శ్రీకాకుళం జిల్లాలో మత్స్యకారుల వలకు మిలటరీ డ్రోన్ చిక్కింది. సంతబొమ్మాలి మండలం భావనపాడు-మూలపేట తీరంలో మత్స్యకారులు వేట చేస్తుండగా వలలో ఈ పెద్ద డ్రోన్ లభ్యమయ్యింది. సుమారు 9 అడుగుల పొడవు, 111 కిలోల బరువుతో విమానాన్ని పోలే విధంగా ఉంది. దీనిపై బ్యాన్ సీ టార్గెట్ అని ఇంగ్లీష్ రాతలతో పాటు 8001 నెంబర్ రాసి ఉంది. మత్స్యకారుల ఈ పరికరాన్ని భావనపాడు మెరైన్ పోలీసులకు అప్పగించారు. దీన్ని పరిశీలించిన మెరైన్ పోలీసులు మిలటరీ డ్రోన్ గా అనుమానిస్తున్నారు. డిఫెన్స్ మిసైల్స్ ప్రయోగం సమయంలో విఫలమై సముద్రంలో పడిపోయి ఉండవచ్చని మెరైన్ పోలీసులు చెబుతున్నారు. దీనిపై నేవీ, కేంద్ర ఇంటిలిజెన్స్ అధికారులకు సమాచారం ఇచ్చినట్టు తెలిపారు.
అయితే, ఈ డ్రోన్ గురించి భావనపాడు పోలీసులు ఓ స్పష్టత ఇచ్చారు. ఈ డ్రోన్ శత్రు దేశాల నుంచి రాలేదని, మన దేశానికి చెందినదే అని తెలిపారు. దీని గురించి అసలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. మన దేశంలోనే కాక, ఇతర దేశాల్లోనూ ఇలాంటి డ్రోన్లను వాడతారని చెప్పారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు చెప్పామని, వారు కూడా విచారణ చేస్తున్నామని చెప్పారు. వారు ఇక్కడికి వచ్చి డ్రోన్‌ను పరిశీలించి మరోసారి ధ్రువీకరిస్తారని పోలీసులు తెలిపారు.
సంతబొమ్మాళీ మండలంలోని మూలపేట గ్రామంలో మత్స్యకారులు భావనపాడులో చేపల వేటకు సముద్రంలోకి వెళ్లినప్పుడు ఈ డ్రోన్ దొరికిందని పోలీసులు చెప్పారు. ఉదయం 9 గంటలకు మత్స్యకారులకు డ్రోన్ దొరగ్గా.. వారు ఆ డ్రోన్ భావనపాడు పోర్టుకు తీసుకొచ్చేసరికి మధ్యాహ్నం 12 గంటలు అయిందని వెల్లడించారు. స్థానిక గ్రామస్థులు దానిని వింతగా చూశాయని, సాగర మిత్ర ఉద్యోగులు కూడా ఆ డ్రోన్ చూడడం వల్ల తమకు సమాచారం అందించారని తెలిపారు. తాము దాన్ని పరిశీలించి తమ ఉన్నతాధికారులకు వారి ద్వారా సెంట్రల్ ఇంటలిజెన్స్ వర్గాలకు సమాచారం తెలియజేశామని చెప్పారు. వారు కూడా ఇక్కడికి వచ్చి పరిశీలించే అవకాశం ఉంది. వారి సూచనల ప్రకారం.. ఈ వ్యవహారంలో తమ తదుపరి చర్యలు ఉంటాయని పోలీసులు చెప్పారు.