Rahul Gandhi Chakravyuh Speech: కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై ఈడీని ఉసిగొల్పేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోందని తేల్చి చెప్పారు. జులై 29వ తేదీన బడ్జెట్ గురించి ప్రసంగించారు రాహుల్ గాంధీ. ఆ సమయంలో మహాభారతంలోని చక్రవ్యూహం, ఈ బడ్జెట్ రెండూ ఒకేలా ఉన్నాయని సెటైర్లు వేశారు. అయితే...ఈ స్పీచ్ నచ్చకే ఈడీ సోదాలు చేసేందుకు సిద్ధమవుతోందని స్పష్టం చేశారు రాహుల్ గాంధీ. విశ్వసనీయ వర్గాలు ఈ విషయం చెప్పినట్టు తెలిపారు. ఇదే నిజమైతే ఈడీ అధికారుల కోసం ఎదురు చూస్తుంటానని అన్నారు. (Also Read: Wayanad: వయనాడ్ విధ్వంసంలో పెరుగుతున్న మృతుల సంఖ్య, శిథిలాలు తొలగించే కొద్దీ బయట పడుతున్న శవాలు)
"జులై 29వ తేదీన నేను ఇచ్చిన ప్రసంగం వాళ్లకి (బీజేపీని ఉద్దేశిస్తూ) నచ్చలేదు. అందుకే ఈడీ సోదాలు చేయించేందుకు సిద్ధమవుతున్నారు. విశ్వసనీయ వర్గాలు నాకు ఈ విషయం చెప్పాయి. ఈడీ అధికారుల కోసం నేను ఎదురు చూస్తున్నాను. చాయ్ బిస్కెట్‌లతో ఆహ్వానిస్తాను"
- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఎంపీ
జులై 29న రాహుల్ గాంధీ బడ్జెట్‌పై ప్రసంగించారు. మోదీ సర్కార్‌పై తీవ్రంగా మండి పడ్డారు. రైతులు, ఉద్యోగులు, యువతకు ఎలాంటి లాభం లేని బడ్జెట్ ఇది ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమయంలోనే బీజేపీ ఎన్నికల గుర్తైన కమలం పువ్వుని, మహాభారతంలోని చక్రవ్యూహాన్ని ప్రస్తావిస్తూ సెటైర్లు వేశారు. సుదీర్ఘంగా ప్రసంగించారు.
"వేలాది ఏళ్ల క్రితం కురుక్షేత్రం జరిగింది. ఆ సమయంలో అభిమన్యుడిని ఆరుగురు కలిసి చక్రవ్యూహంలో పడేసి చంపారు. దీన్నే పద్మవ్యూహం అని కూడా అంటారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రతి సూట్‌పైనా ఈ కమలం పువ్వు గుర్తునే పెట్టుకుంటారు. అప్పుడు అభిమన్యుడిని ఎలా అయితే ట్రాప్ చేసి చంపేశారో ఇప్పుడు మోదీ కూడా రైతులను, మహిళల్ని, పేదల్ని ట్రాప్ చేసి ఇబ్బంది పెడుతున్నారు. అప్పుడు అభిమన్యుడిని ఆరుగురు చంపారు. ఇప్పుడు దేశాన్ని పీడిస్తున్న వాళ్లు కూడా ఆరుగురే. నరేంద్ర మోదీ, అమిత్ షా, మోహన్ భగవత్, అజిత్ దోవల్, అంబానీ, అదానీ. వీళ్లే అంతా ధ్వంసం చేసేస్తున్నారు"
- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఎంపీ
ప్రతిపక్ష నేత హోదా వచ్చిన తరవాత మోదీ సర్కార్‌పై మరింత దూకుడు పెంచారు రాహుల్ గాంధీ. నీట్ పేపర్ లీక్ వ్యవహారాన్ని పదేపదే ప్రస్తావించారు. కేంద్ర ప్రభుత్వం సభలో చర్చ జరగకుండా తప్పించుకుంటోందని మండి పడ్డారు. వ్యవస్థాగతంగా ఉన్న లోపాలను కప్పి పుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తరవాత బడ్డెట్ గురించి కూడా ఇదే స్థాయిలో ప్రసంగించారు. పదవిని కాపాడుకునేందుకు ప్రవేశపెట్టిన బడ్జెట్ అని ఎద్దేవా చేశారు. ఈ ప్రసంగాలతో పలు సందర్భాల్లో సభలో గందరగోళం నెలకొంది.
Also Read: Viral News: ఇంటి ముందు ఆడుకుంటుండగా మీద పడిన గేట్, మూడేళ్ల చిన్నారి అక్కడికక్కడే మృతి - వీడియో