TSRTC Latest News: టీఎస్ఆర్ టీసీ ప్రయాణికులను ఆకర్షించేందుకు వినూత్నంగా ముందుకు దూసుకుపోవడంతోపాటు మరో అడుగు ముందుకేసి ఇప్పుడు రాములోరి భక్తులను ఆకట్టుకునేందుకు చేసిన ప్రయత్నం సత్పలితాలిస్తోంది. శ్రీరామనవమి (Sriramanavami) నేపథ్యంలో మీ ఇంటికే భద్రాద్రి తలంబ్రాలు అంటూ తెలంగాణా రోడ్డు రవాణా సంస్ద చేపట్టిన కళ్యాణ తలంబ్రాలకు అపూర్వ స్పందన లభిస్తోంది. శ్రీరామ నవమి అంటే తెలుగు రాష్ట్రాల్లో వెంటనే గుర్తొచ్చేది భద్రాద్రి. రాష్ట్ర విభజన తరువాత కూడా భద్రాద్రి సీతారాములు కళ్యాణ మహోత్సవాలకు ఆదరణ ఏమాత్రం తగ్గలేదు. నేరుగా కళ్యాణ మహోత్సవంతో పాల్గొనలేని వాళ్లు కనీసం స్వామివారి తలబ్రాలు అందుకున్నా చాలనే ఆశతో ఉంటారు. అటువంటి భక్తుల సంకల్పాన్ని నెరవేర్చేందుకు కళ్యాణ తలంబ్రాలంటూ వినూత్న ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది టీఎస్ఆర్టీసీ.


అయితే ఊహించిన దానికంటే ఎక్కువగా భక్తులను నుండి స్పందన లభిస్తోంది. కేవలం పది రోజుల్లోనే 50 వేల మంది భక్తులు ఈ కళ్యాణ తలంబ్రాల కోసం బుకింగ్‌ చేసుకున్నారు. రోజుకు సగటున 5 వేల వరకు బుకింగ్‌లు అవుతున్నాయి. శ్రీరామ నవమి సందర్భంగా భద్రాద్రి శ్రీ సీతారాముల కల్యాణ తలంబ్రాలను భక్తులకు అందజేయాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) చేసిన ప్రయత్నం విజయవంతం అయ్యింది. రూ.116 చెల్లించి బుక్‌ చేసుకుంటే కల్యాణం అనంతరం తలంబ్రాలను భక్తులకు హోం డెలివరీ చేయనుంది ఆర్టీసీ. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా తలంబ్రాల బుకింగ్‌ జరుగుతోంది.


ఆర్టీసీ ఉన్నతాధికారులు ఊహించిదానికంటే భారీగా భక్తుల నుండి స్పందన రావడంతో మరో అడుగు ముందుకేసిన టీఎస్ ఆర్టీసీ (TSRTC) భక్తులకు మరో అవకాశాన్ని  కల్పించింది. శ్రీరామ నవమి కల్యాణ సమయంలోనే కాకుండా.. తలంబ్రాలను ఎప్పుడైనా భక్తులు పొందే సదవకాశాన్ని అందుబాటులోకి తెచ్చింది. కార్గో పార్శిల్‌ సెంటర్‌కు (TSRTC Cargo Parcel Service) వెళ్లి రూ.116 చెల్లిస్తే నిర్ణీత సమయంలో తలంబ్రాలను భక్తులకు అందించనుంది. 


''భద్రాద్రి శ్రీ సీతారాముల కల్యాణ (Bhadradri Sitaramula Kalyanam) తలంబ్రాల కోసం ఒక్క తెలంగాణ నుంచే కాకుండా విదేశాల నుండి బుకింగ్స్ వస్తున్నాయి. దుబాయ్‌, అమెరికా వంటి దేశాల నుండి సైతం కాల్‌ చేసి తలంబ్రాలు కావాలని అడుగుతున్నారంటే ఆర్టీసీ ప్రయత్నం ఏ స్దాయిలో ఫలితాలిస్తుందో అర్థం చేసుకోవచ్చు. కేవలం 10 రోజుల్లోనే 50 వేల బుకింగ్‌లు వచ్చాయి. నియమ నిష్టలతో ధాన్యాన్ని గోటితో ఒలిచి తీసిన కోటి బియ్యం గింజలను తలంబ్రాలుగా చేసి భద్రాద్రి శ్రీ సీతారాముల కల్యాణోత్సవంలో ఉపయోగిస్తారు. విశిష్టమైన ఈ తలంబ్రాలను భక్తులు పొందేందుకు ఆసక్తి చూపిస్తున్నారని తెలిపారు టీఎస్‌ఆర్టీసీ ఛైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్థన్‌, ఎండీ వీసీ సజ్జనార్.


ఇలా బుక్ చేసుకోండి..


రాష్ట్రంలోని అన్ని టీఎస్‌ఆర్టీసీ కార్గో పార్శిల్‌ (TSRTC Cargo Parcel Services) కౌంటర్లలో తలంబ్రాలను బుక్‌ చేసుకోవచ్చని ఎండీ వీసీ సజ్జనార్ సూచించారు. ఈ సేవలను పొందాలనుకునే భక్తులు టీఎస్‌ఆర్టీసీ లాజిస్టిక్స్‌ విభాగ ఫోన్‌ నంబర్లు 9177683134, 7382924900, 9154680020ను సంప్రదించవచ్చని అంటున్నారు. తమ మార్కెటింగ్‌ ఎగ్జిక్యూటివ్‌లు భక్తుల వద్ద కూడా ఆర్డర్‌ను స్వీకరిస్తారని ఆర్టీసీ ఉన్నతాధికారులు తెలిపారు.