Rajasthan Congress Crisis:


ఆసక్తి లేదు: అజయ్


రాజస్థాన్ కాంగ్రెస్‌లో మరోసారి అంతర్గత కలహాలు బయటపడ్డాయి. ఇప్పటికే సచిన్ పైలట్, సీఎం అశోక్ గహ్లోట్ వర్గాల మధ్య విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే  కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ, రాజస్థాన్ స్టేట్ ఇన్‌ఛార్జ్ అజయ్ మేకెన్ అధిష్ఠానానికి షాక్ ఇచ్చారు. పదవిలో కొనసాగేందుకు ఆసక్తిగా లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు ఓ లేఖ రాశారు. "రాజస్థాన్ స్టేట్ ఇంచార్జ్‌గా
కొనసాగడం నాకు ఇష్టం లేదు" అని తేల్చి చెప్పారు అజయ్ మేకెన్. ఈ ఏడాది సెప్టెంబర్ 25న గహ్లోట్, సచిన్ పైలట్ వర్గాల మధ్య తలెత్తిన విభేదాలు, రాజస్థాన్‌కు కొత్త సీఎం రావాలన్న డిమాండ్‌ వినిపించటం లాంటి పరిణామాల గురించి ఈ సందర్భంగా ప్రస్తావించారు. త్వరలోనే భారత్ జోడో యాత్ర రాజస్థాన్‌కు చేరుకోనుందని, ఈ లోగా రాష్ట్ర కాంగ్రెస్‌కు కొత్త ఇంచార్జ్‌ను నియమించటం ఉత్తమం అని సూచించారు. 
రెండు వర్గాల మధ్య తలెత్తిన విభేదాలను తగ్గించలేకపోయానని, రాష్ట్ర కాంగ్రెస్‌కు కొత్త ఇంచార్జ్‌ కావాల్సిన అవసరాన్ని ఇది గుర్తు చేస్తోందని అన్నారు. 










సైలెంట్‌గా ఉన్న ఖర్గే..


 రాజస్థాన్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందన్న మాటే కానీ..ఎప్పుడూ అంతర్గత విభేదాలు బయటకు కనిపిస్తూనే ఉంటాయి. ఇటీవలే రాజస్థాన్‌లో ఇది బయటపడింది. సచిన్ పైలట్, అశోక్ గహ్లోట్‌ వర్గాలు సీఎం కుర్చీపై రగడ మొదలుపెట్టాయి. అశోక్ గహ్లోట్‌ ఇందులో కాస్త అతిగా జోక్యం చేసుకుని...అధిష్ఠానం ఆగ్రహానికీ గురయ్యారు. ఇప్పుడు కాంగ్రెస్ సారథ్య బాధ్యతలు ఖర్గే చేపట్టాక...ముందుగా ఈ సమస్యనే పరిష్కరించేందుకు పావులు కదుపుతున్నట్టు నిన్న మొన్నటి వరకు గట్టిగానే వార్తలు వినిపించాయి. ఆయన పెద్ద ట్విస్టే ఇస్తారనీ అంచనా వేశారు. కానీ...అదేం లేదని మరో వార్త ఇప్పుడు రాజకీయ వర్గాల్లో గుప్పుమంటోంది. ప్రస్తుతానికి ఖర్గే రాజస్థాన్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవటం లేదని తెలుస్తోంది. గహ్లోట్‌ను సీఎం కుర్చీ నుంచి పక్కకు తప్పించడంపై మల్లికార్జున్ ఖర్గే ఏ మాత్రం ఆసక్తిగా లేరని సమాచారం. అంటే...పరోక్షంగా సచిన్ పైలట్ వర్గాన్ని "సైలెంట్‌"గా ఉండమని హెచ్చరించినట్టే. రాజస్థాన్ రాజకీయాల్లో అలజడి రేపిన గహ్లోట్‌పై చర్యలు తీసుకోవాలని అధిష్ఠానం భావించటం లేదట. నిజానికి...పైలట్, గహ్లోట్ ఫైట్ చాన్నాళ్లుగా కొనసాగుతోంది. అధిష్ఠానానికి ఇది తలనొప్పి తెచ్చి పెడుతోంది. అయినా...ఎందుకు పరిష్కరించకుండా వదిలేస్తున్నారనేదే అర్థం కావట్లేదు. ఖర్గే అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక...అశోక్ గహ్లోట్‌తో భేటీ అయ్యారు. చాలా సేపు మాట్లాడుకున్నారు. ఆ సమయంలోనే పైలట్ విషయం ప్రస్తావించి ఉంటారని తెలుస్తోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాంటి వ్యూహాలతో ముందుకెళ్లాలనేదీ చర్చించారట. 


Also Read: Sunny Leone Cheating Case: సన్నీ లియోన్‌కు రిలీఫ్- ఆ కేసులో ప్రొసీడింగ్స్‌పై కేరళ హైకోర్టు స్టే!