NEET UG 2024 Paper Leak: నీట్ యూజీ పేపర్ లీక్‌పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వ్యవస్థలో ఎలాంటి లోపాలు లేవని, కేవలం పట్నా, హజారిబాగ్‌కి మాత్రమే ఈ లీక్ పరిమితమైందని తేల్చి చెప్పింది. ఎక్కడా ఉల్లంఘనలు జరగలేదని స్పష్టం చేసింది. ఈ కేసు విచారణ కోసం ఏర్పాటు చేసిన కమిటీకి కొన్ని సూచనలు చేసింది కోర్టు. పరీక్షా వ్యవస్థలో ఉన్న లోపాల్ని గుర్తించాలని, వాటిని సవరించాలని తేల్చిచెప్పింది. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ లోపాలపై దృష్టి సారించాలని ఆదేశించింది. మళ్లీ మళ్లీ ఇలాంటి తప్పులు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉందని మందలించింది. ఇదే సమయంలో మరి కొన్ని సూచనలు చేసింది. ఎగ్జామినేషన్ సిస్టమ్‌లో సైబర్ సెక్యూరిటీకి సంబందించిన పటిష్ఠతపైనా దృష్టి పెట్టాలని వెల్లడించింది. ఈ లోపాలను గుర్తించేందుకు ప్రత్యేకంగా SOPని సిద్ధం చేయాలని స్పష్టం చేసింది. ఎగ్జామ్ సెంటర్లలో సీసీటీవీ మానిటరింగ్‌నీ పెంచాలని సూచించింది.
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)లోని లోపాలను సవరించాలని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ముగ్గురు సభ్యులతో కూడిన ధర్మాసనం ఈ తీర్పు వెలువరించింది. నీట్ యూజీ టెస్ట్‌ని మళ్లీ నిర్వహించాలని సుప్రీంకోర్టులో పలు పిటిషన్‌లు దాఖలయ్యాయి. వీటన్నింటిపైనా కోర్టు విచారణ చేపట్టింది. ఆగష్టు 1వ తేదీన సీబీఐ ఈ పేపర్ లీక్ కేసులో తొలి ఛార్జ్‌షీట్‌ని దాఖలు చేసింది. ఇందులో మొత్తం 13 మందిని నిందితులుగా చేర్చింది. పేపర్ లీక్‌తో పాటు మరి కొన్ని కేసుల్లోనూ వాళ్ల హస్తం ఉందని అందులో పేర్కొంది. ఇప్పటి వరకూ సీబీఐ ఆరు FIRలు నమోదు చేసింది.