బీఆర్ఎస్ పార్టీ ఢిల్లీలో నిర్మించుకున్న కొత్త కార్యాలయాన్ని ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ కాసేపట్లో ప్రారంభించనున్నారు. కేసీఆర్ చేతుల మీదుగా మధ్యాహ్నం 1.05 నిమిషాలకు ఢిల్లీలో ఈ కార్యక్రమం జరగనుంది. 20 వేల చదరపుగజాల్లో 1,300 గజాల్లో నిర్మించిన ఐదు అంతస్తుల భవంతి ఇది. ఇందులో పార్టీ అధ్యక్షుడి గదితో పాటు మరో నలుగురు కార్యదర్శులకు ప్రత్యేక గదులు నిర్మించారు. 40 మంది కూర్చునేందుకు వీలుగా కాన్ఫరెన్స్ హాల్ కూడా ఏర్పాటు చేశారు.
ప్రారంభానికి ముందు శాస్త్రోక్తంగా కొత్త కార్యాలయంలో యాగం, ఇతర పూజా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ ఏర్పాట్లు అన్నీ పర్యవేక్షించేందుకు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎంపీ సంతోష్ కుమార్ ముందుగానే ఢిల్లీకి వెళ్లారు. నిన్న (మే 3) సాయంత్రమే కేసీఆర్ ఢిల్లీకి ప్రత్యేక విమానంలో పయనం అవుతారని భావించారు. కానీ, నేడు ఉదయం సీఎం ఢిల్లీకి వెళ్లారు. గురువారం కూడా ఆయన ఢిల్లీలోనే ఉండి, శుక్రవారం సాయంత్రం తిరిగి హైదరాబాద్ కు వస్తారని తెలుస్తోంది. ఢిల్లీ పర్యటనలో భాగంగా అక్కడి సీఎం కేజ్రీవాల్ ను కూడా కేసీఆర్ కలుస్తారని సమాచారం.
ఢిల్లీలోని వసంత్ విహార్ లో 2021 సెప్టెంబర్‌లో బీఆర్ఎస్ భవనానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ స్థలాన్ని కేంద్ర ప్రభుత్వమే కేటాయించింది. తాజాగా నిర్మాణం పూర్తి చేసి ప్రారంభం చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ జాతీయ కార్యకలాపాల కోసం తొలుత ఢిల్లీలోని సర్దార్ పటేల్ మార్గ్‌లో తాత్కాలిక కార్యాలయాన్ని డిసెంబర్ 14న కేసీఆర్ ప్రారంభించారు. ఇది కేవలం ఒక గుర్తింపు కోసం మాత్రమే ఏర్పాటు చేసినట్లు పార్టీ వర్గాలు అప్పట్లో ప్రకటించాయి. తాజాగా శాశ్వత భవనం పూర్తి కావడంతో నేడు అట్టహాసంగా పార్టీ కార్యాలయం ప్రారంభించాలని నిర్ణయించారు. ఇకపై బీఆర్ఎస్ జాతీయ స్థాయి కార్యకలాపాలన్నీ కేంద్ర కార్యాలయం నుంచే నడుస్తాయని బీఆర్‌ఎస్ వర్గాలు వెల్లడించాయి.
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు సహా 200 మంది బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారు హాజరు అవుతారని మంత్రి ప్రశాంత్ రెడ్డి తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ, బీఆర్‌ఎస్‌గా మారిన తర్వాత పార్టీ కార్యకలాపాలకు జాతీయ స్థాయిలో కార్యాలయం ఉండాలనే ఉద్దేశంతో ఢిల్లీలో శాశ్వత ఆఫీసును నిర్మించారు. జాతీయ స్థాయి పార్టీ కార్యకలాపాలన్నీ కేంద్ర కార్యాలయం నుంచి నడిచేలా ప్రణాళిక చేస్తున్నారు.