Anurag Thakur:


కుట్ర జరుగుతోందా..? 


కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ మరోసారి కాంగ్రెస్‌పై విమర్శలు చేశారు. రాహుల్ గాంధీపై అనర్హతా వేటు వేస్తే...ఆయన తరపున వాదించేందుకు ఆ పార్టీలోని ఏ ఒక్క న్యాయవాది కూడా ఎందుకు ముందుకు రాలేదని ప్రశ్నించారు. అంతే కాదు. రాహుల్‌పై సొంత పార్టీ నేతలే కుట్ర చేస్తున్నారంటూ ఆరోపణలు చేశారు. రాహుల్ ఇలాంటి కేసుల్లో ఇరుక్కోవడం కొత్తేమీ కాదని, ఆయనపై 7 పరువు నష్టం దావా కేసులున్నాయని అన్నారు. వాటిపై పలు కోర్టుల్లో విచారణ జరుగుతోందని వెల్లడించారు. పార్లమెంట్‌ నుంచి ఆయనను తప్పించడంలో కేంద్రానికి, లోక్‌సభ సెక్రటేరియట్‌కు కానీ ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ప్రజాప్రాతనిధ్య చట్ట ప్రకారమే ఆయనపై అనర్హతా వేటు వేశారని అన్నారు. 


"కాంగ్రెస్‌లో ఎంతో మంది గొప్ప న్యాయవాదులున్నారు. వాళ్లకు అధిష్ఠానం రాజ్యసభ ఎంపీలుగా అవకాశమిచ్చింది. ఇప్పుడు రాహుల్‌పై అనర్హతా వేటు పడితే..వారిలో ఏ ఒక్కరు కూడా ముందుకొచ్చి ఆయనను కాపాడే ప్రయత్నం చేయడం లేదు. ఇది రాహుల్‌పై జరుగుతున్న కుట్ర అనుకోవాలా..? పవన్ ఖేరాకు ఇలాంటి పరిస్థితే ఎదురైతే ఆ లాయర్‌లు అందరూ ముందుకొచ్చి ఆయనను కాపాడారు. మరి రాహుల్ గాంధీ విషయంలో వాళ్లెందుకు మౌనంగా ఉన్నారు..? రాహుల్‌పై కుట్ర చేస్తున్న వారెవరో..? ఇదో అంతుచిక్కని ప్రశ్న"


- అనురాగ్ ఠాకూర్, కేంద్ర మంత్రి 


సుప్రీంకోర్టుకి క్షమాపణ లేఖ రాసిన తరవాత కూడా రాహుల్‌ వైఖరిలో ఎలాంటి మార్పూ రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు అనురాగ్ ఠాకూర్. RSS లాంటి సంస్థలపై మళ్లీ అదే విధంగా మాట్లాడుతున్నారని అన్నారు. ప్రెస్‌మీట్‌లో ఓ జర్నలిస్ట్‌తో పరుషంగా మాట్లాడడంపైనా మండి పడ్డారు. తమ దగ్గర దాపరికాలు ఏమీ లేవని...దర్యాప్తు సంస్థలు చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాయని స్పష్టం చేశారు. వాటి పనితీరుపైపై అనుమానాలు అక్కర్లేదని తేల్చి చెప్పారు. రాహుల్ గాంధీ చేసిన సావర్కర్ వ్యాఖ్యలపైనా అనురాగ్ ఠాకూర్ ఫైర్ అయ్యారు. రాహుల్ కల్లో కూడా సావర్కర్ అవ్వలేరని సెటైర్ వేశారు. దేశంపై ప్రేమ, గౌరవం ఉన్న వాళ్లే ఆ స్థాయికి చేరుకుంటారని విమర్శించారు. బ్రిటీష్ వాళ్లకు సావర్కర్ సారీ చెప్పారంటూ గతంలో రాహుల్ చేసిన వ్యాఖ్యలపైనా బీజేపీ తీవ్రంగా మండి పడింది. ఇప్పుడు మరోసారి రాహుల్ సావర్కర్ ప్రస్తావన తీసుకురావడంపై విమర్శలు చేస్తోంది. భరత మాత సంకెళ్లు తెంచేందుకు రాహుల్ బ్రిటన్‌కు వెళ్లారంటూ ఎద్దేవా చేశారు అనురాగ్ ఠాకూర్. వీర్ సావర్కర్‌పై తరచూ ఇలాంటి అభ్యంతరక వ్యాఖ్యలు చేయడంపై అసహనం వ్యక్తం చేశారు. ఇందిరా గాంధీ సావర్కర్‌ను ప్రశంసిస్తూ రాసిన లేఖనూ ట్విటర్‌లో పోస్ట్ చేశారు. భారత స్వాతంత్య్ర ఉద్యమంలో సావర్కర్ పాత్ర ఎప్పటికీ మరిచిపోలేమని ఇందిరా గాంధీ చెప్పారంటూ ఆ లెటర్‌ను షేర్ చేశారు. 1980లో రాసిన ఈలేఖను కోట్ చేస్తూ రాహుల్‌పై మండి పడ్డారు ఠాకూర్. అంతే కాదు. ఇందిరా  గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో సావర్కర్‌ను త్యాగానికి గుర్తుగా ఓ డాక్యుమెంటరీని కూడా రిలీజ్ చేశారని గుర్తు చేశారు. 


"రాహుల్ గాంధీజీ..మీరు కల్లో కూడా సావర్కర్ అవ్వలేరు. ఆయనలా అవ్వాలంటే ఎంతో అంకిత భావం ఉండాలి. దేశంపై ప్రేమ, నిబద్ధత ఉండాలి. ఎన్నేళ్లు ఎదురు చూసినా మీరు ఆ స్థాయికి ఎదగలేరు. ఆయన మీలా ఎప్పుడూ విదేశాలకు వెళ్లిపోలేదు. నా దేశంలో ధర్మాన్ని కాపాడండి అంటూ విదేశీయులను అడగలేదు. "


- అనురాగ్ ఠాకూర్, కేంద్ర మంత్రి 


Also Read: Karnataka Election 2023 Dates:కర్ణాటక ఎన్నికలకు ముహూర్తం ఖరారు, తొలిసారి ఓట్ ఫ్రమ్ హోమ్‌కు అవకాశం