Draupadi Murmu: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కాళ్లు మొక్కబోయిన ఓ మహిళా ఇంజినీర్ ను అధికారులు సస్పెండ్ చేశారు. జనవరి 3, 4 తేదీల్లో రాష్ట్రపతి ముర్ము రాజస్థాన్ లో పర్యటించారు. అందులో భాగంగా రోహెత్ లోని స్కౌట్ గైడ్ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజారోగ్య విభాగంలో ఇంజినీర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న అంబా సియోల్ సభా ప్రాంగణంలో నీళ్లను అందించే బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయితే రాష్ట్రపతి సభా ప్రాంగణానికి చేరుకోగా.. అధికారులు అంతా ఆమెకు స్వాగతం పలికేందుకు వెళ్లారు. ఈ క్రమంలోనే ప్రొటోకాల్ ఉల్లంఘించి అడుగు ముందుకేసిన ఆ అధికారిణి రాష్ట్రపతి పాదాలను నమస్కరించబోయారు. అయితే పక్కనే ఉన్న రాష్ట్రపతి వ్యక్తిగత సిబ్బంది ఆమెను అడ్డుకున్నారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన కేంద్ర హోంశాఖ రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వ నివేదికను కోరింది. ఈ ఘటనపై కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ క్రమంలోనే రాజస్థాన్ సర్కారు.. మహిళా ఇంజినీర్ అంబా సియోల్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
రాజస్థాన్ పర్యటనలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. జనవరి 3వ తేదీన జైపూర్ చేరుకున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు రాజస్థాన్ గవర్నర్ కల్రాజ్ మిశ్రా, ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాత్ స్వాగతం పలికారు. రాజస్థాన్‌లో తొలిసారిగా పర్యటించిన రాష్ట్రపతికి గార్డు గౌరవం లభించింది. అదే రోజు రాష్ట్రపతి ముర్ము రాజ్ భవన్ జైపూర్‌లో సంవిధాన్ ఉద్యానాన్ని ప్రారంభించారు. అలాగే విద్యుత్ మంత్రిత్వ శాఖ ప్రాజెక్టులను కూడా ప్రారంభించి శంకుస్థాపన చేశారు.
అంతే కాకుండా రాజ్‌భవన్ ఆవరణలో రాజ్యాంగ ఉద్యాన వనంతో పాటు మహాత్మా గాంధీ, మహారాణా ప్రతాప్‌ల విగ్రహాలు, జాతీయ జెండా స్తంభమైన మయూర్ స్తంభాన్ని ఆవిష్కరించడం తనకు చాలా సంతోషాన్ని ఇచ్చిందని ముర్ము తెలిపారు.