Gurugram News: ఈ మధ్య కుక్కలు.. మనుషులపై దాడి చేసిన ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. వీటిలో బాధితులకు ఎలాంటి న్యాయం జరగడం లేదు. కానీ తాజాగా పెంపుడు కుక్క క‌రిచిన కేసులో ఓ మ‌హిళా బాధితురాలికి రూ. 2 ల‌క్ష‌ల న‌ష్ట‌ప‌రిహారం చెల్లించాలంటూ కోర్టు ఆదేశాలు ఇచ్చింది.


ఇదీ జరిగింది


మున్ని అనే మహిళ.. ఓ ఇంటి ప‌నికి వెళ్తున్న స‌మ‌యంలో స్థానికంగా ఉండే వినీత్ చికారా అనే వ్య‌క్తికి చెందిన పెంపుడు కుక్క ఆమెను క‌రిచింది. గురుగ్రామ్‌లో ఆగస్టు నెలలో ఈ ఘటన జరిగింది. కుక్క దాడిలో ఆమె తీవ్రంగా గాయ‌ప‌డింది. గురుగ్రామ్‌లో ఉన్న సివిల్ లైన్ పోలీస్ స్టేష‌న్‌లో ఘటనపై ఎఫ్ఐఆర్ న‌మోదు అయింది. ఈ ఘటనపై గురుగ్రామ్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌కు జిల్లా వినియోగ‌దారుల ఫోర‌మ్ కోర్టు మంగళవారం కీలక ఆదేశాలు జారీ చేసింది.


బాధితురాలికి రూ.2 లక్షలు చెల్లించాలని కోర్టు ఆదేశించింది. కావాలంటే ఆ డ‌బ్బును కుక్క ఓన‌ర్ నుంచి రిక‌వ‌రీ చేయ‌వ‌చ్చు అని వినియోగ‌దారుల ఫోర‌మ్ త‌న ఆదేశాల్లో పేర్కొంది. ఎఫ్ఐఆర్‌లో కుక్క బ్రీడ్‌ను పిట్‌బుల్‌గా చేర్చారు. కానీ ఆ త‌ర్వాత ఓన‌ర్ ఆ బ్రీడ్‌ను డాగో అర్జెంటినోగా పేర్కొన్నారు.


అయితే ఆ శున‌కాన్ని క‌స్ట‌డీలోకి తీసుకోవాల‌ని, డాగ్ ఓన‌ర్ లైసెన్సును కూడా ర‌ద్దు చేయాల‌ని ఫోర‌మ్ ఆదేశించింది. డాగో అర్జెంటీనో జాతి కుక్క‌పై నిషేధం ఉంది. దానితో పాటు మొత్తం 11 ర‌కాల బ్రీడ్లు పెంపుడు కుక్క‌ల జాబితాలో లేవు.


కొత్త రూల్స్


పెంపుడు కుక్కల దాడి ఘటనలు ఎక్కువ అవుతుండటంతో ఉత్తర్‌ప్రదేశ్‌ నోయిడా అధికారులు ఇటీవల కీలక నిర్ణయం తీసుకున్నారు. కుక్కలు, పిల్లులు పెంచుకునే వారికి షాక్ ఇచ్చారు. పెంపుడు జంతువుల కారణంగా ఎలాంటి ప్రమాదం జరిగినా...యజమానులకు భారీగా జరిమానాలు విధించాలని అధికారులు నిర్ణయించారు. రూ.10 వేల జరిమానాతో పాటు బాధితుల వైద్యానికి అయ్యే ఖర్చునీ యజమానులే భరించాల్సి ఉంటుంది. ఈ విషయంలో వాళ్లు పూర్తి బాధ్యత తీసుకోవాలి.


ఉదాహరణకు...పెంపుడు కుక్క ఓ వ్యక్తిని కరిస్తే...ఆ వ్యక్తి వైద్యానికి ఎంత ఖర్చవుతుందో అదంతా యజమాని తన జేబులో నుంచి పెట్టుకోవాలి. వీటితో పాటు మరి కొన్ని నిర్ణయాలూ తీసుకున్నారు. పెంపుడు పిల్లులు, కుక్కలను కచ్చితంగా రిజిస్టర్ చేయించుకోవాలి. ఇలా రిజిస్టర్ చేయించుకోకపోతే...జరిమానా విధిస్తారు. వాటికి తప్పనిసరిగా వ్యాక్సిన్‌లు వేయించాలి. ఈ విషయంలో నిర్లక్ష్యం వహించినా జరిమానా తప్పదు. అంతే కాదు. పెంపుడు జంతువులు బయటకు వచ్చినప్పుడు బహిరంగ ప్రదేశాలను అపరిశుభ్రం చేస్తే...యజమానులే ఆ ప్రాంతాన్ని శుభ్రం చేయాల్సి ఉంటుంది. నోయిడా అథారిటీ సీఈవో ఈ మేరకు ట్విటర్ వేదికగా ఈ కండిషన్స్‌ అన్నీ వరుసగా ట్వీట్‌లు చేశారు. బోర్డ్ మీటింగ్‌లో తీసుకున్న నిర్ణయాలను వెల్లడించారు. Animal Welfare Board of India సూచనల మేరకు ఈ నిర్ణయాలు తీసుకున్నట్టు తెలిపారు.


Also Read: Sunny Leone Cheating Case: సన్నీ లియోన్‌కు రిలీఫ్- ఆ కేసులో ప్రొసీడింగ్స్‌పై కేరళ హైకోర్టు స్టే!