Rashtrapati Bhavan Halls Name Change: రాష్ట్రపతి భవనంలోని దర్బార్ హాల్, అశోక్ హాల్ పేర్లను మారుస్తూ కేంద్రం కీలక ప్రకటన చేసింది. ఇకపై దర్బార్ హాల్‌ని గణతంత్ర మండప్‌గా, అశోక్ హాల్‌ని అశోక్ మండప్‌గా పిలవనున్నారు. దర్బార్ హాల్‌లో నేషనల్ అవార్డుల ప్రదాన కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటారు. అశోక్ హాల్‌ని పార్టీల సమయంలో విందు కోసం వినియోగిస్తారు. బ్రిటీష్ కాలం నాటి "దర్బార్" పదాన్ని తొలగిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఒకప్పుడు భారత్‌ని పరిపాలించిన వాళ్లు ఈ పేరు పెట్టుకున్నారని, ఇప్పుడు భారత్ గణతంత్ర దేశంగా మారిపోయిందని తేల్చి చెప్పింది. అందుకే దర్బార్ అనే పదాన్ని తొలగించి ఆ స్థానంలో గణతంత్ర అనే పదాన్ని చేర్చినట్టు ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ ఉత్తర్వులు జారీ చేసింది.
"దర్బార్ అనే పదం భారత్‌ని పరాయివాళ్లెవరో పరిపాలించినప్పటి నాటిది. ఈ పదానికి కాలం చెల్లిపోయింది. ఇప్పుడు భారత్ గణతంత్ర దేశం. పైగా గణతంత్ర అనే పదానికి భారత్‌కి విడదీయలేని బంధం ఉంది. అందుకే దర్బార్ హాల్‌కి గణతంత్ర మండప్ పేరు పెడుతున్నాం. ఈ పేరే సరైందని మేం భావిస్తున్నాం. అశోక చక్రవర్తికి గౌరవ సూచకంగా ఓ హాల్‌కి అశోక మండప్ అనే పేరు పెట్టాం. అశోక అనే పదానికి భారత దేశ సంస్కృతికి సంబంధం ఉంది. "
- కేంద్ర ప్రభుత్వం
ఇక అశోక్ హాల్‌ని పేరుని అశోక్ మండప్‌గా మార్చింది కేంద్రం. అశోక్ అంటే ఎలాంటి బాధలూ లేకపోవడం అని అర్థం. పైగా అశోక చక్రవర్తిని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. శాంతియుత జీవనం, ఐకమత్యానికి ప్రతీకగా నిలిచిన అశోక చక్రవర్తికి గౌరవంగా ఈ పేరు పెట్టున్నట్టు వెల్లడించింది కేంద్రం.