Rajasthan political crisis: గహ్లోత్ తీరుపై అధిష్ఠానం సీరియస్- దిల్లీకి రావాలని కమల్‌నాథ్‌కు పిలుపు!

ABP Desam Updated at: 26 Sep 2022 04:03 PM (IST)
Edited By: Murali Krishna

Rajasthan political crisis: రాజస్థాన్‌లో తాజా రాజకీయ పరిణామాలపై కాంగ్రెస్ అధిష్ఠానం ఆగ్రహం వ్యక్తం చేసింది. మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్‌నాథ్‌ను వెంటనే దిల్లీకి రావాలని కబురు పంపింది.

గహ్లోత్ తీరుపై అధిష్ఠానం సీరియస్- దిల్లీకి రావాలని కమల్‌నాథ్‌కు పిలుపు!

NEXT PREV

Rajasthan political crisis: రాజస్థాన్‌లో కొత్త ముఖ్యమంత్రి అభ్యర్ధి విషయంలో కొత్త తలనొప్పులు తీసుకువస్తున్న ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ తీరుపై అధిష్ఠానం సీరియస్‌గా ఉన్నట్లు సమాచారం. రాజస్థాన్ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు వెళ్లిన మల్లికార్జున ఖర్గే, అజయ్ మాకెన్‌తో గహ్లోత్ చర్చలు విఫలమయ్యాయి. దీంతో వారు హైకమండ్‌కు విషయాన్ని చేరవేశారు.


కుదరదు!


మల్లికార్జున ఖర్గే, అజయ్ మాకెన్‌తో గహ్లోత్ సమావేశమై చర్చలు జరిపారు. ఈ చర్చల్లో తనకు మద్దతుగా రాజీనామా చేసిన ఎమ్మెల్యేలు.. తదుపరి ముఖ్యమంత్రిగా సచిన్ పైలట్‌ను ఓప్పుకోవడం లేదని గహ్లోత్ తేల్చిచెప్పారు. వారికి నచ్చజెప్పమని ఖర్గే చేసిన విజ్ఞప్తిని గహ్లోత్ ఒప్పుకోలేదని తెలుస్తోంది. దీంతో చర్చల తర్వాత మల్లికార్జున ఖర్గే మీడియాతో మాట్లాడుతూ పార్టీలో క్రమశిక్షణ ముఖ్యమన్నారు.



పార్టీలో ఐక్యత చాలా ముఖ్యం. నాయకులు క్రమశిక్షణగా మెలగాలి. ముఖ్యమంత్రి గహ్లోత్‌తో చర్చలు జరిపాం. రాజస్థాన్‌లో తాజా పరిస్థితిపై నివేదికను అధిష్టానానికి అందజేస్తాను.                                                              - మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ సీనియర్ నేత


ఎమ్మెల్యేలతో


మరోవైపు రాజీనామా చేసిన ఎమ్మెల్యేలతో మాట్లాడేందుకు అజయ్ మాకెన్‌ ప్రయత్నించారు. కానీ చాలా మంది ఎమ్మెల్యేలు ఈ సమావేశానికి హాజరు కాలేదు.



మరింత మంది ఎమ్మెల్యేలు వస్తారని మేము ఎదురు చూశాం. కానీ వారు రాలేదు. మల్లికార్జున ఖర్గే, నేను.. మా నివేదికను కాంగ్రెస్ అధినేత్రికి సమర్పించడానికి దిల్లీ వెళ్తున్నాం. రాజీనామా చేసిన ఎమ్మెల్యేలు ఎవరు?, ఎంతమంది? అనే విషయాలు మాకు తెలియదు. కూర్చొని సమస్యను పరిష్కరించుకోవాలని మేం ఆశిస్తున్నాం. -                                                  అజయ్ మాకెన్, కాంగ్రెస్ సీనియర్ నేత


పిలుపు


మరోవైపు ఈ సమస్యను పరిష్కరించేందుకు మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్‌నాథ్‌కు కాంగ్రెస్ అధిష్ఠానం కబురు పంపింది. వెంటనే దిల్లీ రావాలని కోరింది. రాజస్థాన్ సంక్షోభాన్ని పరిష్కరించే బాధ్యత కమల్‌నాథ్‌కు అప్పజెబుతున్నట్లు సమాచారం.


అక్టోబర్ 17న కాంగ్రెస్ పార్టీకి అధ్యక్ష ఎన్నికలు జరగాల్సి ఉండగా గహ్లోత్ తీరుతో అధిష్ఠానం చిక్కుల్లో పడింది.  గహ్లోత్‌ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికైతే రాజస్థాన్ సీఎంగా సచిన్ పైలట్ వద్దని, గహ్లోత్ వర్గీయుడే ఉండాలని ముఖ్యమంత్రికి మద్దతుగా రాజీనామా చేసిన ఎమ్మెల్యేలు కోరుతున్నారు. ఇప్పటికే 90 మంది వరకు ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసి స్పీకర్ సీపీ జోషికి అప్పగించారు. 


ఒక వ్యక్తికి ఒకే పదవి ఫార్ములా ఫాలో కావాలని గహ్లోత్‌కు అధిష్ఠానం సూచించింది. దీంతో కనీసం స్పీకర్ సీపీ జోషిని సీఎం చేయాలని గహ్లోత్ అడిగారట. తన రాజకీయ ప్రత్యర్ధి సచిన్ పైలట్‌ను మాత్రం సీఎం చేయడానికి వీల్లేదని గహ్లోత్ చెప్పినట్లు సమాచారం. కానీ అధిష్ఠానం సచిన్ పైలట్‌ను సీఎంగా చేయాలని యోచిస్తుందని తెలుసుకున్న గహ్లోత్ తన వర్గం ఎమ్మెల్యేలను తన వైపే ఉండేలా చూసుకున్నారు.


Also Read: Russia School Shooting: పాఠశాలలో విచక్షణారహితంగా కాల్పులు- 13 మంది మృతి!


Also Read: US-Pak Relationship: 'పాక్‌తో దోస్తీ ఏ మాత్రం మంచిది కాదు'- అమెరికాకు భారత్ వార్నింగ్!

Published at: 26 Sep 2022 03:46 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.