Rahul Gandhi On BJP Govt: భారత్ జోడో యాత్రలో కొవిడ్ ప్రోటోకాల్‌ను అనుసరించాలని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్‌సుఖ్ మాండవీయ.. రాసిన లేఖపై రాహుల్ గాంధీ స్పందించారు. జోడో యాత్రను ఆపడానికి మోదీ సర్కార్ సాకులు వెతుకుతుందని రాహుల్ కౌంటర్ ఇచ్చారు.
కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీకి.. కేంద్ర ఆరోగ్య మంత్రి మన్‌సుక్ మాండవీయ లేఖ రాశారు. భారత్ జోడో యాత్రలో కొవిడ్ -19 మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని ఈ లేఖలో కోరారు. లేకుంటే.. జోడో యాత్రను వాయిదా వేసుకోవాలని తెలిపారు. ఈ మేరకు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్‌లకు లేఖ రాశారు.
" భారత్ జోడో యాత్రతో కరోనా వైరస్ వ్యాప్తి చెందే ముప్పు ఉంది. కనుక యాత్ర సమయంలో కొవిడ్ మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలి. మాస్క్‌లు, శానిటైజర్‌ల వినియోగాన్ని అమలు చేయాలి. వ్యాక్సిన్ తీసుకున్న వ్యక్తులు మాత్రమే యాత్రలో పాల్గొనేలా చూడాలి. కొవిడ్-19 ప్రోటోకాల్‌ను అనుసరించడం సాధ్యం కాకపోతే.. ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని జాతీయ ప్రయోజనాల దృష్ట్యా భారత్ జోడో యాత్రను వాయిదా వేయాలి. "
-మన్‌సుక్ మాండవీయ, కేంద్ర ఆరోగ్యమంత్రి
కాంగ్రెస్ ఫైర్
కేంద్ర ఆరోగ్య మంత్రి లేఖపై కాంగ్రెస్ ఫైర్ అయింది. ఇటీవల గుజరాత్ ఎన్నికల సమయంలో ప్రధాని మోదీ భారీ రోడ్ షోను ప్రస్తావిస్తూ ఆ సమయంలో నిబంధనలు గుర్తుకు రాలేదా అంటూ కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌదరి కౌంటర్ ఇచ్చారు.
" జోడో యాత్రతో రాహుల్ గాంధీకి సోషల్‌మీడియాలో భారీ ఆదరణ లభిస్తోంది. దీన్ని చూసి భాజపా భయపడుతోంది. మా పార్టీకి ప్రజల నుంచి వస్తోన్న స్పందన ను తట్టుకోలేకనే వారు ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నారు. గుజరాత్‌లో ఓట్లు అభ్యర్థించడానికి వెళ్లినప్పుడు ప్రధాని మోదీ మాస్క్ పెట్టుకున్నారా? "
-అధిర్ రంజన్ చౌదరీ, కాంగ్రెస్ నేత
Also Read: Shraddha Murder Case: మనసు మార్చుకున్న అఫ్తాబ్- బెయిల్ పిటిషన్ ఉపసంహరణ