Ram Navami Violence:
రాళ్లు రువ్వుకున్నారు..
ముంబయిలోని శ్రీరామ నవమి వేడుకల్లో రెండు గ్రూపులు తీవ్రంగా గొడవ పడ్డాయి. శోభా యాత్ర నిర్వహించే క్రమంలో మల్వానీ ప్రాంతంలో ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ఒక్కసారిగా అక్కడి ప్రజలు ఉలిక్కి పడ్డారు. ఈ గొడవకు కారణమైన 300 మందిపై కేసులు పెట్టిన పోలీసులు 20 మందిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నట్టు పోసీసులు తెలిపారు. ఆ తరవాతే ఉన్నట్టుండి గొడవ పెద్దదైందని చెప్పారు. స్థానికులు భయాందోళనలకు గురవ్వకుండా పెద్ద ఎత్తున పోలీసులు మొహరించారు.
"రామనవమి శోభాయాత్రలో ఈ సంఘటన జరిగింది. దీంతో సంబంధం ఉన్న అందరిపైనా కేసులు నమోదు చేశాం. పోలీసులందరూ అప్రమత్తంగా ఉన్నారు. ప్రస్తుతానికి పరిస్థితులు అదుపులోనే ఉన్నాయి'
- డీసీపీ అజయ్ భన్సాల్
ఈ కొట్లాటలో ఓ వ్యక్తికి గాయాలయ్యాయి. సీనియర్ పోలీస్ అధికారులతో పాటు కొందరు రాజకీయ నేతలకూ ఘటనా స్థలానికి వచ్చారు. ఈ గొడవను చల్లార్చారు. ముంబయిలోనే కాదు. గుజరాత్‌లోని వడోదరలోనూ ఇలాంటి సంఘటనే వెలుగులోకి వచ్చింది. శోభాయాత్ర చేసే క్రమంలోనే దాదాపు 22 మంది రాళ్లు రువ్వుకున్నారు. చేతికి ఏది దొరికితే దాంతో దాడులు చేశారని బాధితులు చెప్పారు.
ఇండోర్‌లో ప్రమాదం..
మధ్యప్రదేశ్ ఆర్థిక రాజధాని ఇండోర్ లోని బేలేశ్వర్ మహాదేవ్ జులేలాల్ ఆలయంలో పండుగపూట విషాదం చోటు చేసుకుంది. శ్రీరామ నవమి రోజున గుడిలో ఉన్న మెట్లబావి కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 35 మంది చనిపోయారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే మృతుల్లో 18 మంది మహిళలు, బాలికలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. బావి శిథిలాలలో చిక్కుకున్న మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇంకా చాలా మంది గల్లంతైనట్లు సమాచారం. మోహౌ నుంచి వచ్చిన ఆర్మీ సిబ్బంది శిథిలాలలో సమాధి అయిన వ్యక్తులను వెతికే పనిలో నిమగ్నమయ్యారు. ఘటనా స్థలంలో ఎన్డీఆర్‌ఎఫ్ బృందం కూడా ఉంది. ప్రజలందరూ ఆలయం లోపల ఉన్న మెట్ల బావి పైన ఉన్న పలకపై కూర్చుని పూజలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఒక్కసారిగా స్లాబ్ లోపలికి దూసుకెళ్లింది. దీంతో 30 మందికి పైగా మెట్ల బావిలో పడిపోయారు. మెట్ల బావి దాదాపు 40 అడుగుల లోతు ఉంటుంది. 4 నుంచి 5 అడుగుల మేర నీరు నిండిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు స్థానికుల సాయంతో తాళ్ల సహాయంతో బావిలో నుంచి ప్రజలను బయటకు తీసేందుకు ప్రయత్నించారు.
Also Read: VC Sajjanaar: అమితాబ్ బచ్చన్ జీ ఆ యాడ్స్‌లో నటించకండి - వీసీ సజ్జనార్ విజ్ఞప్తి!