Mr. Bachchan OTT Rights: ఈరోజుల్లో చాలా వరకు సినిమాలు విడుదల అవ్వక ముందు, బాక్సాఫీస్ వద్ద దాని రిజల్ట్ ఏంటో తెలియక ముందే ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్ అన్నీ రైట్స్ కోసం క్యూ కడుతున్నాయి. ఆ కేటగిరిలో ఇప్పుడు రవితేజ ‘మిస్టర్ బచ్చన్’ కూడా యాడ్ అయ్యింది. హరీష్ శంకర్ దర్శకత్వంలో రవితేజ నటిస్తున్న ‘మిస్టర్ బచ్చన్’పై ఇప్పటికీ ప్రేక్షకుల్లో బజ్ క్రియేట్ అయ్యింది. వారి కంటెంట్ మీద ఉన్న నమ్మకంతో ఆగస్ట్ 15న ఎన్నో సినిమాలకు పోటీగా ఈ సినిమాను కూడా విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించుకున్నారు. తాజాగా ఈ మూవీ ఓటీటీ హక్కులు కూడా భారీ రేటుకు అమ్ముడుపోయాయని తెలుస్తోంది.
ఆ ఓటీటీలోనే..
రవితేజ, హరీష్ శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘మిస్టర్ బచ్చన్’ ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసిందని సమాచారం. దీని కోసం ఈ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ బాగానే ఖర్చు చేసిందట. కానీ ఇప్పుడిప్పుడే ప్రమోషన్స్ విషయంలో యాక్టివ్ అవుతున్న ‘మిస్టర్ బచ్చన్’ టీమ్.. ఓటీటీ పార్ట్‌నర్ గురించి అనౌన్స్ చేయడానికి ఇంకా సమయం ఉందని ప్రేక్షకులు భావిస్తున్నారు. ఈ సినిమాలో రవితేజ సరసన హీరోయిన్‌గా భాగ్యశ్రీ బోర్సే నటిస్తోంది. జగపతి బాబు విలన్ రోల్‌లో కనిపించనున్నారు. ఇప్పటికే ‘మిస్టర్ బచ్చన్’ నుండి విడుదలయిన ఒక రొమాంటిక్ సాంగ్, ఒక మాస్ సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
హ్యాట్రిక్ కాంబినేషన్స్..
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ ద్వారా ‘మిస్టర్ బచ్చన్’ను భారీ ప్రొడక్షన్ వాల్యూతో నిర్మిస్తున్నారు టీజీ విశ్వప్రసాద్. ఇప్పటికే రవితేజ, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కాంబినేషన్‌లో రెండు సూపర్ హిట్ చిత్రాలు రాగా.. ‘మిస్టర్ బచ్చన్’ హ్యాట్రిక్‌గా నిలవనుందని ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక రవితేజ, హరీష్ కాంబినేషన్‌లో కూడా ఇది హ్యాట్రిక్ సినిమానే. టాలీవుడ్‌కు హరీష్‌ను దర్శకుడిగా పరిచయం చేసిందే రవితేజ. ఈ మాస్ మహారాజ్ హీరోగా నటించిన ‘షాక్’.. దర్శకుడిగా హరీష్ శంకర్ డెబ్యూ చిత్రం. కానీ అది కమర్షియల్‌గా సక్సెస్ సాధించలేకపోయింది. ఆ తర్వాత వీరి కాంబినేషన్‌లో ‘మిరపకాయ్’ లాంటి బ్లాక్‌బస్టర్ చిత్రం తెరకెక్కింది. ఇప్పుడు ‘మిస్టర్ బచ్చన్’ హ్యాట్రిక్ మూవీగా తెరకెక్కుతోంది.
అరడజను సినిమాలకు పోటీగా..
తాజాగా ఆగస్ట్ 15న ‘మిస్టర్ బచ్చన్’ థియేటర్లలో విడుదల కానుందని మేకర్స్ అనౌన్స్ చేశారు. కానీ అప్పటికే స్వాతంత్ర్య దినోత్సవానికి థియేటర్లలో సందడి చేయడం కోసం ఎన్నో చిత్రాలు సిద్ధంగా ఉన్నాయి. దాదాపు అరడజను సినిమాలకు పోటీగా ‘మిస్టర్ బచ్చన్’ కూడా అదేరోజు విడుదలకు సిద్ధమయ్యింది. ప్రమోషన్స్‌లో వేగం పెంచితే ఈ సినిమా చాలామంది ప్రేక్షకులకు రీచ్ అయ్యే అవకాశం ఉందని ఇండస్ట్రీ నిపుణులు భావిస్తున్నారు. ఇక ‘మిస్టర్ బచ్చన్’లో యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ కూడా అతిథి పాత్రలో కనిపించనున్నాడనే వార్త గత కొన్నిరోజులుగా సినీ సర్కిల్లో చక్కర్లు కొడుతోంది. ఈ విషయంపై మూవీ టీమ్ ఇంకా స్పందించాల్సి ఉంది.
Also Read: రవితేజతో టిల్లు సందడి - అదరగొట్టే అతిథి పాత్రలో యంగ్ హీరో!