Rajiv Gandhi Case:
రాజీవ్ గాంధీ హత్య కేసులో ఆ నలుగురు..
రాజీవ్ గాంధీ హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న ఆరుగురు దోషులు ఇటీవలే విడుదలయ్యారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో వీళ్ల ముక్తి లభించింది. వీళ్లను విడుదల చేయటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నా...తమకు ఈ హత్యతో ఎలాంటి సంబంధం లేదని అంటున్నారు దోషులు. వీరిలో నలుగురు శ్రీలంకకు చెందిన వాళ్లున్నారు. వాళ్లను తమ సొంత దేశానికి పంపించే పనిలో ఉన్నారు అధికారులు. మురుగన్ అలియాస్ శ్రీహరన్, రాబర్ట్ పయాస్, ఎస్ జయకుమార్, శంతన్‌లను శ్రీలంకకు పంపేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ...తమిళనాడు ప్రభుత్వానికి పలు సూచనలు, సలహాలు ఇచ్చింది. ప్రస్తుతానికి ఈ నలుగురినీ...తమిళనాడులోని తిరుచ్చిలో ఓ స్పెషల్ క్యాంప్‌లో ఉంచారు. అయితే...లీగల్ ప్రోసీజర్ ఇంకా పూర్తి కాలేదని, అది పూర్తైతే కానీ వాళ్లను శ్రీలంకకు పంపడం కుదరదని అధికారులు చెబుతున్నారు. ఎప్పుడు పంపాలి అనే విషయంలో ఇంకా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఇంకా తేదీలైతే నిర్ణయించలేదు. ఈ హత్య కేసులో శిక్ష అనుభవించి ఇటీవలే విడుదలైన నళిన శ్రీహరన్...ఆ నలుగురినీ కలిశారు. ఆ తరవాతే కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. "ఈ నలుగురు శ్రీలంక వాసులను వాళ్ల దేశానికి పంపాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నాను. వీరిలో నా భర్త కూడా ఉన్నారు. జైల్లో నుంచి విడుదలైనా...ఈ స్పెషల్ క్యాంప్ మరో జైలులానే ఉంది" అని అన్నారు నళిని శ్రీహరన్. ప్రస్తుతానికి తిరుచ్చిలోని ఈ స్పెషల్ క్యాంప్ వద్ద పోలీసులు భద్రతను పటిష్ఠం చేశారు.
నళిని వ్యాఖ్యలు..
ఈ మధ్యే నళిని శ్రీహరన్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు ఆ హత్యతో ఎలాంటి సంబంధం లేదని అన్నారు. "ఈ హత్య చేసినందుకు మీకు గిల్టీగా అనిపించడం లేదా" అని ప్రశ్నించగా...చాలా బ్యాలెన్స్‌డ్‌గా సమాధానం చెప్పారు నళిని. "అసలు నాకీ హత్యతో ఎలాంటి సంబంధం లేదు. ప్రపంచానికి నేనో దోషినే కావచ్చు. కానీ...అప్పుడేం జరిగిందో, నిజానిజాలేంటో నా మనస్సాక్షికి తెలుసు" అని బదులిచ్చారు. ఆ హత్య చేసిన గ్రూప్‌లో ఒకరిగా ఉండటం వల్లే అనుమానించి నాపై హత్యానేరం మోపారని వివరించారు. "హత్యకు పాల్పడిన వాళ్లంతా నా భర్త స్నేహితులు. నాకు వాళ్లతో కొంత పరిచయం ఉంది. నేను చాలా మితభాషిని. వాళ్లతో పెద్దగా ఎప్పుడూ మాట్లాడలేదు. వాళ్లకు అవసరమైన సాయం చేసే దాన్ని. వాళ్లతో పాటు వెళ్లేదాన్ని. అంతకు మించి వాళ్లతో నాకు వ్యక్తిగత పరిచయాలు ఏమీ లేవు. అసలు వాళ్ల కుటుంబ నేపథ్యాలేంటో కూడా నాకు తెలియదు" అని చెప్పారు నళిని శ్రీహరన్. 2001లో మరణశిక్ష విధించినప్పటి పరిస్థితులనూ వివరించారు. "నన్ను ఎప్పటికైనా ఉరి తీస్తారన్న నిర్ణయానికి వచ్చేశాను. అందుకు నేను ఎప్పుడో సిద్ధపడ్డాను. దాదాపు 7 సార్లు నన్ను ఉరి తీసేందుకు ప్రయత్నాలు జరిగాయి." అని చెప్పారు.
Also Read: Gurugram News: మహిళపై కుక్క దాడి- రూ.2 లక్షలు పరిహారం ఇవ్వాలని కోర్టు ఆదేశం!