Ram Mandir Construction:


సీతారాముల విగ్రహాల తయారీ..


అయోధ్య రామ మందిర నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. వచ్చే ఏడాది నాటికి ఆలయం అందుబాటులోకి వస్తుందని ఇప్పటికే కేంద్రం ప్రకటించింది. రాముడి విగ్రహ తయారీపై ప్రత్యేక దృష్టి సారించింది రామ మందిర ట్రస్ట్. దాదాపు ఆరడుగుల రాముడి విగ్రహాన్ని తయారు చేయించి...వచ్చే ఏడాది సంక్రాంతి నాటికి ప్రతిష్ఠించాలని ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. అయితే..ఈ విగ్రహ తయారీ కోసం ప్రత్యేక శిలలు తెప్పిస్తోంది. నేపాల్ నుంచి రెండు సాలగ్రామ శిలలను తరలించారు. ఇప్పటికే ఇవి అయోధ్యకు చేరుకున్నాయి. రామ మందిర ప్రాంగణానికి చేరుకోగానే పూజారులు, స్థానికులు ఆ శిలలకు ఘనస్వాగతం పలికారు. పూలతో అలంకరించారు. పూజలు చేశారు. ఆ తరవాత ఆ శిలలను శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌కు అప్పగించారు. రాముడితో పాటు సీతా దేవి విగ్రహాన్నీఈ శిలతోనే తయారు చేయనున్నారు. గర్భాలయంలో ఈ రెండు విగ్రహాలను ప్రతిష్ఠించనున్నారు. నేపాల్‌లోని కలి గండకి నదీ తీరంలో ఈ శిలలను సేకరించారు. వీటిని సీతాజన్మ స్థలిగా భావించే జానక్‌పూర్ నుంచి ప్రత్యేక క్రేన్‌ల ద్వారా అయోధ్యకు తరలించారు. ఈ రెండు సాలగ్రామ శిలల్లో ఒక దాని బరువు 18 టన్నులు కాగా...మరోటి 16 టన్నులు. విగ్రహ తయారీకి ఈ రెండు శిలలు అనువుగా ఉన్నట్టు అధికారులు నిర్ధరించారు. 






వచ్చే ఏడాది జనవరి 1వ తేదీ నాటికి అయోధ్య రామ మందిరం సిద్ధమైపోతుందని ఇప్పటికే కేంద్ర మంత్రి అమిత్‌షా ప్రకటించారు. ఆ తరవాత ట్రస్ట్ సెక్రటరీ ఛంపత్ రాయ్ కూడా కీలక విషయం వెల్లడించారు. గర్భగుడి నిర్మాణం వేగంగా కొనసాగుతోందని, రామ్‌లల్లా విగ్రహాన్ని వచ్చే ఏడాది మకర సంక్రాంతి రోజున ప్రతిష్ఠిస్తామని చెప్పారు. అయితే..ఆ రాముడి విగ్రహం ఎలా ఉంటుందని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దీనిపై స్పష్టతనిచ్చారు చీఫ్ ప్రీస్ట్ ఆచార్య సత్యేంద్ర దాస్. విగ్రహం ఎలా ఉంటుందో వివరించారు. 


అద్భుతంగా విగ్రహం..


"అయోధ్య రామ మందిరంలో ప్రతిష్ఠించబోయే రాముడి విగ్రహం అద్భుతంగా ఉంటుంది. రాముడు నీల మేఘ శ్యాముడు కనుక ఆ రంగులోనే విగ్రహాన్ని తయారు చేయిస్తున్నాం. రామ్ లల్లాను పోలిన విగ్రహాన్నే ప్రతిష్ఠిస్తాం. స్వామి వారి రూపాన్ని అలా చూడగానే మైమరిచిపోతారు. అంత అందంగా ఉంటుంది. 5-6 అడుగుల ఎత్తులో ఉండనుంది. రాముడి బాలావతారం కళ్లకు కట్టినట్టుగా ఆ విగ్రహంలో కనిపించాలి. చూసిన ప్రతి ఒక్కరూ బాల రాముడే అనుకోవాలి."  
-రామ మందిరం పూజారి 


35 అడుగుల దూరం నుంచి చూసినా...రాముడు స్పష్టంగా కనిపిస్తాడని ట్రస్ట్ వెల్లడించింది. దేశవ్యాప్తంగా ప్రముఖ శిల్పులు రాముడి విగ్రహాన్ని చెక్కుతున్నారు. "సాధువులతో చర్చించి రాముడి విగ్రహం ఎలా ఉండాలో నిర్ణయిస్తాం. కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశా నుంచి ప్రత్యేకంగా తెప్పించిన శిలలతో విగ్రహం తయారు చేయిస్తాం" అని ట్రస్ట్ సెక్రటరీ చంపత్‌ రాయ్ చెప్పారు. అయితే..విగ్రహం ఎత్తు విషయంలో ఇలా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతుండటం వల్ల చివరకు ఏది ఖరారవు తుందన్నది తేలాల్సి ఉంది. 


Also Read: Vande Bharat Metro: త్వరలోనే వందేభారత్ మెట్రో రైళ్లు,కీలక నగరాల్లో సర్వీస్‌లు - రైల్వే మంత్రి ప్రకటన