Rahul Gandhi:


కాంగ్రెస్ ఎంపీల భేటీ..


అనర్హతా వేటుతో ఎంపీ పదవికి దూరమయ్యారు రాహుల్ గాంధీ. ఆ నిర్ణయం తరవాత తొలిసారి పార్లమెంట్‌కు వచ్చారు. సీపీపీ కార్యాలయంలో కాంగ్రెస్ ఎంపీల ప్రత్యేక సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఇదే సమయంలో ఉద్ధవ్ థాక్రే వర్గానికి చెందిన శివసేన పార్టీ సీనియర్ నేత సంజయ్ రౌత్‌ను కూడా కలిశారు. ఇప్పటికే ఓ సారి జరిగిన మీటింగ్‌కు ఉద్ధవ్ థాక్రే వర్గం గైర్హాజరైంది. సావర్కర్‌పై రాహుల్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా...ఈ మీటింగ్‌కు హాజరు కాలేదు. ఈ క్రమంలోనే...సంజయ్‌ రౌత్, రాహుల్ కలవడం ఆసక్తికరంగా మారింది. రాహుల్‌తో భేటీ తరవాత సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోనే కాకుండా...జాతీయ స్థాయిలోనూ ప్రతిపక్షాల ఐక్యతకు మద్దతునిస్తామని వెల్లడించారు. పార్లమెంట్‌ ఆవరణలో కాంగ్రెస్ చేపడుతున్న నిరసనల్లోనూ పాల్గొంటామని స్పష్టం చేశారు. 






"రెండ్రోజుల క్రితం మా ఉద్దేశాలు, మా అభ్యంతరాలేంటో స్పష్టంగా చెప్పాం. ఖర్గే ఆహ్వానించినా ఆయన ఇంటికి వెళ్లలేదు. కానీ...మహారాష్ట్రతో పాటు జాతీయస్థాయిలో విపక్షాల ఐక్యతకు మాత్రం మద్దతునిస్తాం. మా అభ్యంతరాలపై విపక్షాలు వివరణ ఇచ్చాయి. ఇకపై నిర్వహించే ప్రతి సమావేశానికి హాజరవుతాం. విపక్షాల ఆందోళనల్లోనూ పాల్గొంటాం. ప్రస్తుతానికి ఇదే మా ప్రాధాన్యత. జాతీయ స్థాయిలోనూ అన్ని పార్టీలతో కలిసి ముందుకెళ్తాం"


- సంజయ్ రౌత్










ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు సంజయ్ రౌత్. అదానీ అంశంపై మోదీ ప్రభుత్వం ఎందుకు మాట్లాడటం లేదంటూ ప్రశ్నించారు. ఇలా ప్రశ్నించినందుకే...దర్యాప్తు సంస్థలతో దాడులు చేయిస్తున్నారంటూ మండి పడ్డారు. 


"రాహుల్ గాంధీ ప్రస్తావిస్తున్న అంశాలపై కేంద్రం ఎందుకు మాట్లాడడం లేదు. జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఎందుకు వేయడం లేదు? అదానీ అంశంపై ప్రస్తావన లేదెందుకు? మోదీజీ..మీకు అదానీకి సంబంధం ఏంటి..? ఈడీ సీబీఐ ఉన్నది కేవలం మా కోసమేనా? అదానీపై అవి దాడులు చేయవా? పీఎం కేర్ నిధులపైనా ఆడిట్ చేయగలరా?" 


- సంజయ్ రౌత్ 


Also Read: Operation Amritpal Singh: మీడియా ఎదుట లొంగిపోనున్న అమృత్ పాల్? నిఘా వర్గాల సమాచారంతో పోలీసుల హై అలెర్ట్!