Wrestlers Protest: 



ట్వీట్ చేసిన రాహుల్ 


రెజ్లర్ల ఆందోళనలపై రాహుల్ గాంధీ స్పందించారు. అర్ధరాత్రి పోలీసులు వాళ్లపై దాడి చేయడాన్ని ఖండించారు. మహిళా రెజ్లర్ల పట్ల వ్యవహరించిన తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలపై ఇలాంటి దాడులు జరుగుతున్నా బీజేపీ నోరు మెదపడం లేదని మండి పడ్డారు. ఇది నిజంగా సిగ్గుచేటు అంటూ ట్వీట్ చేశారు. బేటీ బచావో అనేది కేవలం ఓ బూటకం అని విమర్శించారు. అర్ధరాత్రి జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు ఉన్నట్టుండి వచ్చి బారికేడ్‌లు పెట్టారు. అక్కడికి ఎవరినీ అనుమతించకుండా ఆంక్షలు విధించారు. దీంతో రెజ్లర్లు, పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. ఇది కాస్తా ఘర్షణకు దారి తీసింది. ఈ ఘటనలో పలువురు రెజ్లర్లు గాయపడ్డారు. దీనిపై ఇప్పటికే వినేష్ ఫోగట్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. దేశానికి పతకాలు సాధించి పెట్టిన తమకు ఈ గతి పట్టిందంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. వీరికి ఆప్ సహా కాంగ్రెస్ మద్దతుగా నిలుస్తోంది. ఈ క్రమంలోనే రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. 


"మహిళా రెజ్లర్లతో వ్యవహరించిన తీరు సిగ్గుచేటు. బేటీ బచావో అనేది కేవలం ఓ బూటకం అని అర్థమైపోయింది. దేశంలోని మహిళలపై దాడులు జరుగుతున్నా బీజేపీ స్పందించడం లేదు"


- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ సీనియర్ నేత