమాండ్ తెరపైకి తీసుకొస్తున్నారు. ముందు నాపై FIR నమోదు చేయాలని అన్నారు. అది అయిపోయింది. ఇప్పుడు నన్ను జైలుకి పంపాలని డిమాండ్ చేస్తున్నారు. అన్ని పదవుల నుంచి రిజైన్ చేయాలని అంటున్నారు. నేనో ఎంపీని. ఈ పదవి నాకు ప్రజలే ఇచ్చారు. రాజ్యాంగబద్ధంగా వచ్చిన హోదా ఇది. వినేష్ ఫోగట్‌ వల్ల వచ్చిన పదవి కాదిది. కేవలం ఓ కుటుంబం మాత్రమే ఈ నిరసనలు చేస్తోంది. మిగతా ప్లేయర్స్ అంతా నాకు మద్దతుగా ఉన్నారు"


- బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్, WFI చీఫ్ 




ఇన్నాళ్లు ఈ రెజ్లర్‌లు అంతా ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు బ్రిజ్ భూషణ్. ఈ ఆందోళనలకు దిగే ముందు కూడా తనతో వాళ్లు బాగానే ఉన్నారని, ఆ తరవాత ఏమైందో తెలియదని వెల్లడించారు. 


"దాదాపు 12 ఏళ్లుగా ఆ రెజ్లర్‌లు ఏ పోలీస్‌ స్టేషన్‌లో కూడా నాపై ఫిర్యాదు చేయలేదు. అటు క్రీడా మంత్రిత్వా శాఖకూ కంప్లెయింట్ చేయలేదు. ఈ నిరసనలు చేపట్టే ముందు నాతో వాళ్లు బాగానే ఉన్నారు. నన్ను పొగిడే వాళ్లు. వాళ్ల పెళ్లికి కూడా నన్ను పిలిచారు. నాతో సెల్ఫీలు దిగారు. నా ఆశీర్వాదం తీసుకున్నారు. ఏదేమైనా ఇప్పుడీ కేసు సుప్రీంకోర్టుకి చేరుకుంది. ఎలాంటి తీర్పు వచ్చినా గౌరవిస్తాను. ఇది వాళ్లంతట వాళ్లుగా చేస్తున్న నిరసన కాదు. ఈ దీక్ష వెనకాల కాంగ్రెస్ ఉందన్న అనుమానముంది. "


- బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్, WFI చీఫ్