Wayanad Landslides Death Toll: వయనాడ్ విధ్వంసంలో మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ప్రభావిత ప్రాంతాల్లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. శిథిలాలు తొలగిస్తున్న కొద్ది మృతదేహాలు బయట పడుతున్నాయి. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం మృతుల సంఖ్య 300 దాటింది. వర్షాలు కురుస్తున్నా, ప్రతికూల వాతావరణం ఉన్నా ఎక్కడా వెనక్కి తగ్గకుండా 40 రెస్క్యూ టీమ్స్ రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపడుతున్నాయి. చూరల్‌మలలో ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. ఆ ప్రాంతానికి రాకపోకలు తెగిపోయాయి. ఫలితంగా తాత్కాలికంగా ఓ వంతెన నిర్మించారు. ఆంబులెన్స్‌లు వెళ్లేందుకు, రెస్క్యూ ఆపరేషన్ చేసేందుకు ఈ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి చేశారు. ఉదయం 7 గంటల నుంచే డాగ్ స్క్వాడ్ కూడా రంగంలోకి దిగింది. మొత్తం ఆరు జోన్‌లలో సహాయక చర్యలు చేపడుతున్నారు. (Also Read: NEET Row: నీట్ యూజీ పేపర్ లీక్ కేసులో కేంద్రానికి రిలీఫ్, ఉల్లంఘనలు జరగలేదని సుప్రీంకోర్టు తీర్పు)
ఇండియన్ ఆర్మీతో పాటు NDRF, కోస్ట్ గార్డ్, నేవీ టీమ్స్ కూడా రెస్క్యూలో పాల్గొంటున్నాయి. ఇందుకోసం స్థానికుల సాయం తీసుకుంటున్నారు. చలియార్ పోలీస్ స్టేషన్ పరిధిలో సహాయక చర్యలు ముమ్మరం చేస్తున్నారు. దాదాపు 40 కిలోమీటర్ల మేర రెస్క్యూ కొనసాగించనున్నారు. గజ ఈతగాళ్లను ఇప్పటికే సిద్ధం చేశారు. నీళ్లలో కొట్టుకుపోయిన వాళ్ల మృతదేహాలను వెలికి తీయనున్నారు. దీంతోపాటు పోలీస్ హెలికాప్టర్‌తోనూ రెస్క్యూ చేపట్టనున్నారు. 300 మంది గల్లంతైనట్టు అధికారులు తెలిపారు. వాళ్ల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
గల్లంతైన వాళ్లతో పాటు బాధితులను గుర్తించేందుకు రేడార్ డ్రోన్‌లను వినియోగిస్తున్నారు. వీటి సాయంతో సహాయక చర్యలు ముమ్మరం చేస్తున్నారు. చాలా చోట్ల రోడ్లు, వంతెనలు కూలిపోవడం వల్ల రెస్క్యూ ఆపరేషన్‌కి అవాంతరాలు ఎదురవుతున్నాయి. తాత్కాలిక ఏర్పాట్లు చేసుకుని ఎలాగోలా బాధితులను కాపాడుతున్నాయి రెస్క్యూ టీమ్స్. బైలే బ్రిడ్జ్ వద్ద దాదాపు 25 ఆంబులెన్స్‌లను సిద్ధం చేశారు. బాధితులను వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మందక్కైలో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదవడం వల్ల కొండ చరియలు విరిగి పడ్డాయి. ఇక్కడ ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. అందుకే ఈ ప్రాంతంపై ఎక్కువగా ఫోకస్ పెట్టారు. ఇక చలియార్ నది ఉప్పొంగి ప్రవహిస్తుండడం వల్ల పరిసర ప్రాంతాలనూ అప్రమత్తం చేశారు. తమిళనాడు నుంచి ప్రత్యేకంగా నాలుగు కుక్కలను తీసుకొచ్చారు. వాటి ద్వారా రెస్క్యూ కొనసాగిస్తున్నారు.