Rahul Gandhi Detained: కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీని దిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోనియా గాంధీని ఈడీ విచారించడాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ ఎంపీలు నిరసన ర్యాలీ చేశారు. పార్లమెంటు నుంచి విజయ్ చౌక్ వరకు చేపట్టిన ఈ నిరసనను పోలీసులు అడ్డుకున్నారు. ఇందులో పాల్గొన్న రాహుల్ గాంధీని అరెస్ట్ చేశారు. 






ఉద్రిక్తత


రాహుల్​ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్​ నేతలు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతలకు దారి తీసింది. దీంతో రాహుల్​ సహా 17 మంది ఎంపీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇందులో ఖర్గే, చిదంబరం వంటి సీనియర్ నేతలు ఉన్నారు.


మరోసారి


నేషనల్ హెరాల్డ్ ​కేసులో కాంగ్రెస్​ అధినేత్రి సోనియా గాంధీ మంగళవారం మరోసారి ఈడీ విచారణకు హాజరయ్యారు. ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలపై సోనియాను ఈడీ ప్రశ్నించనుంది.


ఇప్పటికే ఓసారి ఈడీ సోనియాను విచారించింది. ఈ నెల 21న జరిగిన విచారణలో సోనియాను ఈడీ సుమారు 25 ప్రశ్నలు అడిగింది. అయితే సోనియా చేసిన విజ్ఞప్తి కారణంగా విచారణను రెండు గంటల్లో ముగించింది. 


ఇదే కేసు


కాంగ్రెస్ పార్టీ, గాంధీలతో ముడిపడిన నేషనల్ హెరాల్డ్ కేసు ఏళ్ల తరబడి కొనసాగుతోంది. అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజేఎల్)ను యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ (వైఐ) తమ అధీనంలోకి తెచ్చుకోవడం వెనుక మోసం, కుట్ర వంటి ఆరోపణలు ఉన్నాయి. 2010లో ఏజేఎల్ ఆర్థిక సవాళ్లను ఎదుర్కోవాల్సి రావడంతో కొత్తగా ఏర్పాటు చేసిన యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ (వైఐఎల్) కంపెనీ దానిని టేకోవర్ చేసింది. దానికి డైరెక్టర్లుగా ఉన్న సుమన్ దుబే, టెక్నోక్రాట్ శామ్ పిట్రోడాలకు గాంధీ విధేయులుగా పేరుంది.


ఈ కేసుపై సుబ్రహ్మణ్య స్వామి దిల్లీ హైకోర్టులో గతంలో ఫిర్యాదు చేశారు. నేషనల్‌ హెరాల్డ్‌ పత్రిక కాంగ్రెస్‌ పార్టీకి బకాయి ఉన్న రూ.90.25 కోట్లను వసూలు చేసుకొనే హక్కును పొందేందుకు యంగ్‌ ఇండియన్‌ ప్రైవేటు లిమిటెడ్ ద్వారా నేరపూరితమైన కుట్ర పన్నారని సుబ్రహ్మణ్య స్వామి ఆరోపించారు. ఇందులో సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీ సహా ఏడుగురిని పేర్లను చేర్చారు. వీరిలో ఆస్కార్ ఫెర్నాండెజ్, సుమన్ దుబే, శ్యామ్ పిట్రోడా‌ తదితరులు ఉన్నారు.


Also Read: Gujarat Hooch Tragedy: కల్తీ మద్యం తాగి 21 మంది మృతి- 40 మంది పరిస్థితి విషమం!


Also Read: Corona Cases: దేశంలో కొత్తగా 14 వేల కరోనా కేసులు- 36 మంది మృతి